మహాశివరాత్రి వేళ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో టెన్షన్!
ఫిబ్రవరి 15వ తేదీ నేడు.. దేశమంతా మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుపుకుంటుంటే హైదరాబాద్లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మాత్రం ఉద్రిక్తత నెలకొంది. హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం ఒక్కసారి ఉలిక్కిపడింది. సింగపూర్ నుండి హైదరాబాద్ కు వస్తున్న విమానానికి బాంబు బెదిరింపు రావడంతో అధికారులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు.
సింగపూర్ హైదరాబాద్ విమానానికి బాంబు బెదిరింపు
సింగపూర్ నుండి హైదరాబాద్ వస్తున్న విమానంలో బాంబు పెట్టారని email రావడంతో సిబ్బంది అలర్ట్ అయ్యారు. విమానం సురక్షితంగా ల్యాండ్ అయిన తర్వాత ప్రయాణికులను క్షేమంగా కిందికి దించి, ప్రయాణికులు వెళ్లిపోయిన తర్వాత భద్రత సిబ్బంది విమానాన్ని ప్రత్యేక టెర్మినల్ వద్దకు తరలించి విస్తృత తనిఖీలను నిర్వహించారు. విమానంలో ఎక్కడ ఎటువంటి పేలుడు పదార్థాలు లభ్యం కాకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

రెండు నెలల వ్యవధిలో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు 23 నకిలీ కాల్స్
అయితే ఈ బెదిరింపు ఈమెయిలు నకిలీదని నిర్ధారించుకున్న తర్వాత పోలీసులు దీనిపైన కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు.గతంలోను అనేకసార్లు శంషాబాద్ ఎయిర్పోర్టుకు నకిలీ బాంబు బెదిరింపులు వచ్చాయి. గత డిసెంబర్ నుండి ఇప్పటివరకు రెండు నెలల వ్యవధిలో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు 23 నకిలీ కాల్స్, నకిలీ ఇమెయిల్స్ వచ్చాయి. ఈ కేసులలో ఇప్పటికే పలువురుని గుర్తించి అరెస్టు చేసిన పోలీసులు దీనిపైన లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
ఎయిర్పోర్ట్ అధికారులకు పోలీసులకు పెద్ద తలనొప్పి
పోలీసుల దర్యాప్తులో మరికొందరు విదేశాల నుంచి కూడా ఈ బెదిరింపులకు పాల్పడినట్టు తేలింది. అయితే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు ఈ మెసేజ్ లు, నకిలీ కాల్స్, నకిలీ ఇమెయిల్స్ ఎయిర్పోర్ట్ అధికారులకు పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారాయి. తాజాగా నేడు వచ్చిన ఈ మెయిల్ కూడా విదేశాల నుంచి వచ్చినట్టుగా పోలీసులు గుర్తించారు.
లోతుగా దర్యాప్తు చేస్తున్న అధికారులు
దీనిపైన లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. మూడు నెలల వ్యవధిలో ఇంత పెద్ద సంఖ్యలో బెదిరింపు కాల్స్, బెదిరింపు ఈమెయిల్స్ రావడంతో అధికారులు దీని వెనుక మరేదైనా ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications