పవన్ కళ్యాణ్ కు వీరంతా పొలిటికల్ ప్రొడ్యూసర్లు..ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు!
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై జడ్చర్ల ఎమ్మెల్యే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ పెద్ద అహంకారి అని ఆయన ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో జరిగే మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని చెప్పి తీరా సమయానికి రద్దు చేసుకున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నా కనీసం డిపాజిట్లు దక్కవనే భయంతోనే ఈనెల 7, 8తేదీలలో జరగవలసిన పర్యటనను విరమించుకున్నారని ఆయన వ్యాఖ్యలు చేశారు.
పవన్ కళ్యాణ్ కు వీరంతా ప్రొడ్యూసర్ లు
పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్రంలో ప్రచారం చేసినా ఇజ్జత్ పోవడం తప్ప వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ కు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రొడ్యూసర్ అని, మంత్రి లోకేష్ కో ప్రొడ్యూసర్ అని, ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొత్త ప్రొడ్యూసర్ గా తయారయ్యారని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి విమర్శలు గుప్పించారు.

జనసేన ఆంధ్రా పార్టీ, తెలంగాణాలో ఏం పెత్తనం
జనసేన ఆంధ్ర పార్టీ అని పేర్కొన్న అనిరుధ్ రెడ్డి అక్కడినుండి వచ్చి తెలంగాణలో పెత్తనం చేయడానికి ఇక్కడి ప్రజలు ఒప్పుకోరు అంటూ హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రం గురించి గతంలో పవన్ కళ్యాణ్ నోరుజారి మాట్లాడారని, ఆయన చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన కూడా పట్టించుకోలేదని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అన్నారు.
సినిమాల్లో పవన్ కళ్యాణ్ ఓకే కానీ రాజకీయాల్లో కాదు
కోనసీమలో కొబ్బరి చెట్లు ఎండిపోవడానికి తెలంగాణ ప్రజల దిష్టి కారణమని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారని గుర్తుచేసిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి, పవన్ కళ్యాణ్ నాడు అన్న మాటలు తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీశాయన్నారు.సినిమాల వరకు పవన్ కళ్యాణ్ ఓకే కానీ రాజకీయాలలో కాదన్నారు.ఇటీవల కొండగట్టు ఆలయానికి టిటిడి నిధులను ఇప్పించిన క్రమంలో పవన్ కళ్యాణ్ టీటీడీ నిధులు ఇప్పించి తన సొంతడబ్బు ఇచ్చినట్టుగా ప్రచారం చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆంధ్రా నేతలు ఇక్కడికి వచ్చేది అందుకే
ఆయన నటించిన చిత్రాలను తాము కూడా చూస్తామని జడ్చర్ల ఎమ్మెల్యే, ఇప్పుడు బీజేపీతో పొత్తు అంటూ రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ ఎవరితో పొత్తు పెట్టుకున్నా పర్వాలేదు కానీ, తెలంగాణ ప్రజలకు మాత్రం తప్పనిసరిగా క్షమాపణలు చెప్పాల్సిందేనని తేల్చి చెప్పారు. ఆంధ్ర నేతలు కేవలం తెలంగాణలోని భూములు నిధులు కోసమే వస్తున్నారని, ఇక్కడ ప్రజల పైన ప్రేమతో కాదంటూ అనిరుధ్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.












Click it and Unblock the Notifications