నేడు పెరేడ్ గ్రౌండ్స్ లో సభకు మోడీ.. హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు ఇలా!!
ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు హైదరాబాద్ కి రానున్నారు. సికింద్రాబాద్లోని పెరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించబోయే మాదిగల విశ్వరూప మహాసభకు ప్రధాని నరేంద్ర మోడీ హాజరుకానున్నారు. రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ వారం రోజుల్లో రెండు సార్లు పర్యటించటం విశేషం. తాజాగా బిసి సభలో పాల్గొన్న నరేంద్ర మోడీ బిజెపి గెలిస్తే బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని వెల్లడించారు.
ఇక మాదిగల విశ్వరూప మహాసభలో హాజరుకానున్న ప్రధాని మోడీ ఎస్సీ రిజర్వేషన్లపై ప్రకటన చేసే అవకాశం ఉందని అందరూ భావిస్తున్నారు.ఇక ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన నేపథ్యంలో హైదరాబాద్ లో ఈరోజు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు అనేక చోట్ల ట్రాఫిక్ మళ్ళింపు ఉంటాయని అదనపు పోలీస్ కమిషనర్ జి సుధీర్ బాబు వెల్లడించారు.

ఈ నేపథ్యంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలలో వెళ్లాలని ఆయన సూచించారు. మోడీ పర్యటన నేపథ్యంలో హైదరాబాద్ లో ఈరోజు ట్రాఫిక్ మళ్లింపు విషయానికి వస్తే పంజాగుట్ట- గ్రీన్ ల్యాండ్, బేగంపేట నుంచి సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ వరకు, టివోలీ ఎక్స్ రోడ్స్, ప్లాజా ఎక్స్ రోడ్స్ మధ్య రహదారులు మూసివేస్తున్నట్లు వెల్లడించారు.
సికింద్రాబాద్ సంగీత్ కూడలి నుంచి బేగంపేట వైపు వెళ్లే వై ఎం సి ఏ వద్ద క్లాక్ టవర్, ప్యాట్నీ, పారడైజ్, సిటి ఓ, రసూల్ పురా, బేగంపేట వైపు వెళ్లాలని సూచిస్తున్నారు.బేగంపేట వైపు వచ్చే వాహనాలు పంజాగుట్ట వద్ద ఖైరతాబాద్ గ్రీన్ ల్యాండ్, రాజభవన్ వైపు మళ్ళిస్తారు. ఇక ప్యాట్నీ నుంచి వచ్చే వాహనాలకు ఎస్బిహెచ్ స్వీకార్ ఉపకార్ వైపు అనుమతి లేదు. క్లాక్ టవర్, పారడైజ్, సిటిఓ వైపు మళ్ళిస్తారు.
ఆర్టిఏ కార్యాలయం కార్ఖానా, మల్కాజ్గిరి, సఫిల్ గూడా నుంచి ప్లాజా వైపు వచ్చే ట్రాఫిక్ స్వీకార్ ఉపకార్, వై ఎం సి ఏ, బ్రూక్ బాండ్, బాలంరాయ్, సీటీవో వైపు మళ్ళిస్తారు. బేగంపేట్ నుంచి సంగీత్ కూడలికి వచ్చే వాహనాలను సిటీ ఓ ఎక్స్ రోడ్స్ వద్ద బాలం రాయ్, బ్రూక్ బాండ్, టివోలీ, స్పీకార్ ఉపకార్, వై ఎం సి ఏ, సెయింట్ జాన్స్ రోటరీ మీదుగా మళ్లిస్తారు.
బోయినపల్లి, తాడ్ బండ్ నుంచి టివోలీ వైపు వచ్చే ట్రాఫిక్ ను బ్రూక్ బాండ్ వద్ద సీటీవో, రాణిగంజ్, ట్యాంక్ బండ్ వైపు మళ్ళిస్తారు. ఇక వాహనదారులు ఈ విషయాన్ని గుర్తించి అందుకు తగినట్టుగా ప్రయాణం చేయవలసి ఉంటుందని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications