Divyavani: చంద్రబాబు రాజకీయ గురువన్న దివ్యవాణి- కాంగ్రెస్ లో తన పాత్రపై క్లారిటీ !
టాలీవుడ్ నటి, మాజీ టీడీపీ నాయకురాలు దివ్యవాణి ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. తెలంగాణ ఎన్నికల సందర్భంగా ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా గతంలో టీడీపీ నుంచి బయటికి రావడానికి గల కారణాలు, చంద్రబాబుపై విమర్శలు, తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో పోషించబోయే పాత్ర వంటి అంశాలపై దివ్యవాణి క్లారిటీ ఇచ్చారు. తనపై జరుగుతున్న దుష్ప్రచారంపై దివ్యవాణి ఫైర్ అయ్యారు.
గతంలో టీడీపీలో యాక్టివ్ గా పనిచేసి ఆ తర్వాత రాజీనామా చేసి బయటికి రావడంపై దివ్యవాణి ఇవాళ స్పందించారు. కాంగ్రెస్ పార్టీ తీర్దం పుచ్చుకున్న తర్వాత మీడియాతో మాట్లాడిన ఆమె.. చంద్రబాబుపై తాను గతంలో విమర్శలు చేసినట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. చంద్రబాబు తనకు ఎప్పటికీ రాజకీయ గురువే అన్నారు. తనకు చంద్రబాబు అంటే ఎప్పటికీ గౌరవం ఉంటుందన్నారు. కొన్ని తలాతోకా లేని ఛానల్స్ తాను చంద్రబాబును దూషించినట్లు చూపించాయన్నారు.

చంద్రబాబును రాజకీయంగా ప్రేమించే వ్యక్తినని, పార్టీలో ఉన్న కొందరి ప్రవర్తన వల్ల టీడీపీని వీడాల్సి వచ్చిందని దివ్యవాణి తెలిపారు. తాను టీడీపీని వీడిన తర్వాత తెలంగాణలో పలు పార్టీలు తనను సంప్రదించినట్లు ఆమె వెల్లడించారు. కానీ చాలా రోజులు ఆగి కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకున్నట్లు దివ్యవాణి తెలిపారు. ప్రస్తుతానికి తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున స్టార్ క్యాంపెయినర్ గా వ్యవహరిస్తున్నట్లు దివ్యవాణి క్లారిటీ ఇచ్చారు.
తెలంగాణ ఎన్నికల వేళ దివ్యవాణి కాంగ్రెస్ లో చేరిక ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటివరకూ సినీ గ్లామర్ పై పెద్దగా ఆధారపడని కాంగ్రెస్ పార్టీ.. సడన్ గా టాలీవుడ్ మాజీ నటి అయిన దివ్యవాణిని పార్టీలో చేర్చుకోవడంతో దీనిపై చర్చ జరుగుతోంది. అలాగే టీడీపీ మూలాలున్న దివ్యవాణి ఆ పార్టీ నేతలతో ఉన్న సంబంధాలతోనే కాంగ్రెస్ లో చేరారా అన్న చర్చ కూడా నడుస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబును కీర్తిస్తూ ఆమె వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications