హైదరాబాదీలకు శుభవార్త.. ఉద్యాన్ ఉత్సవ్.. రాష్ట్రపతి నిలయంలోకి ఫ్రీ ఎంట్రీ!
బొల్లారం రాష్ట్రపతి నిలయంలో రెండవ ఉద్యాన్ ఉత్సవ్ అత్యంత ఘనంగా ప్రారంభమైంది. ఈ రెండవ ఉద్యాన ఉత్సవ్ ను ఈరోజు ఉదయం లాంఛనంగా ప్రారంభించారు.ప్రగతిశీల మహిళా రైతుల బృందం ఈ ఉత్సవాన్ని ప్రారంభించడం అన్నిటికంటే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నేటినుండి ఈ నెల 11వ తేదీ వరకు కొనసాగనున్న ఈ ఉద్యాన్ ఉత్సవాన్ని ప్రజలు ఉచితంగా సందర్శించవచ్చు.
బొల్లారం రాష్ట్రపతి భవన్ లో ఉద్యాన్ ఉత్సవ్
ప్రజలలో పర్యావరణ స్పృహను ప్రోత్సహించడం, ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించడం ప్రధాన లక్ష్యాలుగా ఉద్యాన ఉత్సవాన్ని ఏర్పాటు చేసినట్టు రాష్ట్రపతి భవన్ అధికారులు తెలిపారు. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ తో పాటు మేనేజ్ సంస్థ సహకారంతో ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవంలో సుమారు 50 స్టాళ్లలో 120 మంది తమ ఉత్పత్తులు, ఆవిష్కరణలను ప్రదర్శిస్తున్నారు.

ప్రధాన ఆకర్షణలు ఇవే
వ్యవసాయ రంగ ఆవిష్కరణలతో పాటు, విలువ ఆధారిత ఉత్పత్తులు, వ్యాపార అవకాశాలు ఈ ఉత్సవంలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. గ్రీన్ నాలెడ్జ్ హబ్, పోషక విలువలున్న చిరుధాన్యాలను ప్రోత్సహించే మిల్లెట్ మండి, స్టార్టప్ హబ్, సేంద్రీయ ఉత్పత్తులు, జీఐ ట్యాగ్ ఉత్పత్తులు, బయో ఇన్‌పుట్స్, గిరిజన హస్తకళలతో కూడిన ఎకో బజార్, నర్సరీ మొక్కల విక్రయానికి ప్లాంట్ అండ్ ప్రొడ్యూస్ విభాగాలు ఏర్పాటు చేశారు.
ఉత్పత్తులు కొనుగోలు చేసే ప్రత్యేక జోన్ ఏర్పాటు
రైతు ఉత్పత్తిదారుల సంఘాల నుంచి నేరుగా ఉత్పత్తులు కొనుగోలు చేసే ప్రత్యేక జోన్ కూడా ఏర్పాటు చేశారు.ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ సాంస్కృతిక కార్యక్రమాలు, అనేక ప్రాంతీయ కళారూపాలు అలరించనున్నాయి. భరతనాట్యం, కథక్, కూచిపూడి వంటి శాస్త్రీయ నృత్యాలు, పేరిణి శివతాండవం, ఒగ్గు డోలు వంటి ప్రాంతీయ కళారూపాలు, సంగీత కచేరీలు, హరికథ, బుర్రకథలు సందర్శకులను ఆకట్టుకుంటాయని రాష్ట్రపతి భవన్ వర్గాలు చెబుతున్నాయి.
ఉచితంగా వెళ్లి రావాలంటే ఇలా చెయ్యండి
అలాగే కుండల తయారీ, కూరగాయల కర్వింగ్, విత్తన బంతుల తయారీ వంటి అంశాలపై ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు.ఈ ఉద్యాన్ ఉత్సవాన్ని ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు రాష్ట్రపతి నిలయం లాన్స్‌లో ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకుని ఉచితంగా సందర్శించవచ్చు. రిజిస్ట్రేషన్ కోసం https://rb.nic.in/Rbnilayam/ వెబ్‌సైట్‌ను సందర్శించాలని అధికారులు సూచించారు. పర్యావరణ పరిరక్షణ ఎలా ఉంటే బాగుంటుంది అన్న దానిపైన ఈ ఉద్యాన్ ఉత్సవ్ ప్రజలకు ప్రేరణను ఇవ్వనుంది.












Click it and Unblock the Notifications