పోలీస్ స్టేషన్ కు వాస్తుదోషం; 10నెలల్లో 11మంది ఎస్సైలు బదిలీ!!
సహజంగా ఇంటికి వాస్తు దోషం ఉంటే వాస్తు దోష నివారణకు తగిన చర్యలు తీసుకుంటాం. వాస్తుకు అనుసారంగా మార్పులు చేర్పులు చేస్తాం. అయితే పోలీస్ స్టేషన్ కు ఎక్కడైనా వాస్తు దోషం ఉంటుంది అన్నది విన్నారా? వినకుంటే ఇప్పుడు వినండి. తెలంగాణ రాష్ట్రంలో ఒక పోలీస్ స్టేషన్ కు వాస్తు దోషంతో ఏం జరిగింది? అధికారులు ఏం చేశారు? అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.
తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నాగార్జునసాగర్ హైవేపై ఉన్న నల్గొండ జిల్లా చింతపల్లి పోలీస్ స్టేషన్ కు వాస్తుదోషం ఉంది అన్న ప్రచారం పెద్ద ఎత్తున సాగుతుంది. ఎందుకంటే ఈ పోలీస్ స్టేషన్ కు బదిలీపై వచ్చిన పోలీస్ అధికారులు వచ్చిన వాళ్ళు వచ్చినట్టే మళ్ళీ బదిలీపై వెళ్లిపోతున్నారని సమాచారం. పదినెలల కాలంలో 11 మంది ఎస్ఐలు మారడంతో ఈ పోలీస్ స్టేషన్ కు వాస్తుదోషం ఉందని స్థానికంగా చర్చ కొనసాగుతుంది.

ఒకప్పుడు చింతపల్లి పోలీస్ స్టేషన్ కు పోలీస్ శాఖలో విపరీతమైన క్రేజ్ ఉండేది. ఈ పోలీస్ స్టేషన్లో పోస్టింగ్ కోసం ఎస్సైలు పోటీపడేవారు. సిఫార్సుల కోసం రాజకీయ నాయకులు చుట్టూ తిరుగుతూ ఉండేవారు కానీ ఇప్పుడు ఈ పోలీస్ స్టేషన్ కు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. క్లీన్ చిట్ ఉన్న ఎస్ఐలకు సైతం ఈ పోలీస్ స్టేషన్ కి వెళ్తే వివాదాలు చుట్టుముడుతున్నాయి అని సమాచారం.
ఈ క్రమంలోనే పది నెలల కాలంలో 11 మంది ఎస్సైలు బదిలీ అయినట్టుగా తెలుస్తుంది. చింతపల్లి పోలీస్ స్టేషన్ కు వాస్తు దోషం అని ఇటు పోలీస్ శాఖలోనూ చర్చ జరుగుతున్న వేళ పోలీస్ శాఖ ఉన్నతాధికారులు నివారణ చర్యలు మొదలుపెట్టారు. పోలీస్ స్టేషన్ కు ముందున్న ప్రహరీ గోడను కూల్చివేసి వాస్తు దోష నివారణకు పనులు చేస్తున్నారు.
ఈ చర్యతో స్టేషన్ కు పట్టిన వాస్తు దోషం తొలిగిపోతుందా.. ఈ పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఎస్సైలు కొంతకాలం పాటు ఎలాంటి వివాదాల్లో చిక్కుకోకుండా ఇక్కడే విధులు నిర్వర్తిస్తారా అనేది తేలాలంటే వేచి చూడాల్సిందే.












Click it and Unblock the Notifications