తప్పుడు పత్రాలతో రోడ్లపై తిరిగితే చర్యలు.!వాహనాలను సీజ్ చేస్తున్నామన్న నగర సీపీ.!
హైదరాబాద్ : లాక్‌డౌన్ ఆంక్షలను పోలీసులు కఠినంగా అమలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఏదో ఒక కారణంలో రోడ్లపైకి వచ్చి పోలీసులకు ఏదోఒక కారణం చెప్పి ఉడాయించే బ్యాచ్ లను చాలా వరకు నియంత్రిస్తున్నట్టు తెలుస్తోంది. ద్విచక్ర వాహనంతో బయటికి వచ్చిన తర్వాత ఎందుకు బయటకు వచ్చారో సరైన కారణం చెప్పలేకపోతే వారి వాహనాన్ని తాత్కాలికంగా అంటే లాక్‌డౌన్ ఆంక్షలు ఉన్నన్ని రోజులు సీజ్ చేసేందుకు పోలీసులు రంగం సిద్దం చేసారు. పోలీసులు చేస్తున్న ఈ ప్రయోగం సత్పలితాలనిస్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం లాక్‌డౌన్ విధించి శుక్రవారానికి 11రోజులు కావస్తోంది. దాదాపు 10రోజుల వరకూ కాస్త ఉదాసీనంగా వ్యవహరించిన పోలీసులు 11వ రోజునుండి ఆంక్షలను కఠినంగా అమలు చేస్తున్నట్టు హైదరాబాద్ సీపి అంజనీ కుమార్ తెలిపారు. అవసరమైన చోట లాఠీలను కూడా ఝుళిపిస్తున్నట్టు పేర్కొన్నారు.
అంతే కాకుండా హైదరాబాద్ వ్యాప్తంగా లాక్‌డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేసేందుకు పోలీసులు రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నారు. లాక్‌డౌన్ నిబంధనలు కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని తాజాగా ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు.

ఈ రోజు నగరంలోని చాలా ప్రాంతాల్లో తనిఖీ సెంటర్లను పరిశీలించారు హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్. నగర ప్రజలంతా లాక్‌డౌన్ నిబంధనలు పాటించాలని ఆయన సూచించారు. తమ కమిషనరేట్ పరిధిలో 180 తనిఖీ కేంద్రాలు ఉన్నాయని చెప్పారు. లాక్‌డౌన్ మినహాయింపులు ఉన్నవారికే రోడ్లపై తిరగడానికి అనుమతి ఉంటుందని, తప్పుడు పత్రాలతో రోడ్లపై తిరిగితే చర్యలు తీసుకుంటామని సీపి చెప్పారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చే వాహనాలను సీజ్ చేస్తామని తెలిపారు. ప్రజలంతా లాక్‌డౌన్ నిబంధనలు పాటిస్తూ ఇళ్లల్లో ఉండాలని సీపీ అంజనీ కుమార్ సూచించారు.












Click it and Unblock the Notifications