ఈ రెండు బిగ్ టాస్క్ లలో సీఎం రేవంత్ రెడ్డి సక్సెస్ అవుతారా?
తెలంగాణ రాష్ట్రంలో సీఎం గా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన నాటి నుండి దూకుడుగా ముందుకు వెళుతున్నారు. సీఎం గా బాధ్యతలు చేపట్టి, పాలన పగ్గాలు చేపట్టిన తొలి నాడే ఆయన ప్రజా దర్బార్ ను మొదలుపెట్టి అందరి దృష్టిని ఆకర్షించారు. ఇక శాఖల వారీగా సమీక్షలు, ప్రక్షాళనలు మొదలుపెట్టిన రేవంత్ రెడ్డి సీఎంగా ఏ మేరకు సక్సెస్ అవుతారు? అన్నది ఇప్పుడు అందరిలో ఆసక్తిగా మారింది.
ఇదే సమయంలో ఆయన టీపీసీసీ అధ్యక్షుడిగా రానున్న లోక్ సభ ఎన్నికలను ఏ విధంగా ఫేస్ చేస్తారు? అన్నది కూడా ఆసక్తిగా మారింది. తెలంగాణా రాష్ట్రంలో గడచిన దశాబ్ద కాలంగా పరిపాలన సాగించిన బీఆర్ఎస్ సమయంలో రాష్ట్రంలో జరిగిన పురోగతి మాట అటుంచి రాష్ట్రం అప్పుల పాలయ్యింది అన్నది తెలుస్తుంది.

రాష్ట్రంలో ఒక్క విద్యుత్ శాఖలోనే 81వేల కోట్ల రూపాయల విద్యుత్ బకాయిలు ఉన్నాయని చెప్తున్నారు. ఈ క్రమంలో అప్పుల ఊబిలో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి మార్గంలో నడపటం, ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు హామీలను 100 రోజుల్లో నెరవేర్చటం అన్నది సీఎం రేవంత్ రెడ్డి ముందు ఉన్న పెద్ద టాస్క్.
ఈ పని చేస్తూనే కాంగ్రెస్ అధిష్టానం బాగా నమ్మి అప్పగించిన మరోపనిని సక్సెస్ చెయ్యటం కూడా రేవంత్ రెడ్డి ముందున్న అతి ముఖ్యమైన బాధ్యత. అదే లోక్ సభకు త్వరలో జరగనున్న ఎన్నికలు, లోక్ సభకు త్వరలో జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటేలా అత్యధిక స్థానాలను గెలుచుకోవాలి అన్నది కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ కి ఇచ్చిన టాస్క్.
ఒక పక్క రాష్ట్రంలో పరిస్థితులను చక్కదిద్దుతూ పాలన సాగించటంతో పాటు, అత్యంత ముఖ్యమైన పార్లమెంట్ ఎన్నికలలో అత్యధిక సీట్లు సంపాదించటం రేవంత్ రెడ్డి చెయ్యాలి. ఇది మాటల్లో చెప్పినంత ఆషామాషీ టాస్క్ కాదు. మరి రేవంత్ రెడ్డి దమ్ము ఈ టాస్క్ తోనే తేలిపోనుంది. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి ఈ రెంటినీ బ్యాలెన్స్ చేస్తూ కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో అధికార పార్టీగా, పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు సాధించిన పార్టీగా ముందుకు ఏ మేరకు తీసుకువెళతారు అన్నది తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications