TTD: రేపు తిరుమల శ్రీవారికి పౌర్ణమి గరుడసేవ; మరో విశేష వేడుక కూడా!!
తిరుమలలో పౌర్ణమి సందర్భంగా ఫిబ్రవరి 24వ తేదీన అంటే రేపు స్వామివారికి గరుడ సేవను నిర్వహించనున్నారు. పౌర్ణమి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో గరుడసేవ జరుగనుంది. ప్రతి నెల పౌర్ణమి పర్వదినాన టీటీడీ గరుడసేవ నిర్వహించే విషయం తెలిసిందే. ఇక ఇందులో భాగంగా రాత్రి 7 గంటల నుండి 9 గంటల మధ్య సర్వాలంకార భూషితుడైన శ్రీ మల్ల అయ్యప్ప స్వామి వారు తిరుమల వీధులలో ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు.
ఈ వేడుక తో పాటు రేపు టిటిడి ఆధ్వర్యంలో ఫిబ్రవరి 24వ తేదీన శ్రీ కుమారధార తీర్థ ముక్కోటి ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు . శ్రీ కుమారధార తీర్థ ముక్కోటి పర్వదినాన భక్తులు తీర్థ స్నానమాచరించి, దానధర్మాలు చేసి స్వామివారిని దర్శించుకుంటారు. ప్రకృతి సౌందర్యాల నడుమ కుమారధార తీర్థంలో స్నానమాచరించడాన్ని భక్తులు ప్రత్యేకంగా భావిస్తారు.

శ్రీ కుమార తీర్థ ముక్కోటికి సంబంధించి ఒక కథనం ప్రాశస్త్యం లో ఉంది. వరాహ మార్కండేయ పురాణాల ప్రకారం శేషాచల కొండలలో ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఒంటరిగా తిరుగుతూ ఉండేవాడట. అతనికి శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షమై ఈ వయసులో నీకు చెవులు వినిపించవు.. కళ్ళు కనిపించవు, అడవిలో ఏం చేస్తున్నావ్ అంటూ ప్రశ్నించారట.
ఇక ఆ వృద్ధ బ్రాహ్మణుడు యజ్ఞ యాగాలు చేసి దైవ రుణం తీర్చుకోవాలని తలంపుతో ఇలా తిరుగుతున్నానని సమాధానం చెప్పాడట. అప్పుడు స్వామి వారు అక్కడ ఉన్న తీర్థంలో స్నానం చేసి రమ్మని చెప్పగా అక్కడ స్నానమాచరించిన వృద్ధుడు పదహారేళ్ళ నవ యువకుడిగా మారిపోయారు అట. ఇక ముసలితనం నుంచి యువకుడిగా మారడంతో అక్కడ తీర్థానికి కుమారధారాతీర్థమన్న పేరు వచ్చిందని కథ .
మరో కథనం ప్రకారం పద్మ, వామన పురాణాల ప్రకారం దేవలోకం సేనాధిపతి కుమారస్వామి రాక్షసుడైన తారకాసురుడి సంహారం తరువాత శాపవిమోచనం కోసం ప్రయత్నించాడని, శివుని సూచన మేరకు శేషాచల పర్వతాల్లోని వృషాద్రిలో తపస్సు చేశాడని చెప్తారు. అనంతరం ఈ తీర్థంలో స్నానమాచరించి శాపవిమోచనం పొందాడని, సాక్షాత్తు కుమారస్వామివారుస్నానం చేయడం వల్ల ఈ తీర్థానికి 'కుమారధార' అనే పేరు స్థిరపడిందని చెబుతారు.
ఏది ఏమైనా ఈ కుమారధార తీర్థంలో స్నానమాచరిస్తే అనారోగ్య బాధలు పోతాయని, ఆరోగ్యంగా యవ్వనంగా ఉంటారని అది ముక్కోటి నాడు స్నానమాచరించడం పరమ పుణ్యాలను అందిస్తుందని చెబుతారు. అందుకే రేపు శ్రీ కుమారధార తీర్థ ముక్కోటి ఘనంగా నిర్వహించడానికి టిటిడి ఏర్పాట్లు చేస్తుంది.












Click it and Unblock the Notifications