Margadarsi Chits : మార్గదర్శి అక్రమాలు తేలితే మూసేస్తాం-జగన్ సర్కార్ వార్నింగ్
ఏపీలో మార్గదర్శి చిట్స్ సంస్ధ చేస్తున్న అక్రమాలపై వరుసగా కొరడా ఝళిపిస్తున్న ప్రభుత్వం ఇవాళ కీలక విషయాలు బయటపెట్టింది.
విజయవాడ : ఏపీలో మార్గదర్శి చిట్స్ సంస్ధ కొన్నేళ్లుగా చేస్తున్న అక్రమాలపై ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి. దీనిపై సుప్రీంకోర్టులోనూ కేసు నడుస్తోంది. ఈ నేపథ్యంలో వైసీపీ సర్కార్ మార్గదర్శి సంస్ధలపై కొంతకాలంగా దాడులు చేస్తోంది. ఇందులో భాగంగా నలుగురు మేనేజర్లను అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చింది. వీరిలో ముగ్గురిని రిమాండ్ కు కూడా పంపింది. ఈ నేపథ్యంలో మార్గదర్శి అక్రమాలపై ఇవాళ అధికారులు పూర్తి వివరాలు బయటపెట్టారు.
మార్గదర్శి అక్రమాలపై ఏడు ప్రాంతాల అసిస్టెంట్ రిజిస్ట్రార్ల నుంచి సీఐడీకి ఫిర్యాదులు వచ్చాయని ఏపీ సీఐడీ ఛీఫ్ సంజయ్ ఇవాళ వెల్లడించారు. విశాఖ, విజయవాడ, రాజమండ్రి గుంటూరులో ఫోర్మెన్ ఆఫ్ చిట్స్ ను విచారణ చేసామన్నారు. 1982 చిట్ ఫండ్ యాక్ట్ 76, 79 సెక్షన్ల ప్రకారం నిబంధనలకు విరుద్ధంగా వెళ్లారని గుర్తించినట్లు తెలిపారు. అన్ని బ్రాంచుల నుంచి డబ్బు మొత్తం వేరే చోటకు వెళ్ళిపోతుందన్నారు.

చిట్టీదారులకు తన డబ్బు ఎక్కడికి వెళ్తుందో తెలియదని సంజయ్ తెలిపారు. జవాబుదారీతనం లేదని తెలడంతో ఎఫ్ఐఆర్ నమోదు చేశామన్నారు. కస్టమర్ల డబ్బును వేరే చోట ఇన్వెస్ట్ చేయడం చిట్స్ రూల్సుకు వ్యతిరేకమని ఆయన పేర్కొన్నారు. విశాఖ, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు బ్రాంచుల ఫోర్మెన్లను కోర్టులో ప్రవేశపెట్టినట్లు సీఐడీ ఛీఫ్ సంజయ్ తెలిపారు. చిట్సులో ఎలాంటి నిబంధనలు ఉంటాయో ప్రజలకు తెలియదని, అసిస్టెంట్ రిజిస్ట్రార్ల అనుమతితోనే చిట్ ప్రారంభించాలని ఆయన తెలిపారు.

మార్గదర్శి రాష్ట్ర వ్యాప్తంగా 37 బ్రాంచీలు నిర్వహిస్తుందని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఐజీ రామకృష్ణ వెల్లడించారు. ఫోర్మెనుకు ఎలాంటి చెక్ పవర్ లేకపోవడం నిబంధనలకు విరుద్ధమన్నారు. ఏపీలో అడిగితే హైదరాబాదులో ఉందని చెబుతారని, అక్కడికి వెళ్తే సమాధానం చెప్పడం లేదని ఆయన తెలిపారు. ప్రజల డబ్బుకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. మార్గదర్శి నిధులు ఉషోదయ కంపెనీకి తరలిస్తున్నారన్నారు. ప్రజల సొమ్మును వారికి తెలియకుండా మూచ్యువల్ ఫండ్సుకు తరలించారన్నారు. సీఐడీ విచారణతో పాటు చిట్ ఫండ్ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. మార్గదర్శి యాజమాన్యం అక్రమాలు ఎస్టాబ్లిష్ అయితే కంపెనీని మూసివేస్తామని రామకృష్ణ హెచ్చరించారు.












Click it and Unblock the Notifications