వైఎస్ జగన్ దూకుడు- 7న మరోసారి..!!
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోమారు బటన్ నొక్కి నిధులను విడుదల చేయనున్నారు. ఈ దఫా జగనన్న విద్యాదీవెన కింద నిధులను విడుదల చేయనున్నారు.
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవలే గుంటూరు జిల్లా తెనాలిలో పర్యటించారు. వరుసగా నాలుగో సంవత్సరం వైఎస్సార్ రైతు భరోసా- పీఎం కిసాన్ పథకం కింద పంట నష్ట పోయిన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీని ఆయన పంపిణీ చేశారు. ఎప్పట్లాగే- 2024 సార్వత్రిక ఎన్నికల్లో తాము ఒంటరిగా పోటీ చేయబోతోన్నామనీ స్పష్టం చేశారు. దమ్ముంటే పొత్తుల్లేకుండా పోటీ చేయాలంటూ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ, జనసేనలకు సవాల్ విసిరారు.
చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను కూడా జగన్ తన ప్రసంగంలో ప్రస్తావించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. చంద్రబాబు- కరవు కవల పిల్లలంటూ పరోక్షంగా ఎద్దేవా చేశారు. కరవుకు కేరాఫ్ అడ్రస్ అంటూ చురకలు అంటించారు తమ ప్రభుత్వ హయాంలో అలాంటి దుస్థితి లేదని గుర్తు చేశారు. 2019 నుంచీ రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురుస్తో్నాయని, రిజర్వాయర్లు, చెరువులు నిండుతున్నాయని పేర్కొన్నారు.

ఫలితంగా వ్యవసాయ దిగుబడులు రికార్డు స్థాయిలో పెరిగాయనీ చెప్పుకొచ్చారు జగన్. తాము పేదలు, రైతన్నల సంక్షేమం కోసం పని చేస్తోన్నామని, అందుకే ప్రకృతి కూడా సహకరిస్తోందంటూ వ్యాఖ్యానించారు. దుష్టచతుష్టయం ఒక్కటైనప్పటికీ.. 2024 నాటి ఎన్నికల్లో తమ విజయాన్ని అడ్డుకోలేరని, దేవుడి ఆశీస్సులు, ప్రజల ఆదరాభిమానాలతో మళ్లీ రాష్ట్రంలో ఏర్పడేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమేనంటూ ధీమా వ్యక్తం చేశారు.
తెనాలి పర్యటన ముగిసీ ముగియగానే.. ఇప్పుడిక ఎన్టీఆర్ జిల్లాలో పర్యటించడానికి జగన్ సమాయాత్తమౌతోన్నారు. ఈ దఫా ఆయన జగనన్న విద్యాదీవెన కింధ నిధులను విడుదల చేయనున్నారు. ఈ నెల 7వ తేదీన ఎన్టీఆర్ జిల్లాలో పర్యటించనున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి అంటే అక్టోబర్-డిసెంబర్ మధ్యకాలానికి సంబంధించిన నిధులు ఇవి. నిజానికి కిందటి నెల 28వ తేదీ నాడే దీన్ని విడుదల చేయాల్సి ఉన్నప్పటికీ సాధ్యపడలేదు.
వైఎస్సార్ రైతుభరోసా-పీఎం కిసాన్ నిధులను విడుదల చేయాల్సి ఉన్నందున దీన్ని వాయిదా వేసింది ప్రభుత్వం. తాజాగా ఈ నెల 7వ తేదీన జగనన్న విద్యాదీవెన కింద నిధులను పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఎన్టీఆర్ జిల్లాలో ఎక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారనేది ఇంకా ఖరారు కాలేదని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications