వైఎస్ షర్మిల సీఎం కేసీఆర్ ను తాలిబన్ అంటే గవర్నర్ తమిళిసై సమర్ధిస్తారా!!
వరంగల్ : నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి వైయస్ షర్మిల ను టార్గెట్ చేస్తూనే ఉన్నారు. నిన్న వైయస్ షర్మిల గవర్నర్ తమిళిసై ని కలిసి నర్సంపేట నియోజకవర్గంలో జరిగిన దాడి ఘటనపై, నర్సంపేట పోలీసుల తీరుపై, ఆపై తనను అరెస్టు చేసిన ఘటనపై ఫిర్యాదు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలనపై గవర్నర్ కు తెలియజేసిన షర్మిల ఈ విషయంలో గవర్నర్ జోక్యం చేసుకోవాలని అన్ని ఆధారాలతో, వినతిపత్రం ఇచ్చారు. ఇక వైయస్ షర్మిల గవర్నర్ ను కలవడం పై మాట్లాడిన పెద్ది సుదర్శన్ రెడ్డి వైయస్ షర్మిల డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు
రెండు రోజుల క్రితం నర్సంపేటలో జరిగిన ఘటనలో వైయస్ షర్మిలకు గాయమైందని టీవీలో చూపించారని, తీరా నిన్న టీవీలలో చూస్తే ఆ గాయం మాయమై పోయిందని, ఆమె ఏ డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నారో తెలంగాణ ప్రజలకు చెప్పాలని పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రశ్నించారు. వైయస్ షర్మిల తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ను కలిశారని పేర్కొన్న ఆయన గవర్నర్ తమిళ సై కి తాను విజ్ఞప్తి చేస్తున్నా అంటూ కొన్ని విషయాలను ప్రస్తావించారు.

మొన్న జరిగిన ఘటన లో అయిన గాయం, ఒక్కసారిగా ఎలా మాయం అయిందో షర్మిలను తమిళిసై అడిగితే బాగుండేదని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఆఫ్ఘనిస్తాన్ తో పోల్చిన వైయస్ షర్మిల తో మాట్లాడిన గవర్నర్, గవర్నర్ గా తెలంగాణ రాష్ట్రానికే పని చేస్తున్నారా లేక ఆఫ్ఘనిస్థాన్ కా అంటూ పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రశ్నించారు. వైయస్ షర్మిల చేసిన ఈ వ్యాఖ్యలపై గవర్నర్ గా మీరు కచ్చితంగా స్పందించాలని పేర్కొన్న ఆయన వైయస్ షర్మిల ముఖ్యమంత్రిని తాలిబన్ గా పోల్చడాన్ని రాష్ట్ర గవర్నర్ గా మీరు సమర్థిస్తారా అంటూ ప్రశ్నించారు.
ఇప్పటికైనా ఇలాంటి అసత్య ప్రచారాలు మానుకోవాలని షర్మిల కు విజ్ఞప్తి చేస్తున్నాం అని పేర్కొన్న పెద్ది సుదర్శన్ రెడ్డి, మొన్న జరిగిన దాడి ఘటన మీరు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వల్లే జరిగిందని, అది స్థానికంగా ఉన్న మహిళల నుండి వచ్చిన రియాక్షన్ అని పెద్ది సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు, వ్యక్తిగత విషయాలు తీసుకొచ్చి సమస్యలు సృష్టించుకోకుండా ప్రజా సమస్యల మీద మీరు రోజు పాదయాత్ర చేయాలని వైయస్ షర్మిల కు హితవు పలికారు. మళ్లీ వైయస్ షర్మిల ఏ నియోజకవర్గంలో అయినా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే, తెలంగాణ ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. ఇటువంటి డ్రామాలు మరోసారి చెయ్యొద్దు అంటూ పెద్ది సుదర్శన్ రెడ్డి వైయస్ షర్మిల ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు.












Click it and Unblock the Notifications