• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

టాంటెక్స్ 100వ నెలనెలా తెలుగు వెన్నెల(పిక్చర్స్)

|

టెక్సాస్: తెలుగు భాష ఉన్నతిని కాపాడుకోవడమే లక్ష్యంగా ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) గత 30సంవత్సరాలుగా విశేష కృషి చేస్తోంది. తెలుగు భాషకు, సాహితీ వేత్తలకు ప్రత్యేకంగా ఒక వేదిక ఉండాలని గుర్తించి ‘నెల నెలా తెలుగు వెన్నల' అనే కార్యక్రమాన్ని ‘100 నెలలు' నిరాటంకంగా నిర్వహించింది.

 100th Tantex Nela Nela Vennela held in Dallas

గత శనివారం(నవంబర్ 21) డల్లాస్ నగరంలో ‘100వ సాహిత్య సదస్సు' మహోత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా కళారత్న కేవి సత్యనారాయణ, విశిష్ఠ అతిథి వియన్ ఆదిత్య, టాంటెక్స్ కార్యవర్గం, పాలకమండలి సభ్యులు, సాహిత్యవేదిక సభ్యులు విచ్చేయగా, సాహితీ వేత్తల జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభమైంది.

టాంటెక్స్ అధ్యక్షులు డా. ఊరిమిండి నరసింహరెడ్డి మాట్లాడుతూ.. 100 నెలల క్రితం మొదలైన ఈ సాహితీ సౌరభం దిన దిన ప్రవర్ధమానం అవడం మన తెలుగు జాతి ఐక్యతకు నిదర్శనమన్నారు.

 100th Tantex Nela Nela Vennela held in Dallas

తెలుగు భాషాభిమానులు తోటకూర ప్రసాద్, పులిగండ్ల విశ్వనాథం, రావు కల్వల, ఎంవిఎల్ ప్రసాద్, డా. పుదూర్ జగదీశ్వరన్ 2007లో ప్రారంభించిన ఈ సాహితీ యజ్ఞానికి ప్రముఖ సాహితీవేత్త వంగూరి చిట్టెన్ రాజు 'నెల నెలా తెలుగు వెన్నెల' అని నామకరణం చేశారని గుర్తు చేశారు.

సంవత్సర ప్రథమార్ధంలో నిర్దేశించిన ‘ప్రగతి పథంలో పది సూత్రాలు' ఒక్కొక్కటి క్రమంగా కార్యరూపం దాల్చడం, వాటిని నెరవేర్చడం చాలా సంతోషంగా ఉందన్నారు. నెల నెలా తెలుగు వెన్నెల "100వ సదస్సు"లో ఎంతో మంది పాల్గొని, భాషాభిమానాన్ని చాటిచెప్పారని కొనియాడారు.

 100th Tantex Nela Nela Vennela held in Dallas

చావలి మంజు హేమమాలిని సమర్పణలో గురు పరంపర డాన్స్ అండ్ మ్యూజిక్ స్కూల్ బాల బాలికలు జొన్నవిత్తుల రచించిన 'జయ జయ మనోజ్ఞ జనని' గీతాన్ని మధురంగా ఆలపించి తెలుగు తల్లి వైభవాన్ని గొప్పగా వివరించారు. తెలుగు సాహిత్య వేదిక సమన్వయకర్త దండ వెంకట్ ప్రారంభోపన్యాసం చేశారు.

మన సాహితీ సంపదను కాపాడుకోవడానికి, సాహితీ పండితులను గౌరవించడానికి ప్రయత్నం ఒక ఎత్తయితే, వీటిని భావితరాలకు అందించడం అంతే ముఖ్యమని, ఈ ఏడాదిలో ఇంతవరకు దాదాపు 40 మంది బాల బాలికలు పాల్గొని తమ సాహిత్య ప్రతిభను ప్రదర్శించిన తీరును కళ్లకద్దినట్లు వివరించారు.

మన భాష, సాహిత్యం విరాజిల్లేందుకు చేయి చేయి కలిపి అందరం కృషి చేద్దామని పిలుపునిచ్చారు. కెబి లక్ష్మి "పేరడీ సూరీడు" జలసూత్రం రుక్మిణీ నాథ శాస్త్రి గురించి మాట్లాడుతూ.. ఆయనకు జారుక్ శాస్తి, రుక్కాయి లాంటి ఎన్నో కలం పేర్లు ఉండేవని, సంస్కృత, తెలుగు భాషల్లో గొప్ప పండితుడు అని, కవిత్వం, వచనం రెండింటి మీదా సమస్థాయిలో పేరడీలు రాసి సాహితీ దిగ్ధంతుల గుండెల్లో గుబులు పుట్టించిన ఘనుడని అన్నారు.

 100th Tantex Nela Nela Vennela held in Dallas

శ్రీశ్రీ మహాప్రస్థానం కవితా సంపుటికి చలం చేత ముందుమాట రాయించడంలో ఆయన కృషిని కొనియాడారు. జొన్నవిత్తుల రచించిన 'చక్కర కలిపిన కమ్మని తీయని' గేయాన్ని ఓంకారి నిఖిత ఆలపించారు. డా. పుదూర్ జగదీశ్వరన్ 'చాటు పద్య వైభవాలు' గురించి మాట్లాడుతూ.. ‘శ్రీనాథుడే కాక ఎంతో మంది చక్కటి చాటు పద్యాలు రాసారని, చాటు పద్యాలలో అంతర్లీనంగా చురుక్కుమనిపించే అర్ధాలు ఎంతో హాస్య ప్రధానంగా, అర్ధవంతంగా ఉంటాయి' అని వివరించారు.

కోట ప్రభాకర్ 'తెలుగు పదానికి జన్మదినం' అంటూ చేసిన గాత్రం మన భాష పుట్టుకను గుర్తు చేసింది. వంగూరి ఫౌండేషన్ అఫ్ అమెరికా చారిటబుల్ సంస్థ అధ్యక్షులు వంగూరి చిట్టెన్ రాజు "తెలుగులో పేరడీలు...పేరడీల లో హాస్యం, అపహాస్యం.." గురించి వివరించారు. వెంపటి హేమ రచించిన 'కలికి కథలు' అనే 50 కథల సమగ్ర సంపుటి వంగూరి ఫౌండేషన్ అఫ్ అమెరికా 59వ ప్రచురణగా ఈ ప్రతిష్టాత్మకమైన సదస్సులో ఆవిష్కరించబడింది.

వేముల లెనిన్ మహాకవి శ్రీశ్రీ రచించిన మహాప్రస్థానం నుండి 'కవితా ఓ కవితా' కవితను గుక్క తిప్పుకోకుండా, అక్షరం పొల్లు పోకుండా, హావభావాలతో చేసిన కవితా గానానికి అందరూ పరవశులయ్యారు. మనబడి విద్యార్ధులు 'మా తెలుగు కవులకు జోహార్' ఎంతో రమ్యంగా ఆలపించి కవులకు వందనాలు అర్పించారు.

 100th Tantex Nela Nela Vennela held in Dallas

మద్దుకూరి విజయ చంద్రహాస్ 'కవితా పఠనం, కవితా గానం' గురించి ప్రసంగిస్తూ కవిత ఎప్పుడూ లోలోపల చదివేది కాదు, బయటకు చదివినప్పుడే ఆ భాషా సౌందర్యాన్ని గ్రహించగలము అని ఎన్నో విలువైన విషయాలను చెప్పారు. బాల బాలికలకు తెలుగు విద్యను అందించే 'మనబడి' కార్య నిర్వాహకులు రాయవరం భాస్కర్ 'పిల్లలలో మన సాహిత్యంపై ఆసక్తి రేకెత్తించడం' గురించి మాట్లాడుతూ.. ‘ఆశయం ఉన్నతమైతే అందరికి ఆదర్శం అవుతుంది' అని పలికారు.

విశిష్ట అతిధి వియస్ ఆదిత్య 'చలన చిత్ర సాహిత్యంలో మార్పులు' గురించి మాట్లాడుతూ.. "కొత్త సినిమాలు వస్తాయి, మారతాయి, కాని సాహిత్యం ఎప్పటికీ నిలిచి ఉంటుంది" అన్నారు. రచయితలు సినిమాకు ఏది కావాలో అదే ఇస్తారు, వారిచేత మంచి రచనలు చేయించుకోవడం దర్శకుల బాధ్యత అంటూ, మనసంతా నువ్వే, భైరవద్వీపం సినిమాలనుండి కొన్ని భాషకు ఉపయుక్తమైన సన్నివేశాలు గుర్తుచేసుకొన్నారు.

వేటూరి సుందర రామమూర్తితో తమ అనుభంధం గుర్తుచేసుకొంటూ ‘అటువంటి గొప్ప రచయితలు లేని లోటు సిరివెన్నల సీతారామశాస్త్రి వలన కొంతవరకు తగ్గింది అని, తెలుగు సినీ రచయితలు అందరూ చక్కటి రచనలు చేయగలరు, వారికి అటువంటి సినిమాలను అందించే బాధ్యత దర్శకులపై ఉంది' అని గుర్తుచేశారు.

 100th Tantex Nela Nela Vennela held in Dallas

ఈరోజు 'డిజిటల్ రంగం'లో సాధించిన అభివృద్ధి చూస్తే, స్టూడియోలు లేకున్నా కూడా ఔత్సాహికులు చక్కని లఘు చిత్రాలను డిజిటల్ కెమెరా సాయంతో నిర్మించి తమ సత్తా చాటుకోవచ్చు అన్నారు. సాహిత్య వేదిక సభ్యురాలుఅట్లూరి స్వర్ణ 100వ సదస్సు ఉత్సవం సందర్భంగా రూప కల్పన చేసిన "కలం" వియన్ ఆదిత్య ఆవిష్కరించారు.

డా. రాళ్ళబండి కవితా ప్రసాద్ రచించిన మాతృ భాషా దృశ్య సౌందర్య నృత్య రూపకం "నృత్యాక్షరి", ముఖ్య అతిధి, కళా రత్న కేవి సత్యనారాయణ నృత్య దర్శకత్వంలో అమెరికాలో మొట్టమొదటి సారిగా ప్రదర్శించబడింది. ఈ అక్షర యజ్ఞం చూసిన ప్రతి ఒక్కరి మనసు ఫలకాలపై చెరగని ముద్ర వేసింది. మన మాతృ భాష గొప్పతనాన్ని కళ్ళకు కట్టినట్లు ఈ నృత్యాక్షరిలో ప్రదర్శించిన తీరు మంత్రముగ్దులను చేసింది.

 100th Tantex Nela Nela Vennela held in Dallas

భువనవిజయ సభలో శ్రీ కృష్ణ దేవరాయలకు పెద్దనామాత్యులు అక్షర అవిర్బావము గూర్చి వివరించినశైలి, కైలాసంలో శివపార్వతుల ఆనందతాండవం తరువాత నందీశ్వరుడు కోరికమేరకు శివుడు 14 సార్లు ఢమరుకం మ్రోగించినంత అక్షరములు ఏవిధంగా సృష్టించబడినవి, ఈ అక్షరములు అచ్చులు, హల్లులుగా ఏ విధంగా పాoతరము చెందినవో, వాటి విశిష్టత ఎమిటో నృత్య రూపకంలో ప్రదర్శించిన విధానం సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది.

కేవి సత్యనారాయణ ఆధ్వర్యంలో దాదాపు 50 మంది స్థానిక చిన్నారులు, పెద్దలు ఐదు రోజులలోనే శిక్షణ తీసుకొని అద్భుతంగా ప్రదర్శన ఇవ్వడం ఎంతో ప్రశంసనీయం. నృత్యాక్షరిలో పాల్గొన్న ప్రతి కళాకారునికి కేవి సత్యనారాయణ ప్రశంసా పత్రాలు ఇచ్చి, గురువులకు సత్కారం చేశారు.

 100th Tantex Nela Nela Vennela held in Dallas

అట్లూరి స్వర్ణ సభా ప్రాంగణాన్ని అలంకరణ చేసిన తీరు, పల్లకి, అన్ని అంశాలను మంచి ఆలోచనతో కూర్పు చేసిన పూర్వ సాహిత్య కార్యక్రమ ఛాయా చిత్రాలు అందరిని ఆకట్టుకున్నాయి. సాహిత్య వేదిక పూర్వ సమన్వయకర్తలు కన్నెగంటి చంద్ర, మల్లవరపు అనంత్, డా. ఊరిమిండి నరసింహా రెడ్డి, జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, సింగిరెడ్డి శారద, ఆదిభట్ల మహేష్ ఆదిత్యల సేవలను కొనియాడి సత్కరించారు.

100వ సాహిత్య సదస్సు సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన, అంతా తెలుగు మయం, క్విజ్, ఫోటో కవిత పోటీలలో విజేతలకు టాంటెక్స్ కార్యవర్గం, సాహిత్య వేదిక సభ్యులు ప్రశంసా పత్రాలు అందచేశారు.

పోతన పద్యాలను పిల్లలకు శిక్షణనిస్తున్న దొడ్ల రమణని శాలువ, జ్ఞాపిక తో సత్కరించారు. ముఖ్య అతిధి కళారత్న కేవీ సత్యనారాయణ ఉత్తరాధ్యక్షులు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, ఉపాధ్యక్షులు ఉప్పలపాటి కృష్ణారెడ్డి శాలువాతో, అధ్యక్షులు డా. ఊరిమిండి నరసింహారెడ్డి జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు.

 100th Tantex Nela Nela Vennela held in Dallas

విశిష్ట అతిధి వియస్ ఆదిత్య శాలువా, జ్ఞాపికతో సత్కరించారు. సమన్వయ కర్త దండ వెంకట్ మాట్లాడుతూ.. 100 నెలలు ఒక యజ్ఞంలా 'నెల నెలా తెలుగు వెన్నెల' కార్యక్రం నిరాటంకంగా సాగడానికి కారకులైన సభ్యులకు, కార్యకర్తలకు, భాషాభిమానులకు, సాహితీ ప్రియులకు, పోశకదాతలకు ధన్యవాదాలు తెలిపారు.

నృత్యాక్షరి రూపకం విజయవంతం కావడానికి సహాయ సహకారాలు అందించిన కూచిపూడి నృత్య గురువులు శ్రీలత సూరి, పద్మ సొంటి, డా. కలవగుంట సుధ, చావలి మంజు హేమమాలిని, రూప బంద, యడ్లపాటి శ్రీదేవిలకు ధ్యన్యవాదాలు.

English summary
100th Tantex Nela Nela Vennela programme held in Dallas, in America.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X