వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలుగు వచన కవిత్వానిది నా ఒరవడే: గుంటూరు శేషేంద్రశర్మ

By Staff
|
Google Oneindia TeluguNews

నెల్లూరులో జన్మించిన గుంటూరు శేషేంద్రశర్మ కవిగా ప్రాంతాలకు, భాషలకు అతీతుడు. గత 55 ఏళ్లుగా కవితా వ్యవసాయం చేస్తున్న ఆయన కవితాసంకలనాలనేకం అచ్చయ్యాయి. ''కవిత్వం ఎమోషనల్‌ ఎలిమెంట్‌ వల్ల ఉదయిస్తుంది. ఈ ఉద్వేగం అందరికీ ఒక్కటే. భాష వల్ల కవిత్వం ఒక ప్రాంతానికి పరిమితం కాకూడదు'' అనే కవి శేషేంద్రశర్మ తెలుగు కవిత్వానికి సమాంతరంగా ఆంగ్లానువాదం అచ్చవుతుంది. ఈయన కావ్యాలన్నీ హిందీలోకి అనువాదమయ్యాయి. 'నా దేశం నా ప్రజలు' కావ్యం ఉర్దూలో కూడా అచ్చయింది. పాకిస్థాన్‌లో యువకవులు 'నా దేశం నా ప్రజలు' కవిత్వాన్ని అనుకరిస్తూ ఉర్దూ కవిత్వం రాస్తున్నారని రెషమిదా రిహాజ్‌ అనే కవయిత్రి శేషేంద్రను కలిసి చెప్పారు.

ఈ కావ్యం గ్రీసు భాషలోకి కూడా అనువాదమైంది. అక్కడ తన కవిత్వాన్ని వీధుల్లో పాడుకుంటూ తిరుగుతారని ఆయన చెప్పారు. తనకు బీహార్‌ నుంచి రాజస్థాన్‌ వరకు, హిమాచల్‌ ప్రదేశ్‌ నుంచి మధ్యప్రదేశ్‌ వరకు, బెంగాల్‌, నేపాల్‌లో, భారతదేశంలోని హిందీ ప్రాంతాలలో అనేక మంది పాఠకలున్నారని ఆయన చెప్పారు. అందుకు సాక్ష్యం తన పుస్తకానువాదాలు, హిందీలో అచ్చయిన తన జీవితవిశేషాల గ్రంథం, తన కవిత్వంలో జరిగిన పరిశోధనలు అని చెబుతూ ఆ పుస్తకాలను శేషేంద్ర చూపించారు. కవిత్వానికి ఎల్లలు లేవని నిరూపిస్తున్న తెలుగు కవి గుంటూరు శేషేంద్ర శర్మది చిక్కని కవిత్వం. ఆయన కవిత్వంలో పచ్చి వచనం మచ్చుకైనా కనిపించదు. ఆయనతో 'ఇండియా ఇన్ఫో' ఇంటర్వ్యూ-

మీ కవిత్వాన్ని మీరు ఎట్లా విశ్లేషించుకుంటారు?
నా కవిత్వం నా జీవన అనుభూతుల్లోంచి రాలిపడిన పంక్తులు. జీవితమనే పెనుతుపాను తరుముతూ పోతుంటే నేనప్పుడు పరుగెడుతూ పడిపోయి నేను గాయపడినప్పుడు రాలిపడే రక్తపుబొట్లు ఆ పంక్తులలో వుంటాయి. నా కవిత్వంలో ఎక్కువ రుద్ధస్వరం వుంటుంది. మన తోటి మానవుడు పడే కష్టాలు, దుఃఖాలు నేను విస్తృతంగా చూశాను. నేను చేసిన ప్రభుత్వోద్యోగం కూడా దానికి మూలకారణమైంది. నేను చేసిన మున్సిపల్‌ కమిషనర్‌ ఉద్యోగం విశాల మానవ దర్శనాన్ని నాకు ప్రసాదించింది. ఎందరో పీడితుల్ని, శోషితుల్ని, అర్థనగ్న దేహాలను, ఫుట్‌పాతే ఇళ్లుగా బ్రతికే జీవుల్ని, ఆకలిచావుల్ని కళ్లారా చూశాను. అవన్నీ చూసినప్పుడు నా హృదయం బద్దలైంది. అప్పుడు నా అనుభూతులను విచిత్రమైన మాటలలో అభివ్యక్తి చేయడం, ఆ మాటలు కూడా వాటి క్రమంలో విచిత్ర విన్యాసం కలిగి వుండడం చేత వాటిని కవిత్వమని, నన్ను కవి అని సమాజంలో పిలవడం జరిగింది.

తెలుగు కవిత్వంలో మీ స్థానం ఏమిటనుకుంటున్నారు?
నేను కవిత్వం రాయడం ప్రారంభించి 55 ఏళ్లు అయింది. నా పుస్తకాలనేకం వచ్చాయి. నా పుస్తకాలు మూడు నెలల్లో వేయి ప్రతులు అమ్ముడు పోయేవి. ఆంధ్రదేశంలోని నలుమూలల నుంచి ఉత్తరాల వర్షం కురిసేది. దూరదూరప్రాంతాల నుంచి అనేకులు వచ్చి నన్ను కలిసి మాట్లాడి వెళ్తుండేవాళ్లు. ఇన్నేళ్లుగా నాకు అటువంటిది దైనిక కార్యక్రమం అయింది. నా అనుభవంలోని రెండు, మూడు సంఘటనలు చెబుతాను. ఒకసారి నేను లైబ్రరీలో పుస్తకాలు చూస్తుంటే టెలిగ్రామ్‌ పట్టుకుని పోస్ట్‌మన్‌ గబగబా వచ్చాడు. ''మీ వాళ్లు ఎప్పుడూ నేరుగా టెలిగ్రామ్‌ మీకు నన్ను ఇవ్వనీయడం లేదు. దీని వల్ల మిమ్ముల్ని చూసే అవకాశం రావడం లేదు. ఇవ్వాళ్ల వాళ్లని పక్కకు తోసి వచ్చా. మిమ్ముల్ని ఒక్క మాట అడగాలి. 'నేనింత పిటికెడు మట్టే కావచ్చు/ కలమెత్తితే నాకు ఒక దేశపు జెండాకున్నంత పొగరు వుంది'-ఇది మీరే రాశారు కదా అన్నాడు. ఈ పద్యం నీకెట్లా వచ్చునని అడిగాను. మా ఆఫీసులో లంచ్‌ టైమ్‌లో మీ పుస్తకాలు చదువుతుంటామని చెప్పాడు.

తమ కొత్త కార్యాలయం ప్రారంభోత్సవానికి ఒక బిల్డర్స్‌ అసోసియేషన్‌వాళ్లు నన్ను ఆహ్వానించారు. లక్షాధికారులు, కోటీశ్వరులు- వీళ్లకు కవిత్వం మీద ఆసక్తి ఉండకపోవడంలో ఆశ్చర్యం లేదు అనుకుంటారు. కానీ వాళ్లు నా కవితల్ని ఉదహరిస్తూ ఉపన్యాసాలు చేశారు. ప్రారంభోత్సవ కార్యక్రమం ముగిసిన తర్వాత నన్ను ఇంట్లో దింపడానికి కారు పంపారు. కారు కొంచెం దూరం వచ్చాక డ్రైవర్‌- ''మీరు 'నేను పంచదార చినుకునై నీ కాఫీకప్పులో రాల్తాను/ నేను రోజాపువ్వునై నీ వాజులో దూరతాను/ నీవు కన్నెత్తి చూడకుంటే/ పద్యమనే పది అంతస్థుల మేడ ఎక్కి / నేల మీదికి దూకుతాను' అని చాలా బాగా చెప్పారు. వారం రోజుల క్రితం నాకు పెళ్లయింది. నా భార్య ఎం.ఎ. చదివింది. ఆమెకు మీ పుస్తకాలు కంఠస్థం వచ్చు'' అని చెప్పాడు. ఇట్లాంటివెన్నో అనుభవాలున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X