కథలకు దిక్సూచి సుజాత

Posted By: సంగిశెట్టి శ్రీనివాస్
Subscribe to Oneindia Telugu

పత్రికల్లో కథలు అచ్చు కావడమనేది తెలంగాణలో 1913 నుంచే ఆరంభమైనా అది 1927లో సుజాత స్థాపనతో ఊపందుకుంది. 1923-24లో వరంగల్లు నుంచి వెలువడిన ఆంధ్రాభ్యుదయము కూడా కొన్ని కథలను ప్రచురించింది. నీలగిరి, తెనుగు పత్రికలు కూడా అప్పుడప్పుడు కథలు ప్రచురించాయి. తెలంగాణ సాహిత్యానికి ప్రోత్సాహమిచ్చే ఉద్దేశ్యంతో 1927లో స్థాపించిన సుజాతను మైలురాయిగా, దిక్సూచిగా చెప్పాలి. ఈ పత్రిక తొలి దశలో 1927 జనవరి నుంచి 1930 జనవరి వరకు వెలువడింది. ఇందులో ప్రతినెలా కథలు చోటు చేసుకునేవి. తర్వాతి కాలంలో గోలకొండ పత్రిక కొంత మేరకు కథానికలకు చోటిచ్చింది. అలాగే భాగ్యరెడ్డి వర్మ సంపాదకత్వంలో వెలువడ్డ భాగ్యనగర్, ఆదిహిందూ పత్రికల్లో దళితుల కథలు కదిలించే కథనంతో వెలువడ్డాయి.

1944లో గులామ్ అహ్మద్ కలకత్తావాలా హైదరాబాదులో ఉర్దూ, ఇంగ్లీషు, తెలుగు భాషల్లో మీజాన్ పత్రికను స్థాపించాడు. ఏ కారణం వల్లనో తెలియదు కానీ కలకత్తావాలా తెలుగు పత్రికకు స్థానికేతరుడైన అడివి బాపిరాజును సంపాదకుడిగా నియమించారు. స్వతహాగా కథకుడైన బాపిరాజు కథలకు అధిక ప్రాధాన్యమిస్తూ ప్రతి వారం మంచి కథల్ని ప్రచురించేవాడు. ఈ పత్రికలో అడివి బాపిరాజు, ఆయన కూతురు రాధావసంత కథలతో పాటుగా భాస్కరభట్ల కృష్ణారావు, వట్టికోట ఆళ్వారుస్వామి, సింగరాజు లింగమూర్తి, గిడుతూరి సూర్యం, పి. వెంకటేశ్వరరావు తదితరుల కథలు ప్రచురితమయ్యాయి. ఎందరో కథకులు తమ తొలి కథలను మీజాన్ ద్వారానే వెలువరించారు. అంతగా, చదువుకోని ఆవుల పిచ్చయ్య అనే అతను రాసిన కథల్ని మీజాన్ ప్రచురించింది.

ఈ దశలోనే రాచమళ్ల సత్యవతీదేవి సంపాదకత్వంలో అభ్యుదయ రచయితల సంఘం పక్షాన సికింద్రాబాద్ నుంచి వెలువడ్డ తెలుగుతల్లి, గుండవరపు హనుమంతరావు సంపాదకత్వంలో వెలువడ్డ ఆంధ్రకేసరి, పాములపర్తి సదాశివరావు కాకతీయ, దేవులపల్లి రామానుజరావు శోభ, అడ్లూరి అయోధ్య రామకవి భాగ్యనగర్, బోయినపల్లి వెంకటరామారావు సారస్వతజ్యోతి, హిందీ ప్రచార సభ వారి స్రవంతి పత్రికలు కథలకు ప్రాధాన్యమిచ్చి ప్రచురించాయి. ఈ పత్రికలు తెలంగాణ కథానికా వికాసానికి చేసిన సేవలు మరువలేనివి.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Sangisetti Srinivas on Telangana Magazines

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి