ఒకానొక కప్ప
రాత్రి పది గంటలు -
ఇంటి ముందు కుర్చీలో కూర్చుని
అలవోకగా పరిసరాలను పరిశీలిస్తుంటే -
చర్మ ఖండంలాంటి ఉదరంతో పెద్ద కప్ప
చూపులు తప్ప నోరు లేనట్లు
ఒకేసారి కుడి ఎడమ పరికిస్తూ -
అడుగడుగుకూ మధ్య అది సజీవ శిల్పం
రెప్పపాటులో నోరు తెరిచి మూసేస్తుంది
సమీపంలో ఎగురుతున్న రెక్కల పురుగును
దాని నాలుక గాలమై లాగేసింది.
సుదూరాన పరుగెత్తుతూ ఒక గండు చీమ -
అడుగడుగునా ఆగి ఆగి వ్యూహాలు పన్నే కప్ప
వేగంగా రెండు గెంతులు వేసి ఆగింది
మరు క్షణం చీమ అదృశ్యం.
గోడ మీది కీటకాన్ని అందుకోడానికి
అనేక పర్యాయాలు ఎగిరిన కప్ప, దారి మార్చుకుంది..
గోడ మీద నాచు మరక...
తన ప్రతి అడుగునూ రహస్య జైత్ర యాత్రగా భావించే కప్ప
రాత్రి ఎవరి పాదాల కింద నలిగిందో
మరుసటి ఉదయం నా దారిలో
పేగులు బయట పడిన మృతదేహం.












Click it and Unblock the Notifications