డా. పులిపాటి గురుస్వామి కవిత

నీవు కొందరితో ఉన్నప్పుడు
మనసు నాట్యం చేయడానికి
పురి విప్పుకుంటుంది
చాలా దీర్ఘదాహం తర్వాత
చల్లటి చెట్టు కింద మంచినీళ్లు
చేతికి అందివచ్చినట్లు ఉంటుంది
తొలకరి చినుకులకు
భూమి సిగ్గు వాసన
కమ్మని రహస్యం విప్పినట్టు ఉంటుంది
కార్తీకపు వెన్నెల
దాచిపెట్టి దాచిపెట్టి
ఒక్కసారిగా
నీ మీద ఒలకపోసినట్టుంటుంది
కురవడానికి సిద్ధంగా ఉన్న
మబ్బులు కమ్మిన ఆకాశం
నీ చుట్టూ
ముసురుకున్నట్టుంటుంది
ప్రపంచమంతా
నీ కిటికీ గుండా
కనిపించడమే మానివేస్తుంది
నీవు కొందరితో ఉన్నప్పుడు
నీ వెంట వచ్చిన వయసంతా
ఆనందపు కర్పూరమవుతుంది
2
కాలమొకటి పిల్చుకు వెళ్తుంది
వారించి,
వెనక్కి చూపులు నడవనివ్వక
కొంచెం ముందర నీకో
రహస్యం విప్పే అవసరం కోసం
సుతిమెత్తని తెల్లని లిల్లీల వంటి చేతిని
పట్టుకుని
కాలమొకటి పట్టుకు వెళ్తుంది
ఇప్పటి దాకా ఏం జరిగిందో
అదేమీ నిన్ను నిలదీయదు
నీ గమనంలో అలసిపోయిన
కండరాలు
అవి పాడే పాటలు
నువు చేరుకోలేకపోయిన
శిఖరపు మెట్లు
నీపై ఫిర్యాదు చేసిన మీదట
కాలమొకటి నీ కోసం సుగంధాల
దారిని వెతికి తెస్తుంది
మాట్లాడే రహస్యాలు
కన్నుల చివర్లలో దాచుకున్న
విషాదాల చీకటి రేకలు
కొన్ని నిద్ర రాని రాత్రుల
కిటికీ మీద వాలిన
చీకటి కప్పిన కథలు
దు:ఖపు సాయంకాలాల మీద
జోరుగా కురిసిన ఒంటరివాన
నీలోపలి పరిచితుడు కాని వానికి
తేనెల జల్లు విసురుకుంటూ
తడిసిన నీ చిత్తడి తపనల
ఓదార్చుకుంటూ
కాలమొకటి నీ కోసం
ఆకుపచ్చని వెన్నెల దారిని
పట్టుకు వస్తుంది
పాలపిట్ట సౌజన్యంతో












Click it and Unblock the Notifications