'సాఫ్ట్' ఊడిగాలు, అమెరికన్నేమో!

ఎవరి అడుగుజాడలో
జనప్రవాహం ఆవలికి లాక్కెళితే
మౌనం మోహించి పూసులాడుతుంది
ఆనవాళ్లు ఇవ్వని ుపదం
భావం చెబుతుంది కుంచెకు
గీసే ప్రతి గీతా, వేసే ప్రతి రంగూ
అనంతానంద తాదాత్మ్యం వైపు
పుడమి అద్వితీయ సౌధంలోకి
దారి తీయిస్తుంది ఓ ఆలాపనతో
ఇంకేం కావాలి?
త్యాగయ్య, దీక్షితులు
టాగోర్, షెల్లీ, షా.. లూ
లాలించి, హెచ్చరించి, తెరలు తీసి
లోకాన్ని చూసి కవ్వించి, నవ్వించి..
ఇంకేం కావాలి??
ఆచరణలేగా మహద్భాగ్యాలన్నీ
జీవనసారమంతా కవితాఝరేగా?
ఆ ఆనంద తరంగాన్ని కలిగి వుండాలి
కన్నీళ్లన్నీ ప్రశాంతంగా దాటేయలంటే!
నేనెవర్ని?
ఐడెంటిటీ కార్డే నేను
కార్పోరేట్ సౌందర్యం వెనుక
'సాఫ్ట్' ఊడిగాలు
'చాట్' పలకరింపులు, భాష
'టై' లేకుంటే కొరగానివాడు
నేను అమెకరిన్నేమో!
గతంలో ఇండియన్నే!!
నిజమే
తరగిపోయే అందమే... యావత్ సృష్టీ
యేటి అలల్లో విరిగే మెరుపు
జీవనసంద్రం అంచున జ్ఞాపకాల పడవా
అన్నీ అద్భుతాలే...
నిన్ను కలవాలన్న తలపు
వీడనున్న మృత్యువూ!
మోహం
ఎన్నాళ్లయినా ఎదురు చూస్తుంది
శతాబ్దాల కోర్కెలా
ఆనంద తెర దాటిస్తుంది
గాఢ ప్రేమతో మృత్వువు!
ఏ పసితనమం, ఏ సిద్ధాంతం
పట్టి లాగదు మరే ఆలోచనా...
దశ తిరిగి తీరం దాటుతోంటే!
మన మధ్య....
మనిద్దరం అనుకుంటాం
ఎలా పసిగడుతాయో
అక్షరాలు, పదాలు, పాటల పలవరింతలూ
ఒక్కసారిగా దాడి చేస్తాయి
పాత్రలూ, పేర్లూ, అందం, ఆనందాలూ
అన్నీ అంతే.. తెరలే తెంచుకోవాలి
అప్పుడే ఆనంద కైవల్యం!
- టి లలితాప్రసాద్












Click it and Unblock the Notifications