కవిత: ఆకలి కొరుక్కునే నక్క పిల్ల
రోడ్డుపక్క బక్కచిక్కిన నక్కకూన
(కళ్లల్లో మెరుపు - ఆకలి ఆకలిగా)
నిర్దయగా దాటేసి వెళ్లలేకపోయాను
*
అరచేతిలో గులాబీ
ముల్లునొకదాన్ని గుచ్చి
కళ్లల్లోకి మురిపెంగా చూసే లోకంలో
చిరునవ్వొకటి విరిగి
కొండచిలువ కౌగిట్లో కరిగిపోయినప్పుడు
వణికిన ఎండలో తొణికి పిగిలిన పాటను ఏరి
ఎండిన పువ్వులతో పాటు దాచుకున్నాను

*
గాలి ఇక ఏమీ మాట్లాడదు, వెనకనుంచి వచ్చీ హత్తుకోదు
చేతివేళ్ల మధ్య ఖాళీలో రికామిగా ఈలవేస్తుంది
కొమ్మచివర కాగితంపువ్వు కూడా పలకరించదు
మెత్తగా ఊగుతూ గుప్పెడు కలలను నాలోకి వెదజల్లుతుంది
*
అగాథాన్నీ తాకినా
ఇక ప్రయాణం ఆకాశంవైపే
- మమత కొడిదెల












Click it and Unblock the Notifications