IPL 2024: ఐపీఎల్ కు ముందు ధోనీ ఫిట్ నెస్ ఎలా ఉంది ?
టీమిండియాకు టీ20 వరల్డ్ కప్, వన్డే వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీలు అందించిన ఏకైక కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారధి కూడా అయిన మహేంద్ర సింగ్ ధోనీ... ఈ ఏడాది ఐపీఎల్ తర్వాత రిటైర్మెంట్ తీసుకోబోతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తన రిటైర్మెంట్ పై వస్తున్న వార్తలపై ధోనీ ఇప్పటివరకూ నేరుగా స్పందించలేదు. అదే సమయంలో అసలు ఈసారి ఐపీఎల్ టోర్నీలో పూర్తిస్దాయిలో ఆడేందుకు ధోనీకి ఫిట్ నెస్ ఉందా లేదా అన్న చర్చ కూడా జరుగుతోంది.
ఈ నేపథ్యంలో మహేంద్ర సింగ్ ధోనీ మాజీ సహచరుడు, అతని నాయకత్వంలోని టీమిండియాలో బౌలర్ గా ఉన్న ఇర్ఫాన్ పఠాన్ స్పందించాడు. తాజాగా స్టార్ స్పోర్ట్స్ కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ధోనీ రిటైర్మెంట్ పై వస్తున్న వార్తల్ని పఠాన్ ఖండించాడు. తాను నెల రోజుల క్రితం ధోనీని కలిశానని, గతంలోలా అతను జులపాల జుట్టుతో ఉన్నాడని, అలాగే గతంలోలా ఫిట్ గా కూడా కనిపిస్తున్నాడని వెల్లడించాడు.

40 ఏళ్లు దాటినా ఇప్పటికీ ధోనీ చాలా ఫిట్ గా కనిపిస్తున్నాడని, తన అభిమానుల కోసం, ఫ్రాంచైజీ కోసం తన ఆటను కొనసాగించబోతున్నాడని ఇర్ఫాన్ పఠాన్ వెల్లడించాడు. దీంతో ధోనీ రిటైర్మెంట్, ఫిట్ నెస్ పై జరుగుతున్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పడినట్లయింది. ఇప్పటికే ఐపీఎల్ లో రోహిత్ శర్మతో కలిసి అత్యంత విజయవంతమైన కెప్టెన్ గా రికార్డు కొనసాగిస్తున్న ధోనీ.. ఈసారి చెన్నై సూపర్ కింగ్స్ కు మరో టైటిల్ అందిస్తే అత్యంత విజయవంతమైన నాయకుల జాబితాలో టాప్ కు చేరుకోవడం ఖాయం.












Click it and Unblock the Notifications