T20 World Cup 2026: వరల్డ్ కప్ కు తప్పించడంపై నోరువిప్పిన గిల్..! విధి రాత..!
ఈ ఏడాది భారత్-శ్రీలంక ఉమ్మడిగా ఆతిధ్యమిస్తున్న టీ20 వరల్డ్ కప్ కు ఎంపిక చేసిన టీమ్ ఇండియాకు సెలెక్టర్లు తనను పక్కనబెట్టడంపై వన్డే కెప్టెన్ శుభ్ మన్ గిల్ తొలిసారి స్పందించాడు. వరల్డ్ కప్ టీమ్ ఎంపిక తర్వాత మౌనంగా ఉండిపోయిన గిల్.. రేపు భారత్-న్యూజీలాండ్ టీ20 సిరీస్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో దీనిపై స్పందించాడు. వరల్డ్ కప్ కు ఎంపిక కాకపోవడం తన విధిరాత అని ఈ స్టార్ బ్యాటర్ తేల్చేశాడు.
భారత్-కివీస్ తొలి టీ20 ప్రారంభం నేపథ్యంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో మీడియా అడిగిన ప్రశ్నకు శుభ్ మన్ గిల్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశాడు. మొదట తన జీవితంలో తాను ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటానని తన నమ్మకం అన్నాడు. తన విధిలో ఏది రాసి ఉందో, అదే తనకు దక్కుతుందన్నాడు. ఒక ఆటగాడిగా, తన జట్టు కోసం ఆట గెలవాలని తాను కోరుకుంటున్నట్లు గిల్ వెల్లడించాడు.

మరోవైపు టీ20 వరల్డ్ కప్ కు తనను ఎంపిక చేయని సెలెక్టర్ల నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్లు శుభ్ మన్ గిల్ తెలిపాడు. వరల్డ్ కప్ ఆడబోతున్న టీ20 జట్టుకు గిల్ శుభాకాంక్షలు తెలిపాడు. వారు ప్రపంచ కప్ గెలవాలని తాను ఆశిస్తున్నట్లు తెలిపాడు. వన్డే కెప్టెన్ గా ఎంపికైన తర్వాత గాయాలపాలై కోలుకుతున్న తర్వాత మళ్లీ టీమ్ ఇండియాలోకి వచ్చిన గిల్ కు సెలెక్టర్లు వరల్డ్ కప్ కు షాకిచ్చారు. ఎవరూ ఊహించని విధంగా టీ20 వరల్డ్ కప్ కు ఎంపిక చేయకుండా దూరం పెట్టారు. భవిష్యత్ ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకుని గిల్ ను పక్కనబెట్టినట్లు సెలెక్టర్లు ఇప్పటికే స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications