Ind vs Pak: భారత్-పాక్ మ్యాచ్ -కొలంబోపై అల్పపీడనం-షాకింగ్ వెదర్ రిపోర్ట్..!
ఇవాళ శ్రీలంకలోని కొలంబో (colombo) వేదికగా జరిగే భారత్-పాకిస్తాన్ (india pakistan match) టీ20 వరల్డ్ కప్ (T20 world cup 2026)మ్యాచ్ పై వర్షపు నీడలు కమ్ముకుంటున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా కొలంబోలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందన్న వార్తలు సగటు క్రీడాభిమానుల్ని కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అసలే భారత్-పాకిస్తాన్ మ్యాచ్ జరిగే అవకాశం లేదనే పరిస్ధితి నుంచీ యథాతథంగా మ్యాచ్ జరిపించేందుకు చాలా మంది కష్టపడ్డారు. ఇప్పుడు ఆ కష్టం అంతా వర్షంపాలయ్యేలా ఉంది.
కొలంబోపై అల్పపీడనం (colombo)
భారత్-పాకిస్తాన్ మధ్య టీ20 ప్రపంచ కప్ 2026 మ్యాచ్ మరికొన్నిగంటల్లో ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఇవాళ కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్‌లో వర్షం ప్రధాన పాత్ర పోషించే అవకాశం ఉంది. వాతావరణ సూచన ప్రకారం.. ఇవాళ వర్షం కురిసే అవకాశం 94 శాతం ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉందని, దీనివల్ల భారీ వర్షాలు కురుస్తాయని శ్రీలంక వాతావరణ శాఖ కూడా షాకింగ్ అప్డేట్ ఇచ్చింది. ఒకవేళ మ్యాచ్ జరగకపోతే రిజర్వ్ డే కూడా లేనందున ఇరుజట్లకూ తలో పాయింట్ ఇవ్వక తప్పదు.

వెదర్ రిపోర్ట్స్
ఇవాళ ఉదయం కొలంబోలో 96 శాతం వర్షం పడే అవకాశం ఉందని అక్యూవెదర్ అంచనా వేసింది. ఆ తర్వాత వర్షం తగ్గి సాయంత్రం కల్లా మ్యాచ్ ఆడే పరిస్దితి ఉన్నా... దీని ప్రభావం కచ్చితంగా పిచ్ పై ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఉదయం వర్షం కురిస్తే.. ఈ మ్యాచ్‌లో రెండు జట్లకు స్పిన్ బౌలింగ్ కీలకంగా మారుతుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఇరుజట్లలోనూ పార్ట్ టైమర్లతో కలిపి కనీసం ముగ్గురు, నలుగురు స్పిన్నర్లు ఉన్నారు.

ఓవర్ల కుదింపు లేదా రద్దు ?
ఇవాళ ఉదయం కొలంబో మేఘావృతమై ఉంది. నిన్న సాయంత్రం తేలికపాటి వర్షం కురిసింది, శ్రీలంకలోని ఇతర ప్రాంతాలలో, ముఖ్యంగా తూర్పు, దక్షిణ ప్రావిన్సులలో మధ్యాహ్నం 1 గంట తర్వాత భారీ వర్షం కురుస్తుందని అంచనా. కొలంబో పశ్చిమ ప్రావిన్స్‌లో ఉంది, కాబట్టి ఇది పొడిగా ఉంటుందని స్థానిక అంచనా. అయితే రాత్రిపూట మాత్రం పొగమంచుతో కూడిన వాతావరణం ఉంటుందని తెలుస్తోంది. మధ్యలో వర్షం కురిస్తే మాత్రం ఓవర్లను కుదించాల్సి వస్తుంది.












Click it and Unblock the Notifications