• search
  • Live TV
ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

మీడియా తెలంగాణ కుట్ర

By కె నిశాంత్
|

Telangana
తెలంగాణకు వ్యతిరేకంగా మీడియా చాలా పకడ్బందీగా పనిచేస్తోంది. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుకు, తెరాసకు సంబంధించిన వార్తలను టీవీ చానెళ్లు గానీ, తెలుగు పత్రికలు గానీ అనివార్యమైన స్థితిలోనే ఇస్తున్నాయి. ఆ వార్తలకు అమ్మకం విలువ ఉంది కాబట్టి ఇస్తున్నాయి. లేదంటే వాటిని ప్రచురించకుండా మౌనం పాటించేవి. చాలా కాలం అలా చేసిన వైనం తెలంగాణకు అనుభవంలో ఉంది. అయితే వార్తలను వార్తలుగా కాకుండా, సమాచారాన్ని అందించడం వరకే కాకుండా వాటిని విచ్ఛిన్నం చేసి దురభిప్రాయం కలిగించేలా ప్రసారం చేయడం కూడా వాటికి ఆనవాయితీగా మారింది. ఇందులో భాగంగానే కెసిఆర్ ఆమరణ నిరాహార దీక్షకు సంబంధించిన వార్తలను టీవీ చానెళ్లు ప్రసారం చేస్తున్నాయి. ఏదో రకంగా కెసిఆర్ విశ్వసనీయతపై అనుమానాలు కలిగే విధంగా చేయడం వాటికి అవసరంగా మారింది. మిగతా నాయకులు నిరాహార దీక్షలు చేసిన సందర్బంలో ప్రభుత్వాలు వ్యవహరించిన తీరుకు, కెసిఆర్ నిరాహార దీక్ష చేయడానికి పూనుకున్నప్పుడు అనుసరించిన తీరుకు గల తేడాను ఎత్తి చూపడంలో మీడియా పూర్తిగా విఫలమైంది.

సిద్ధిపేటలో బహిరంగంగా దీక్ష చేయడానికి కెసిఆర్ కు అనుమతి కల్పించి ఉంటే పరిస్థితి మరో విధంగా ఉండేది. కెసిఆర్ దీక్షను కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నారా, లేదా అనే తెలంగాణ ప్రజలందరికీ తెలిసి ఉండేది. నిరాహారదీక్ష అనేది ప్రజాస్వామిక హక్కు అనే విషయాన్ని అందరూ చాలా సౌకర్యవంతంగా మరిచిపోయారు. దీక్ష చేస్తున్న క్రమంలో ఆరోగ్యం క్షీణిస్తే అరెస్టు చేసి ఆస్పత్రికి తరలించడం సంప్రదాయం. ఇప్పటి వరకు జరిగిన ఏ నాయకుడి నిరాహార దీక్ష విషయంలోనైనా అనుసరించిన పద్ధతి అదే. అలా కాకుండా దీక్ష ప్రారంభించక ముందే కెసిఆర్ ను అరెస్టు చేసి, ఏ విషయమూ బయటకు కనిపించకుండా చేసి కెసిఆర్ పై అనుమానాలు కలిగించే విధంగా వ్యవహరించారు. అసలు అరెస్టే కెసిఆర్ అనుకున్నట్లు జరిగిందనే దురభిప్రాయం కలిగించడానికి పూనుకున్నారు. కొంత మంది కాంగ్రెసు శాసనసభ్యులు అటువంటి ప్రకటనలు బహిరంగంగానే చేశారు. వాటి నోటికి తాళం వేయడానికి తెరాస నాయకులు నడుం కట్టాలా, జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో తగిన విధంగా వ్యవహరించడానికి సమయం వెచ్చించాలా అనేది తేల్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్న నేతల మాటలకు మీడియా ఇతోధిక ప్రాధాన్యం మీడియా ఇచ్చింది.

ప్రభుత్వం బలవంతంగా చికిత్స అందించి దీక్ష విరమింపజేస్తే ఆస్పత్రుల నుంచి నడిచి వచ్చిన నేతలు ఎంత మంది, ఎంత కాలంగా లేరు. అలా దీక్ష భగ్నమైన తర్వాత కెసిఆర్ తీసుకునే నిర్ణయం కోసం వేచి చూసే అవకాశం కూడా తెలంగాణ ప్రజలకు, విద్యార్థులకు ఇవ్వలేదు. వారి మనోభావాలను మీడియా రెచ్చగొట్టింది. దాంతో కెసిఆర్ కు వ్యతిరేకంగా విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వెల్లగక్కే స్థితిని కల్పించింది. గద్గర్ మాట్లాడిన మాటలకు ఇతోధిక ప్రాధాన్యం ఇచ్చింది. కెసిఆర్ దీక్ష ఎందుకు విరమించారో అడగడానికి గద్దర్ కు సమయమే లేనట్లు వ్యవహరించారు. ఈ సమయంలో గద్దర్ కెసిఆర్ పై చేసిన విమర్శలను, గద్దర్ పై కెసిఆర్ చేసిన వ్యాఖ్యలను సాక్షి టీవీ చానెల్ పదే పదే ప్రసారం చేస్తూ వచ్చింది. ఈ రకంగా మనోభావాలను రెచ్చగొట్టే చర్యకు సాక్షి టీవీ చానెల్ పూనుకుంది.

కెసిఆర్ పండ్ల రసం తీసుకుంటున్న దృశ్యాలను కూడా పదే పదే టీవీ చానెళ్లు ప్రసారం చేస్తూ వచ్చాయి. చర్చలు పెట్టి ఆ దృశ్యాన్ని ప్రసారం చేయడం మొదలు పెట్టాయి. చర్చల్లో తెలంగాణవాదులు చెప్పే హేతుబద్ద వ్యాఖ్యలు ముందుకు వచ్చినప్పుడు ఏదో సాకుతో ప్రసారాన్ని ఆపుచేసే పద్ధతిని కూడా అవి అనుసరిస్తున్నాయి. నిజానికి, తెలంగాణ విషయానికి వస్తే టీవీ చానెళ్ల ప్రసారాలకు సెన్సార్ విధించాల్సిన అవసరం ఉందని అనిపిస్తోంది. కెసిఆర్ అరెస్టు చేసిన సమయంలో, అరెస్టు తర్వాత పరిణామాల సందర్బంలో తెలంగాణ అంతటా కేబుల్ నెట్ వర్కును తీసేశారు. తెలంగాణ ప్రజలకు చూసి తెలుసుకోవడానికి వీలు లేకుండా చేశారు. దీనిపై ఈ మీడియా మాట్లాడలేదు. దాన్ని వ్యతిరేకించలేదు. ఈ స్థితిలో నిజం చెప్పులు వేసుకుని బయలుదేరే లోగా అసత్యం ఊరంతా చుట్టి వస్తుంది. తెలంగాణ విషయంలో అదే జరుగుతోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X