• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బిఎస్ రాములు: శిక్షణను బట్టి వ్యక్తిత్వ వికాసం

By Pratap
|

ఆయా దేశాల, ప్రాంతాల, జీవితాలను అనుసరించి వారు అందుకున్న అభివృద్ధి, సైన్స్‌, టెక్నాలజీ, జీవన ప్రమాణాలను అనుసరించి వారి పాత సంస్కృతి అలవాట్లను, మతాలను అనుసరించి కొత్త వ్యక్తిత్వ వికాస అనుభవాలు, శాస్త్రాలుగా రూపొందాయి. అందువల్ల వాటిల్లో వెనుకటి అనుభవాల నీడలు, జాడలు కూడా కొనసాగుతూ వస్తుంటాయి.

సామాన్య ప్రజలు కష్టాలు, కన్నీళ్ళనుండి, అనుభవాలనుండి ఎదుగుతూ తమ పిల్లల్ని ఎదిగించే కృషి చేస్తుంటారు. తమ పిల్లల ఎదుగుదలకోసం జీవితాలను వెచ్చిస్తుంటారు. తమ పిల్లల ఎదుగుదలే జీవిత లక్ష్యంగా సాగుతుంటారు. ఆ క్రమంలో వారి అనుభవాలు, పిల్లలకు, గుణపాఠాలుగా చెప్తుంటారు. తాము పడ్డ కష్టాలు తమ పిల్లలు పడకూడదని, తాము పొందిన అవమానాలు, పిల్లలు పొందకూడదని, తమకు అందని అవకాశాలు, పిల్లలు అందుకోవాలని, ఆరాటపడుతుంటారు. పోరాటాలు చేస్తుంటారు.

ఇలా తరానికి, తరానికి మధ్య వ్యక్తిత్వ వికాసంలో అనుభవాలు మారుతుంటాయి. గుణపాఠాలు పెరుగుతుంటాయి. పూర్వం అణిగిమణిగి ఉండడం సామాన్య ప్రజలకు సంస్కృతిగా నేర్పుతూ వచ్చారు. కానీ బుద్ధుడు ప్రతిదీ ప్రశ్నించు అని చెప్పాడు. కాలక్రమంలో దేన్నీ ప్రశ్నించకూడదు అనే వర్ణవ్యవస్థ, కుల వ్యవస్థ భావాలు ప్రచారం చేయబడ్డాయి. అలా కొత్త విషయాలను తెలుసుకోవడం గానీ, పాత విషయాలను మార్చుకోవడం గానీ సాధ్యం కాకుండా చేయబడింది. ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పరుచుకున్న తర్వాత ఈ స్థితి పాఠ్యాంశాల్లో సమూలంగా మార్చే కృషి మొదలైంది. ప్రజాస్వామిక విలువలు, సంస్కృతితో పాఠ్యాంశాల రూపకల్పన సాగింది.

రెండు సామాజిక వర్గాల మధ్య వ్యక్తిత్వ వికాసంలో తేడా...

అయినప్పటికీ పాఠ్యాంశాల రూపకర్తలు తాము పుట్టిపెరిగిన సామాజిక వర్గాల ఆధిపత్యాన్ని అనేక రూపాల్లో ఆదర్శీకరించి, సమాజం ఆమోదించే విధంగా తయారు చేశారు. అలా కొత్త రూపాల్లో పాత ఆధిక్యత కొనసాగే ఆలోచనా విధానాలను మార్గదర్శకాలుగా ముందుంచారు. తద్వారా సామాన్య ప్రజలు వాటిని నేర్చుకోవడానికి జీవితమంతా కష్టపడాల్సి వస్తుంది. అదివరకే అవి ఉన్నవాళ్లు తేలికగా ముందుకు సాగుతూ అధికారాన్ని, అవకాశాలను తొందరగా అంది పుచ్చుకొని పైపైకి ఎగబాకారు. ఎగబాకి తర్వాత వస్తున్న సామాన్య ప్రజల నుండి వచ్చే తరాలను అడ్డగించడం మొదలుపెట్టారు. అలా తిరిగి సంఘర్షణ సాగుతూ వస్తున్నది.

చదువుకుంటే పనికి వంగరు అని పూర్వం అనేవారు. అనగా చదివిన కొద్దీ పనిచేసే సంస్కృతిపట్ల చిన్నచూపు కలిగే విద్యావిధానం కొనసాగు తున్నది.

ఇలా భారతదేశంలో వ్యక్తిత్వ వికాసంలో రెండు సామాజిక వర్గాల మధ్య, రెండు వైరుధ్యాల మధ్య సంఘర్షణ కొనసాగుతూ వస్తున్నది. పనిచేసే సంస్కృతిని అత్యున్నతంగా గౌరవించే వ్యక్తిత్వం ఒక వైపు. పనిచేసే సంస్కృతిని చిన్నచూపు చూసే వ్యక్తిత్వం, ఆలోచనా విధానం మరొకవైపు. ఈ రెండవ కోవలోనివారు పని చెప్పడమే గొప్ప. పనిచేయడం తక్కువ అనే దృష్టిని కలిగి ఉంటున్నారు. అందువల్ల సోమరితనం భారతదేశం యొక్క వ్యక్తిత్వ వికాసం అని పాశ్చాత్యులు భావించే స్థితికి నెట్టివేయబడ్డారు.

భారతీయులు సోమరిపోతులు కారు. ఇతర దేశాలకు సంపర్కంలోకి వచ్చినవాళ్ళు పనిచేసే సంస్కృతి నుండి కాకుండా పనిచెప్పే అలవాటు, జీవన విధానం నుండి వచ్చిన వాళ్ళవల్ల ఇతర దేశాల వారికి భారతీయులు సోమరిపోతులుగా కనిపిస్తారు. భారతదేశంలో కష్టపడేవాళ్లు రెండురెట్లు, మూడు రెట్లు కష్టపడుతున్నారు. కూర్చుని తినేవాళ్లు సోమరిపోతులుగా కూర్చొని తింటున్నారు. తరతరాల సంపదను అనుభవించడం గొప్ప అనుకుంటున్నారు. కష్టపడి సంపాయించడం తక్కువ అనుకుంటున్నారు. ఈ ఆలోచనా విధానం వ్యక్తిత్వ వికాసంలో బలమైన ప్రభావం వేస్తున్నది. అందువల్ల పనిపట్ల గౌరవం ఉండేవాళ్ళు కూడా సోమరిపోతులుగా జీవిం చడమే గొప్ప అని అనుకునే దుస్థితి తెచ్చి పెడుతున్నారు.

వ్యక్తిత్వ నిర్మాణంలో అనుభవాలు, గుణపాఠాలు...

ఆచరణే అనుభవాన్ని ఇస్తుంది. ఆచరణ లేకుండా, సమాజంలో పది మందితో కలిసి పనిచేయకుండా వ్యక్తిత్వ వికాసం సాధ్యం కాదు. తమ పూర్వీకులు సంపాదించింది కానీ, ఎవరో సంపాదించింది కానీ, అనుభవిస్తూ, జీవిస్తే అది ఎలా లభ్యమైందో వారికి తెలియకపోవచ్చు. ప్రత్యక్షంగా కష్టపడి జీవితం గెలుచుకున్న వారికి అనేక విషయాలు తెలుస్తాయి. వారి జీవితంలో అనుభవాలు అనే గొప్ప సంపద ఉంటుంది. అనుభవాలు, గుణపాఠాలు జీవితంలో అనేక రకాలుగా ఉపయోగపడతాయి.

ఏ అనుభవమూ వృధా పోదు. అది అనేక నూతన గుణపాఠాలను ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటుంది. ప్రత్యక్ష ఆచరణ లేని జీవితాలకు ఇది పరోక్ష జ్ఞానంగా అందుతుంది. అలా లక్షలాది ప్రజల ప్రత్యక్ష జీవితం, కష్టాలు, కష్టపడి సాధించిన విజయాలు తోటివారికి చెప్పుకుంటూ వెళ్లే క్రమంలో, ఇతరులు వాటిని గమనించే క్రమంలో వాటిని క్రోడీకరించడం ద్వారా అవి శాస్త్రాలుగా, సైన్స్‌గా రూపుదిద్దుకుంటూ వస్తున్నాయి.

వ్యక్తిత్వవికాసంలో శిక్షణ... ప్రాధాన్యత...

అలా ఇరవై అయిదేళ్ళకే ఐఏఎస్‌ పాసై, శిక్షణ పొంది, ముప్పై ఏళ్ళ అనుభవం గల వేలాదిమంది ఉద్యోగులను, ఉపాధ్యాయులను, డాక్టర్లను, ఇంజనీర్లను, కలెక్టరుగా పరిపాలకుడిగా అందరినీ తన అధికారంతో, నాయకత్వంతో నడిపిస్తుంటారు. లక్షలాది ప్రజలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా, తమ నాయకత్వాన్ని అందిస్తుంటారు.

ఇంత చిన్న వయసులో ఉండి లక్షలాది ప్రజలను తమ పరిధిలో పాలిం చడం, వారికి సేవ చేయడం, అందుకు సంబంధించిన జ్ఞానం అనుభవాలు, అంతదాకా మానవ సమాజం సాధించిన ప్రత్యక్ష అనుభవాల, ఆచరణల నుండి తేనెపట్టు నుండి తేనెను పిండినట్టుగా, పాలనుండి మీగడ తీసినట్టుగా తీసి రూపొందించినవే. అలా నేడు కోట్లాదిమంది అనుభవాలు వ్యక్తిత్వ వికాస గ్రంథాలుగా, పరిపాలనా మేనేజ్‌ మెంట్‌ నాయకత్వ గ్రంథాలుగా రూపుదిద్దు కుంటున్నాయి. ఆయా సమాజాల అనుభవాలు ఆ సమాజం యొక్క సగటు వికాసాన్ని, అనుభవాలను తెలియజేస్తాయి..

 BS ramulu: personality development depends on training

శాస్త్రాలు అనుభవాల సారమే

అన్ని అనుభవం ద్వారానే నేర్చుకోవడం, ఎదగడం సాధ్యం కాదు. అన్ని అనుభవం ద్వారా నేర్చుకోవడం సాధ్యం అయ్యేదైతే ఈ విద్యా విధానాలు, ఇన్ని శాస్త్ర గ్రంథాలు, శిక్షణా కళాశాలలు, స్కూళ్లు, యూనివర్శిటీలు అవసరమయ్యేవి కావు. విద్యార్ధి, యువజన, మహిళా సంఘాల సమీకరణలో కూడా వారికి శిక్షణా తరగతులను నిర్వహిస్తుంటారు. అవి చదివాక కూడా సమాజంలో ఎలా బతకాలో తెలియదు. తనకు తానే తెలుసుకోవాలి. ఎమ్మేలు, ఎమ్మెస్సీలు, బీటెక్‌లు, ఎంబిబిఎస్‌లు, పి.హెచ్‌డీలు, 'లా'లు చదివాక కూడ జీవితాన్ని సమాజంలో ఎలా బతకాలో స్వయంగా తెలుసుకోవలసిందే. వేల ఏళ్ళ నుండి కొనసాగే సంస్కృతిని, జీవన విధానాన్ని, విలువలను నేర్చుకోవడానికి, ఆచరించడానికి, ఆర్‌.ఎస్‌.ఎస్‌. ప్రతిరోజూ ఒక గంట శిక్షణ శాఖలను, తరగతులను నిర్వహిస్తున్నది. రోజూ చూసే విగ్రహాలను, ఫోటోలను, గుళ్ళను చూస్తూ, శ్లోకాలు, పద్యాలు, వచనాలు, భక్తి గీతాలు మళ్లీ మళ్లీ వల్లెవేస్తుంటారు.

ఇలా రోజూ భక్తి, ధ్యానం, పూజ, నమాజు, ప్రార్థనల ద్వారా నిరంతరం వాటిని ఆచరిస్తుంటారు. ప్రతిరోజూ సూర్యోదయం అయినట్టుగానే, ప్రతిరోజూ దినచర్య ప్రారంభించినట్టుగానే ప్రతిదీ వర్తమానంలో మళ్ళీ మళ్ళీ కొనసాగి స్తుంటారు. రోజూ భోం చేయడం అనివార్యం.

చక్రం ఒకేచోట తిరగడం, చక్రం తిరుగుతూ ముందుకు పోవడం రెండు వేరు వేరు క్రమాలు. అడుగు వేస్తే ముందుకు పడాలి. ఉన్నచోటే కదం తొక్కితే అది ముందుకు నడవడం కాదు.

ఇలా అనేక విషయాలను మళ్ళీ మళ్ళీ ఆచరిస్తుంటాము. కానీ కొన్ని విషయాలను ఇదివరకే తెలుసు అని అనుకుంటూ వాటిని మళ్ళీ మళ్ళీ తెలుసుకోకుండా, ఆచరించకుండా నిర్లక్ష్యం చేస్తుంటారు. ఉదాహరణకు ఒకటవ తరగతినుండి డిగ్రీ, పీజీ దాకా చదివిన పాఠ్యాంశాలను మరచిపోతుంటారు. తాము చదివిన వందలాది గ్రంథాలను, వాటి సారాన్ని తాము చూసిన సినిమా, టీవీల సారాన్ని మర్చి పోతుంటారు. మళ్లీ తెలుసుకోవాల్సిన అవసరం లేదనుకుంటారు. మరచిపోవడం అనేది అది తెలుసుకోకపోవడంతో సమానం. ఇలాంటి గ్రంథాలను నిత్యం పఠించడంవల్ల మరిచిపోయిన విషయాలు జ్ఞాపకం వస్తుంటాయి.

తనను తాను సమీక్షించుకోవాలి...

జ్ఞాపకం ఉన్నప్పుడే దాని అనుభవం, గుణపాఠం, జ్ఞానం మనకు అందుతుంది. మర్చిపోయాక చదివిన పాఠాలు, గ్రంథాలు, చూసిన సినిమాలు, సంఘటనలు ఇచ్చే అనుభవం, జ్ఞానం మిగిలే అవకాశం తక్కువ. అవి జ్ఞాపకంలోంచి అంతచ్చేతనలో చేరి ప్రభావం వేయవచ్చు. తద్వారా అసంకల్పిత ప్రతీకార చర్యలాగా సంస్కృతిలో, జీవన విధానంలో, ఆలోచనలో భాగం కావచ్చు. అప్పుడు తమపై ఏయే ప్రభావాలు పడ్డాయో, తాము ఇలా ఉండడానికి గల కారణాలు ఏమిటో తెలుసుకోవడం ద్వారా వాటిని మార్చుకోవడం సాధ్యపడుతుంది.

అందువల్ల మనపై ఏయే ప్రభావాలు ఎలా కొనసాగుతూ వస్తున్నాయో, ఏయే ప్రభావాల గుండా నడక, నడత, జీవితం, సంస్కృతి, భాష మనలో కొనసాగుతున్నాయో తెలుసుకోవడం అవసరం. ఇవి చర్చించ కుండా తనను తాను మార్చుకోవడం, ఎదిగించుకోవడం కోసం చేసే ప్రయ త్నాల్లో గతం ఒక గండంలాగా, స్పీడు బ్రేకర్‌లాగ, నిండుకుండకు ఒక చిన్న చిల్లులాగ పనిచేస్తూ మొత్తం కారిపోయే ప్రమాదానికి నెట్టివేయవచ్చు.

కొందరికి గొర్రెలన్నీ ఒకరకం కనపడ్డట్టు పుస్తకంలోని పేజీలన్నీ ఒకే రకంగా కనపడతాయి. ఉర్దూలో ఒక సామెత ఉంది. 'లిఫా ఫా క్యా దేక్తే హో... ఖత్‌ మే మత్‌ మూన్‌ పడ్‌కే దేఖో...'. కవరు చూస్తావేంటి? లోపలి లేఖ చదివి చూడు అని దీని అర్థం. అలాగే ఉప్పుకప్పురంబు ఒక్క పోలికనుండి చూడచూడ రుచుల జాడవేరు' అన్నట్టు కొందరికి పుస్తకాలన్నీ ఒకేరకంగా కనపడవచ్చు. చదివితేనే ఏది ఏదో తెలుస్తుంది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
An emeinent writer BS Ramulu opined that the personality development depends on training.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more