వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చింతపట్ల క్విక్‌బాక్సింగ్: స్మైల్ ప్లీజ్...

|
Google Oneindia TeluguNews

నవ్వు నాలుగు విధాల చేటు అనేవారుట వెనకటికి కొందరు. నవ్వు నలభై విధాల లాభం అంటున్నారు ఇప్పటి వాళ్లు. కోపం, భయం, టెన్షన్, చిరాకు వంటివి ముఖంలో సైలెంటుగా రకరకాలుగా రంగులు రంగులుగా కనిపిస్తయి. నవ్వు ముఖమంతా వ్యాపించి తెరలు తెరలుగా విస్తరించి హాయిగా వినపడే నేపథ్య సంగీతంతో మంద్ర స్థాయి నుంచి తారాస్థాయికి చేరుతుంది. అవసరమైతే శబ్ధాన్ని లోపలే తొక్కిపెట్టి పెదాల చివర నుంచి ముఖానికి గులాబీ రంగు పూస్తుంది. కొందరు నవ్వితే నవరత్నాలు రాలుతాయని ఏరుకోడానికి సిద్ధమైపోతారు. ఏది ఏమైతేనేం అనేకానేక ప్రాణులకు అందని, సిద్ధించని వరం నవ్వు. నవ్వలేని వాడు నవ్వడం తెలీని వాడసలు మనిషే కాదు. పాల బుగ్గల పసివాని పసిడి నవ్వు దగ్గర మొదలయ్యి దంతరహితమైన ముసలివాడి బోసి నవ్వు వరకూ నిర్విరామంగా కొనసాగాల్సిందే. నిజంగా నవ్వు మనిషిలోని కదలికకు ప్రాణశక్తికి నిదర్శనం. ఏ మనిషయినా నవ్వలేకపోతే అది అతని లోపలి అనారోగ్యానికి సూచిక.

ఆనందరావు అనే వ్యక్తి ఒకడున్నాడు ఈ భూమ్మీద. అనేకం ఆనందరావులు వుండచ్చు గాక లోకమ్మీద. మనం చెప్పుకునే ఆనందరావు మన ఆనందరావే. కొంతమంది తల్లీతండ్రులు యేం వూహించుకుని పేర్లు పెడ్తారో గాని, పెరిగే కొద్దీ తమకు పెట్టిన పేర్లకి పూర్తిగా వ్యతిరేకంగా తయారవుతారు కొందరు. అలా తనపేరుకి యే మాత్రం సంబంధం లేకుండా తయారయిన వాళ్లల్లో మన ఆనందరావు ఒకడు.

ఆనందరావుకి అందరు మనుషలకి మల్లే నిలబడే కాళ్లూ పన్లు చేసుకునే చేతులూ తిండి పడేసుకోడానికీ నిలవుంచుకోడానికీ ఓ స్టమకనబడే బెల్లీ బ్యాగు వున్నవి. ఒంటిని మోసుకు తిరిగే ఆనందరావుకి పుస్తకానికి కవర్ పేజీలా ఓ ముఖమూ వుంది. ‘ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ మైండ్' అన్నారు కానీ ఆనందరావు ముఖంలో కోపమూ, విసుగూ, చిరాకూ, టెన్షనూ, భయమూ అన్న శీర్షికలు తప్ప ఆనందమూ, సంతోషమూ అన్నవి సాంపులుగానే కాదు సింపులుగా కూడా కనిపించవు. ఆనందాన్ని బయటికి కనిపింప చేసే ‘నవ్వు' అనేది అస్సలు కనిపించనే కనిపించదు. ఎవరెడే టార్చీనే కాదు యే టార్చీ నయినా వేసుకుని చూసుకోవచ్చు. ఎప్పుడు చూసినా పెనం మీద చిటచిటలాడే పేలాలు అతని ముఖంలో ఎగిరెగిరి పడుతుంటయి. దేన్నో మొయ్యలేక మోస్తున్నట్టు బొమ్మలు ముడిపెట్టీ దవడలు బిగబట్టీ కనిపిస్తాడందరికీ. పలకరిస్తే కస్సుమంటాడు. పలకరించకపోతే బుస్సు మంటాడు. అసలతను ఏ మూడ్‍‌లో ఉన్నాడో అర్థం కాక ఆపీసులో వాళ్లూ ఇంట్లో పెళ్లాం పిల్లలూ తలలు గోడకేసి బాదుకుంటుంటారు. ఆనందరావు అసలెప్పుడయినా నవ్వాడా? అతను నవ్వడం చూసిన అదృష్టవంతులెవరైనా వున్నారా? అనేది సిబిసిఐడి ఇంక్వయిరో తేల్చవలసిన సంగతే కానీ మరొకటి కానే కాదు.

 CHintapatla Sudarshan quick boxing on smile

ఇలాగ ఆనందరావు పడి పడీ పగల బడీ నవ్వకపోతే పోనీ కనీసం నిశ్చబ్దంగా నన్నా కింది పెదవిని పై పెదవితో అదిమిపెట్టి చిన్న సందు చేసి అందులోంచి ఒకటో రెండు నవ్వు కిరణాలు విసిరేస్తాడా అంటే అందీ లేదు.

రోజు రోజుకీ ఆనందరావులో ఈ నవ్వకపోవడమనే జబ్బు పెరిగిపోయింది. నవ్వకపోవడం మనిషి మనస్తత్వాన్నే కాదు శరీర తత్వాన్ని కూడా సూచిస్తుందన్న మాట నిజమైంది. నిరాటంకంగా యే మాత్రం కంట్రోల్ అనేదే లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ ‘కోపాగ్ని'ని ప్రజ్వలింప చేయడాన్ని అతనిలో రక్త చాపం పెరిగింది. బ్లడ్ ప్రెషర్‌కి బ్రదరయిన షుగర్ కూడా వచ్చి అతని వంట్లో సెటిలయ్యింది. భయమూ, టెన్షనూ, చిరాకూ వంటివి అతని శరీరాన్ని పట్టి వూపడమే కాదు ఆసాంతం కుదిపేశాయి.

ఆనందరావనబడే పేషెంట్ డాక్టర్ల చుట్టూ చక్కర్లు కొట్టసాగాడు. శరీరంలో అన్ని పార్టులకీ విడివిడిగా సమైక్యంగా సమూలంగా పరీక్షలు చేయించుకోవాలసి వచ్చింది. నీరసం కళ్లు గిర్రుమనడం కడుపులో బరువు కాళ్లూ చేతులూ మెడానడుమూ కలుక్కుమనడం అనేక నెప్పులకు తోడు తిండి సయించకపోవడం నిద్ర పట్టకపోవడం వంటి లక్షణాలతో ఆనందరావు దిన దినమూ కృంగి కృశించి పోతుండటంతో హఠాత్తుగా ఎప్పుడో నశించి పోతాననే భయం మొదలయింది. ఆరోగ్య భాగ్యం కోసం ఎంత డబ్బయినా సరే ఖర్చు పెట్ట సాగాడు. స్పెషలిస్టులను సందర్శించసాగాడు.

ఖర్మమిట్లా కాలింది అన్నట్టు తన పేరుకు చేంతాడంత డిగ్రీలనీ చేర్చుకున్న డాక్టరొకడు ఆనంద రావుకు వచ్చింది అట్లాంటిట్లాంటి మామూలు జబ్బు కాదని అది అతన్ని ఆర్నెల్లల్లో పైలోకానికి ముక్కుతాడు వేసి లాక్కుపోతుందని చావు కబురు చల్లగా చెప్పాడు. ఆనంద రావు లబ్ డబ్ మన్డం మానేసి ధడాల్ ధడేల్ మనసాగింది. గుభేలన్న గుండెకాయని ఏ విధంగా కాపాడుకోవాలో అర్థం కాలేదు ఆనంద రావుకి. అసలు యిప్పుడుడప్పుడే చచ్చిపోవాలని లేదు ఆనంద రావుకి. మనిషన్నవాడి కెవడికుంటుంది గనక. అయితే తమ చీటీ చెల్లిపోయే రోజెప్పుడో తెలీదు గనక మనుషులంతా ఆనందంగా టీవీల ముందు కూచో గల్గుతున్నారు. కానీ ఆనందరావు పరిస్థితి అది కాదు గదా. రోజు రోజుకీ చావు కళ అతని ముఖంలో కొట్టొచ్చినట్టు అవుపడ సాగింది. ఏమిటి ఆనందరావు ఇలాగై పోయావు అనడగసాగారు జనం సాహసించి. ఇక తన పని అయిపోయిందని నీరసపడిపోసాగాడు ఆనందరావు. ఫలానా మాసంలో ఫలానా రోజుకల్లా తను ‘వో ఫలానా' ఆనందరావనే వాడు ఒకడుండే వాడు అయిపోతాడనే నిశ్చయానికి వచ్చాడు.

ఇటువంటి విషాద విపత్కర దయనీయమైన స్థితిలో కారు చీకట్లో కాంతి రేఖలా దర్శనమిచ్చాడు ఓ డాక్టరు ఆనందరావుకి. ఆనందరావు అంతిమ దినాన్ని గురించి సెలవిచ్చిన డాక్టరుకి డిగ్రీలున్నయి కానీ బుద్ధీ తెలివీ లేదని నొక్కి వక్కాణించాడు. ఆనందరావు ఇప్పుడప్పుడే బకెట్ తన్నేయడని హామీ ఇచ్చాడు. తను చెప్పినట్టు నడుచుకుంటే తను యిచ్చిన ‘మెడిసిన్' పుచ్చుకుంటే ఆనందరావు ‘లైఫ్ పీరియడ్' ఖచ్చితంగా పెరుగుతుందని వారంటీ, గ్యారంటీ యిచ్చాడు. సర్వీసు ఛార్జీ వసూలు చేసి నెల రోజులకి సరిపడా రోజుకు రెండు పూటలకి చొప్పున అరవై కవర్లు ‘సీలు' చేసి యిచ్చాడు.

సీల్డు వకర్‌లో వున్న మందుని ప్రతి రోజూ ఉదయం అయిదూ ఆరూ గంటల మధ్య రాత్రి పదీ పదకొండు మధ్య గదిలో తలుపువేసుకుని ఒంటరిగా అద్దం ముందు నుంచుని వేసుకోవాలి. ఒకటో తారీఖునించి ముప్ఫయవ తేదీ వరకూ సరిగ్గా లెక్క కుదురుతుందని సరిగ్గా ఒకటో తారీఖు ఉదయం ఒకటవ రోజు ఉదయం కవరు తీసుకుని గదిలో దూరి గడియ పెట్టుకున్నాడు ఆనందరావు. గది బయట వేచివున్న భార్య అతని మొఖంలో మార్పు కోసం వెతుకుతూ ఏవండీ మందు ఎలా వుంది. సీల్డు కవర్లో ఏముంది పవుడరా, బిళ్లలా జామా జెల్లీనా, పేస్టా ఆయింట్ మెంటా అనడగింది. ఆనందరావు జవాబివ్వకుండా అవతలికి పోయేడు. ఆ రాత్రి రెండో డోసు సీల్డు కవర్‌తో గదిలోకి వెళ్లి తలుపు బిగించుకున్న ఆనందరావు బయటికి వచ్చాక భార్య మళ్లీ ఉదయం అడిగిన ప్రశ్నే అడిగింది. అతను అప్పుడు చేసిందే మళ్లీ రిపీట్ చేశాడు.

సీల్డు కవర్లో ముందు యేమిటో ఆమెకి అర్థం కాలేదు. భద్రంగా బ్రీఫ్ కేసులో వాట్ని పెట్టుకుని తాళం వేసుకు వెళ్తున్నాడు ఆనందరావు. పాపం ఇల్లాలు కనక ఏడు అడుగులతో మొదలు పెట్టి అనేక వేల అడుగులు నడచివచ్చింది గనకా ప్రతి రోజూ ఆనందరావు మందు వేసుకు బయటకు రాగానే ఏవండీ ఎలావుందడీ ఏమైనా మార్పు కనిపిస్తోందా అనడిగేది. జవాబు రాదని తెలిసీ. కానీ ఉన్నట్టుండి వోనాడు వో చిత్రం జరిగింది. ఆనందరావు నోరు తెరిచి జవాబివ్వలేదు కానీ పెదాల మధ్య నించి ఒక చిన్న చిరునవ్వుని బయటకు విసిరేశాడు. ఆమె ఆశ్చర్యానికి అంతులేకుండా పోయింది. ఇంకోనాడు ఆనందరావు సన్నగా ఈలవేస్తూ బయటకు వచ్చాడు. ముఖంలో ఎంతో మార్పు కనిపించింది. మందువాడ్డం మొదలయి ఇరవై రోజులు గడిచాక వోనాడు ఆనందరావు పగలబడి నవ్వుతూ గదిలోంచి రావడం చూసి ఆనందరావు భార్యా పిల్లలే కాదు పరిసరాలన్నీ చేష్టలు మానేసి అలా నిలబడ్డాయి. ఆఫీసులో కూడా ఆనందరావు మామూలుగా కాకుండా విపరీతంగా పగలబడి నవ్వడం చూసి అందరూ హమ్మయ్య అనుకున్నారు. ఆనందరావు కూడా నవ్వగలడని ఆనందపడ్డారు.

ఆనందరావు ఆరోగ్యం కుదుటపడ్డది. ఇది వరకులా ముఖం వేలాడ్డం లేదు. ఆనందరావు ముఖంలో చావు కళ పత్తా లేకుండా పోయింది. ఆనందరావు రోజూ సేవించిన మందేమిటో, అతను మళ్లీ ఆరోగ్యంగా మారడానికి కారణమేంటో మంచి సమయం చూసి అడిగి తెల్సుకుంది భార్య.

సీల్డు కవర్లో డాక్టర్ ఆనందరావుకి ఇచ్చినవి మందులు కావు ‘జోకులు'. చదవగానే పగలబడి నవ్వాలనిపించే జోకులున్న కాగితాలు సీల్డు కవర్లల్లో వుంచి యిచ్చాడు డాక్టరు. అద్దం ముందు నిలబడి జోకులు చదివి ఐదూ పదీ పదిహేను నిమిషాల చొప్పున నవ్వుతూ వుండాలి అంతే. మొదట్లో నవ్వడం అలవాటు లేని ఆనందరావుకి ఈ మందు మింగుడు పళ్లేదు కానీ క్రమంగా అలవాటయింది. అరవై డోసులు పూర్తయ్యేసరికి ఆనందరావుకి హాయిగా ఆనందంగా నవ్వడం వచ్చేసింది. నవ్వడం వచ్చిన ఆనందరావుకి ఆరోగ్యం బాగుపడింది.

నవ్వు! నవ్వే! నవ్వు! మనుషుల్లోని అనేకమైన జబ్బులను నయం చేసేది మరోటేదీ కాదు. నవ్వే! నవ్వే! హాయిగా ఆనందంగా ముఖమంతా విస్తరించి ఎదుటి మనిషి గుండెల్లోకి దూసుకుపోగలిగే నవ్వు!!

-చింతపట్ల సుదర్శన్.

English summary
Prominent columnist Chintapatla Sudarshan in his column Quick Boxing tells about the importance of smile in human life.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X