వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాలమ్: పోప్ మార్కిస్టు, ఒబామా సోషలిస్టు

By Pratap
|
Google Oneindia TeluguNews

D Paparao column
ఈ మధ్య కాలంలో -పోప్ ఫ్రాన్సిస్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆయన, పెట్టుబడిదారీ ఆర్థిక సిద్ధాంతం అయిన ‘ట్రికిల్ డౌన్' ఆర్థిక సూత్రం మొదలుకొని, అంతర్జాతీయ ఫైనాన్స్ వ్యవస్థను కూడా తీవ్రంగా విమర్శించారు. అలాగే, పేద వర్గాలతో సంపదను పంచుకోని, ధనిక వర్గం వారిని ‘దొంగలుగా' ఆయన పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలోనే పోప్ ఫ్రాన్సిస్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆయనను మార్కిస్టుగా ముద్రిస్తూ- పలువురు మితవాదులు మొదలుకొని, కొందరు అమెరికన్ ఆచార్యుల వరకూ ఆయనపై దండెత్తారు. అంతిమంగా, ఈ విమర్శలకు జవాబునిస్తూ- ఫ్రాన్సిస్ డిసెంబర్ 14వ తేదీన ఇటలీకి చెందిన ‘లాస్టాంపా' పత్రికలోని ఇంటర్వ్యూలో కొన్ని అంశాలను ప్రస్తావించారు. ఆ జవాబు సారాంశం ఇది; ‘మార్కిస్టు సిద్ధాంతం తప్పు. కానీ నేను నా జీవితంలో మంచి మనుషులైన పలువురు మార్కిస్టులను కలిశాను‘. కాబట్టి ఈ నిందలకు తానేమి బాధపడటం లేదన్నది పోప్ ఫ్రాన్సిస్ మాటల సారాంశం.

నిజానికి నేడు పెట్టుబడిదారీ వ్యవస్థ స్వయానా ఒక తీవ్ర సంక్షోభంలో వుంది. ఈ క్రమంలోనే అది పలు మానసిక ఒత్తిళ్లకూ, భ్రాంతులకూ కూడా గురవుతోంది. ఒక రకమైన పారానాయిడ్ స్థితిలో ఆ వ్యవస్థ నేడుంది. దానికి ఎటుచూసినా శత్రువులే ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఇది పచ్చి నిజం. అందుచేతనే, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను కూడా కొందరు ‘‘సోషలిస్టు‘గాను'', ‘‘కమ్యూనిస్టు'' గాను ముద్రలు వేస్తున్నారు. ఇందంతా కేవలం ఆయన (ఒబామా) కొన్ని ప్రజానుకూల సంక్షేమ పథకాలను గురించి మాట్లాడుతున్నందుకే. అదీ కథ. అంటే నేటి పతన దశలోని పెట్టుబడిదారీ విధానం, కాస్తంత కూడా సర్దుబాటునూ, సహనాన్ని, మానవ గుణాలను చూపలేకపోతోంది. తన సమస్థ హేతుబద్దతనూ కోల్పోయి, తీవ్ర అసహనంతో- ప్రతీ మూలన శత్రువులను చూస్తూ- ఆవేశపడిపోతోంది.

కాగా, ఈ అంశానికి మరో కోణం కూడా ఉంది. అది, చారిత్రకంగా ప్రతీ వ్యవస్థ తాలూకు పతన దశలోనూ, ఆ వ్యవస్థకు చెందిన కొందరు, జ్ఞానవంతులైన ప్రతినిధులు, తామున్న స్థితి నుంచి బయటపడి మార్పుకు అనుగుణంగా ప్రతిస్పందించారు. వారు, పాత వ్యవస్థ నుంచి దూరం జరిగి- కొత్తగా ఆవిర్భవిస్తోన్న వ్యవస్థకు అనుకూలంగా నిలబడ్డారు. కాగా, నేడు పోప్ ఫ్రాన్సిస్ పెట్టుబడిదారీ వ్యవస్థను ఖండిస్తూ మాట్లాడిన మాటలను కూడా బహుశా ఈ కోణం నుంచి కూడా చూడవచ్చు.

మరో కోణం నుంచి కూడా పోప్ ఫ్రాన్సిస్ మాటలను విశ్లేషించవచ్చును. గత చరిత్రలో యావత్తూ; చర్చి, దాని అనుబంధ సంస్థలూ, కాలానుగుణంగా పరివర్తన చెందుతూవచ్చాయి. క్రైస్తవ మతం ఆవిర్భావం అనంతరం, గడిచిన వేలాది సంవత్సరాల కాలంలో, ఆ మతం ఎటువంటి మార్పులూ లేకుండానే ఉండిపోలేదు. ఉదాహరణకు- ఫ్యూడల్ భూస్వామ్య వ్యవస్థ నుంచి, పెట్టుబడిదారీ విధానం ఏర్పడుతున్న తరుణంలో-మత విశ్వాసాలలో జరిగిన మార్పులను పరిశీలించవచ్చును.

పెట్టుబడిదారీ పక్వత దశలో- క్రైస్తవం ప్రకారంగా- ఆస్తులపై వడ్డీ తీసుకోవడం తీవ్ర అపరాధం. ఇది నాడు సాధారణ అంశం. కానీ పెట్టుబడిదారీ వ్యవస్థ ఆవిర్భవ కాలంలో - ఈ సంప్రదాయం-వ్యవస్థ ఎదుగులకు తీవ్ర ఆటంకం అయ్యింది. వడ్డీ తీసుకునే అవకాశం లేకుంటే- పరిశ్రమలను స్థాపించే వారికి- మూలధనాన్ని, పెట్టుబడిని అందించే వారికి ఏ మాత్రం ప్రోత్సాహం లేని స్థితి ఏర్పడింది. ఇది పెట్టుబడిదారీ పారిశ్రామిక ఎదుగుదలకు గాను- మూలధన సమీకరణకు ఆటంకంగా మారింది. దీనితో, మత నియమాలలో సడలింపు అవసరం అయ్యింది. దీనిలో భాగంగానే వడ్డీ తీసుకోవడం తప్పు కాదు, అధిక వడ్డీని (యూఎస్‌యూఆర్‌వై) తీసుకోవడం తప్పని- మతం తన నియమాన్ని మార్చుకుంది. ఈ విధమైన పలు మార్పుల కలగలపుకొని-క్రైస్తవంలో మరో క్రొంగొత్త శాఖగా- ప్రొటెస్టాంటిజం పుట్టుకొచ్చింది. ఈ కొత్త పాయ - పెట్టుబడిదారీ వ్యవస్థకూ, దాని స్ఫూర్తికీ- బాగా అనుకూలమైనది.

కాగా, నేడు పోప్ ఫ్రాన్సిస్ మాటల నేపథ్యంలో ఒకటి గమనించాలి. నేడు, పెట్టుబడిదారీ వ్యవస్థ, ‘వ్యవస్థాగత సంక్షోభంలో' చిక్కుకొని ఉందని- పలువురు పెట్టుబడిదారీ మేధావులే చెబుతున్నారు. అంటే, వ్యవస్థగతమైన మార్పు లేకుండా- ప్రస్తుతం సంక్షోభ కాలంలో మానవాళి ఎదుర్కొంటోన్న సమస్యలను పరిష్కరించుకోలేం. కాబట్టి, ముందు ముందు త్వరలో వ్యవస్థలో భారీ మార్పులు జరగాల్సి ఉంది. వారి, ఈ సరికొత్త మార్పులకు అనుగుణంగా- చర్చి కూడా, నేడు తనను తాను సర్దుబాటు చేసుకునే ప్రయత్నంలో ఉందని, మనకు పోప్ ఫ్రాన్సిస్ మాటలు సూచిస్తున్నాయి.

ఏదేమైనా 1847 చివరిలో తమ ‘కమ్యూనిస్టు ప్రణాళిక'ను రచించిన కారల్ మార్క్స్, ఎంగెల్సెలు, ఆలోచనలలో ఉల్లంఘించిన ఈ క్రింది మాటలు ఇక్కడ గమనార్హం. ‘యూరప్ ను ఒక భూతం ఆవహించింది- కమ్యూనిజం అనే భూతం. ఈ భూతాన్ని ఉచ్ఖాలున చేయడానికి అటు పోపూ, యిటు జారూ, అటు యెటర్నిక్, యిటు గీజో అటు వుంచి రాడికల్ పార్టీ వాళ్లూ, యిటు జర్మనీ పోలీస్ గూఢచారులూ- పురాతన యూరప్ లోని అధికార శక్తులన్నీ- ఒక పవిత్ర కూటమిగా ఏర్పడినాయి... అధికారంలో ఉన్న పార్టీ చేత కమ్యూనిస్టులని తిట్టుతినని ప్రతిపక్ష పార్టీ ఎక్కడైనా వుందా? ప్రతిపక్షంలో వున్న పార్టీ అదే తిట్లను తనకంటే పురోగములైన యితర ప్రతిపక్ష పార్టీల మీదా, ప్రగతి వ్యతిరేకులైన తన శత్రువుల మీద విసరకుండా ఎక్కడైనా వుందా?'... అదీ విషయం.

నేడు పోప్ ఫ్రాన్సిస్ మాట్లాడిన పెట్టుబడిదారీ వ్యవస్థలోని లోపం గురించిన మాటలు- పచ్చి మితవాదులకూ, నయా ఉదారవాదాన్ని నెత్తనెత్తుకోవడం ద్వారా బ్రతుకు తెరువు పొందుతోన్న ఆచార్య వర్యులకూ- మార్కిజంలాగానే కనపడతాయి. అలాగే, ఒబామా విషయంలో కూడా ఇదే నిజం. కానీ, తాము ఉష్ణ పక్షులలా నిజాలను చూసేందుకు తిరస్కరిస్తున్నామని వీరు మరిచిపోతున్నారు. కాలంతో, పరిస్థితులతో, సత్యంతో, నిజానిజాలతో సంబంధం లేని మనోస్థితిలోకి వీరు వేగంగా కుదించుకుపోతున్నారు. పాపం శమించుకుగాక...! సత్యమేవ జయతే!!!

-డి. పాపారావు

English summary
An eminent columnist D Paparao termed poe as marxist and USA president Barack Obama as socialist.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X