• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

దాసరి విలువలు అవీ: అప్పుడలా సారీ చెప్పారు

By Pratapreddy
|

దాసరి నారాయణ రావు స్థాపించిన ఉదయం దినపత్రిక ద్వారా ఎంతో మంది కొత్తవాళ్లు పత్రికారంగంలోకి అడుగు పెట్టారు. నేరుగా ఉదయం దినపత్రికలో ఉద్యోగాలు పొందినవారు కూడా చాలా మందే ఉన్నారు. నేను ఆ కోవలోకే వస్తాను. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఎ. తెలుగు సాహిత్యం పూర్తి చేసే వరకు నేను ఉద్యోగం గురించి ఆలోచించలేదు.

ఎం.ఎ. పూర్తి చేసిన తర్వాత ఏం చేయాలో దిక్కు తోచని పరిస్థితి. దిశానిర్దేశం లేదు. వ్యక్తిగత జీవితం గురించి ఆలోచించిన సందర్భాలు లేవు. పోటీ పరీక్షలకు తయారై ఏదో ప్రభుత్వోద్యోగంలో ఇరుక్కుపోదామనే ఉద్దేశం కూడా లేదు. అయితే, జీవితంలో సంపాదన అవసరం ఏర్పడింది.

ఆర్థికంగా తీవ్రమైన గడ్డు పరిస్థితి. ఇంటి నుంచి పైసా వచ్చేది కాదు. అటువంటి సందర్భంలో ఉదయం దినపత్రికకు రిపోర్టర్లు కావాలనే అడ్వర్టయిజ్‌మెంట్ చూసి దరఖాస్తు చేశాను. రాతపరీక్ష పూర్తయింది. దాని తర్వాత ఇంటర్వ్యూలు ప్రారంభించారు.

రాత్రి వేళ....

రాత్రి వేళ....

సాయంత్రం పూట ఇంటర్వ్యూకు పిలిచారు. స్వయంగా దాసరి నారాయణ రావు ఇంటర్వ్యూ చేస్తారని సమాచారం. నాతో పాటు వేణుగోపాల స్వామి (ప్రస్తుతం నమస్తే తెలంగాణలో పనిచేస్తున్నారు) మరికొంత మందిమి హైదరాబాదులోని ఉదంయ దినపత్రిక కార్యాలయంలో ఇంటర్వ్యూ కోసం ఎదురు చూస్తున్నాం. కాస్తా పొద్దుపోయాక దాసరి నారాయణ రావు వచ్చారు. ఒక్కరొక్కరినే ఇంటర్వ్యూకు పిలుస్తూ వచ్చారు.

నా వంతుఅలా....

నా వంతుఅలా....

ఇంటర్వ్యూ కోసం నన్ను పిలిచారు. కాస్తా బెరుకుగానే గదిలోకి వెళ్లాను. దాసరి నారాయణ రావుతో పాటు అప్పటి ఉదయం దినపత్రిక ఎడిటర్ పతంజలి, చీఫ్ రిపోర్టర్ పాశం యాదగిరి కూర్చున్నారు. నేను వెళ్లి దాసరి నారాయణ రావుకు ఎదురుగా కూర్చున్నాను. ప్రశ్నలు వేయడం ప్రారంభించారు. ఆయన వ్యవహారశైలి వల్ల బెరుకు పూర్తిగా మాయమైంది. నాలో ఈజీనెస్‌ను ఆయన మాటలే తెచ్చి పెట్టాయి.

ముఖ్యమైన ప్రశ్న ఇదీ...

ముఖ్యమైన ప్రశ్న ఇదీ...

దాసరి నారాయణ రావుకు రాజకీయాలపై మంచి అవగాహన ఉందని నాకు ఇంటర్వ్యూలోనే అర్థమైంది. కొన్ని ప్రశ్నలు వేసిన తర్వాత సిపిఐ, సిపిఎం విలీనం అవుతాయని భావిస్తున్నారా అని దాసరి నారాయణ రావు అడిగారు. అలా అయ్యే అవకాశం లేదని నేను చెప్పారు. ఎందుకు అని అడిగారు. విభేదాలను పక్కన పెట్టే పరిస్థితి లేదు కాబట్టి అలా జరిగే అవకాశం లేదని చెప్పాను. దాంతో ఆయన సంతృప్తి చెందారో లేదో తెలియదు.

నా ఆర్టికల్స్ చూసి....

నా ఆర్టికల్స్ చూసి....

ఎంఎలో ఉన్నప్పుడు అప్పుడప్పుడు నేను వ్యాసాలు రాస్తూ ఉండేవాడిని. అలా రాసిన వ్యాసాల్లో నల్లగొండ జిల్లా జానపద భాష, మహబూబ్‌నగర్ జిల్లా భాష అని రెండు ఉన్నాయి. వాటిని చూపించాను. వాటిని ఆయన పరిశీలనగా చూశారు. పతంజలి అసలు ఏమీ మాట్లాడలేదు. పాశం యాదగిరి నా నేపథ్యం అడిగారు. చెప్పాను.

ఇలా అడిగారు....

ఇలా అడిగారు....

నాకు అప్పటి వరకు పత్రికా రచనలో ఏ మాత్రం అనుభవం లేదు. తెల్లారే సరికి ప్రపంచవ్యాప్తంగా జరిగే వార్తలు పత్రికలకు ఎలా అందుతాయో కూడా తెలియదు. పత్రిక ఎలా అచ్చవుతుందో కూడా తెలియదు. నువ్వు సబ్ ఎడిటర్‌గా చేరుతావా అని దాసరి నారాయణ రావు అడిగారు. నేనేమో రిపోర్టర్ ఉద్యోగానికి దరఖాస్తు చేశాను. సబ్ ఎడిటర్‌గా వెళ్తానంటే ఉద్యోగం ఇవ్వరేమోనని రిపోర్టర్‌గానే చేస్తానని చెప్పా. దాంతో నేను రిపోర్టర్‌గా పత్రికారంగంలోకి అడుగు పెట్టాల్సి వచ్చింది.

వేణును అలా అడిగారట...

వేణును అలా అడిగారట...

వేణు గోపాల స్వామిని రిపోర్టర్‌గా చేరుతావా అని దాసరి నారాయణ రావు అడిగారట. ఇంటర్వ్యూ ముగిసిన తర్వాత వేణుగోపాల స్వామి నాకు ఆ విషయం చెప్పారు. ఆయనకు ఫిల్డ్ వర్క్ చేసిన అనుభవం ఉంది. దాంతో నన్ను డెస్క్‌లోకి తీసుకుని, స్వామిని రిపోర్టింగ్‌లోకి తీసుకోవాలని ఆయన ఆలోచన కావచ్చు. అయితే, స్వామి కూడా నేను చెప్పినటువంటి సమాధానమే చెప్పాడట. దాంతో నేను రిపోర్టింగ్‌లోకి, స్వామి డెస్క్‌లోకి అడుగు పెట్టాల్సి వచ్చింది.

తెలంగాణ అంటే ఇదీ...

తెలంగాణ అంటే ఇదీ...

నేను ఉద్యోగంలో చేరిన తర్వాత పాశం యాదగిరి నాకు చెప్పిన విషయం కాస్తా ఆశ్చర్యం కూడా కలిగించింది. నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల భాషల మీద రాసిన వ్యాసాల వల్లనే నీకు ఉద్యోగం వచ్చిందని ఆయన చెప్పారు. పాశం యాదగిరి ఎప్పుడు కలిసినా అదే విషయం చెబుతుంటారు. దాసరి నారాయణ రావుకు తెలంగాణ పట్ల ఉన్న అభిమానం అది. ఉదయం ద్వారా తెలంగాణ పత్రికారంగంలోకి పెద్ద యెత్తున అప్పుడు యువకులు వచ్చారు. దానివల్ల తెలంగాణ వార్తలకు జర్నలిజంలో ప్రాధాన్యం కూడా పెరిగింది.

ఆ తర్వాత ఇలా...

ఆ తర్వాత ఇలా...

దాసరి నారాయణ రావుకు ఉదయం దినపత్రిక అంటే ఎనలేని అభిమానం. దాంట్లో పనిచేసిన ఉద్యోగులన్నా ఇష్టమే. నేను సుప్రభాతం వీక్లీలో పనిచేసినప్పుడు ఇంటర్వ్యూ కోసం వెళ్లాను. నేను వెళ్లగానే ఆయన ఆలింగనం చేసుకుని ఉదయం దినపత్రికలో అద్భుతమైన జర్నలిస్టులు పనిచేశారని మెచ్చుకున్నారు. దాదాపు పదేళ్ల తర్వాత కూడా ఆయన నన్ను గుర్తు పెట్టుకోవడం నాకు ఆశ్చర్యం కలిగించింది.

అలా జరిగింది...

అలా జరిగింది...

ఉదయం బ్యూరోలో నేను నైట్ డ్యూటీ చేస్తున్నప్పుడు ఓ ఫోన్ వచ్చింది. నాతో పాటు క్రైమ్ రిపోర్టర్ ప్రశాంత్ రాయ్ మాత్రమే ఉన్నారు. ఫోన్ రిసీవ్ చేసుకోగానే ఓ గొంతు వినిపించింది. ఎవరూ అని అడిగితే అవతలి నుంచి పేరు చెప్పారు. గొంతేమో మగగొంతులాగా ఉంది. అవతలి నుంచి ఫోన్ చేసినవారు దాసరి నారాయణరావు సతీమణి దాసరి పద్మ. నా తీరు కాస్తా ఆమెకు కోపం తెప్పించినట్లు ఉంది. నా ఆఫీసులో పనిచేస్తూ నన్నే గుర్తు పట్టవా అంటూ కాస్తా గద్దించినట్లు అన్నారు. దాంతో వెంటనే ప్రశాంత్ రాయ్‌కు ఫోన్ ఇచ్చేశాను. ఇది ఆఫీసులో పెద్ద ఆందోళనకు దారి తీసింది. ఆ మర్నాడు దాసరి నారాయణ రావు ఫోన్ చేసి పద్మ తరఫున నాకు సారీ చెప్పారు. దాసరి నారాయణ రావు పాటించిన విలువలు ఇవి. ఆ విలువల కారణంగానే ఉదయం దినపత్రికను ప్రజలు గుండెకు హత్తుకున్నారు.

ఒసేయ్ రాములమ్మ....

ఒసేయ్ రాములమ్మ....

దాసరి నారాయణ రావు ప్రజా ఉద్యమాలకు బాసటగా నిలిచేవారు. అందులో భాగంగానే ఆయన ఒసేయ్ రాములమ్మ వంటి సినిమాలు తీశారు. సినిమాల్లో తెలంగాణ భాషను వాడి మెప్పించిన దర్శకుడు ఆయన. మందకృష్ణ మాదిగ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ఉద్యమానికి కూడా ఆయన అండగా నిలిచారు. చిన్న సినిమాలకు ఆయన బాసటగా నిలుస్తూ వచ్చారు. దాసరి నారాయణ రావు ఆధ్వర్యంలో ఉదయం దినపత్రిక ప్రజాతంత్ర ఉద్యమాలకు మద్దతుగా నిలబడింది.

- కాసుల ప్రతాపరెడ్డి
వన్ఇండియా తెలుగు సీనియర్ ఎడిటర్

English summary
Oneindia Telugu senior editor Kasula Pratap Reddy remembered his association with Dasari Narayana Rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X