వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సంబంధాలు: వ్యక్తిత్వంలో గుణాత్మక మార్పు

By Pratap
|
Google Oneindia TeluguNews

ఈ ప్రపంచం, సమాజం, సైన్స్‌, టెక్నాలజీ, మానవ స్వభావాలు, ప్రకృతి, వనరులు, జీవితం, వ్యవస్థలు ఎలా ఉన్నాయి, ఎలా ఉండాలి, అందుకు ఎలా కృషి చేయాలి, అందుకు ఇంతదాక మానవ సమాజం చేసిన ప్రయత్నాలు, ప్రయోగాలు, అనుభవాలు ఏమిటి అని తెలుసుకోవడం అవసరం. అలా తెలుసుకుంటూ, అందరికోసం ఆలోచిస్తూ, సామాజిక న్యాయాన్ని ఆచరిస్తూ, సమాజానికి నాయకత్వం వహించినపుడే సమగ్ర సామాజిక వికాసం, సమగ్ర వ్యక్తిత్వ వికాసం ఏక కాలంలో సాధ్యపడుతుంది.
జీవితం అనేక మానవ సంబంధాల గుండా సాగుతుంది. మానవ సంబంధాల స్వభావాన్ని అనుసరించి వాటికి అనేక నిర్వచనాలు, పేర్లు పెట్టారు. ఇవన్నీ వ్యక్తిత్వంలోని, వ్యక్తిత్వ వికాసంలోని, స్వభావంలోని అనేక కోణాలను, కర్తవ్యాలను తెలుపుతాయి.

1. అమ్మా నాన్న కుటుంబ సంబంధాలు, వావివరసలు
2. ఊరు వాడ ప్రాంత సంబంధాలు
3. క్లాస్‌మేట్‌ అనుబంధాలు, ఉద్యోగ సంబంధాలు
4. భాష సంస్కృతి సంబంధాలు
5. పని సంబంధాలు, ధనిక, పేద, వర్గ సంబంధాలు, ఉత్పత్తి సంబంధాలు
6. కుల సంబంధాలు
7. స్త్రీ పురుష సంబంధాలు
8. సాంస్కృతిక సంబంధాలు, మత సంబంధాలు
9. రాజకీయ సంబంధాలు, ప్రభుత్వ పరిపాలనా వ్యవస్థలతో సంబంధాలు
10. మానవ సంబంధాలు, మానవతా సంబంధాలు
11. ప్రేమ కరుణ స్నేహ సంబంధాలు
12. ఆసక్తి, అభిరుచి సంబంధాలు
13. భావజాల సంబంధాలు
14. సంస్థాగత సంబంధాలు, వ్యవస్థాగత సంబంధాలు
15. ప్రభుత్వానికి, సమాజానికి, వ్యక్తిజీవితానికి, రాజకీయానికి, భావజాలానికి మధ్య గల అంతస్సంబంధాలు
16. జీవన ప్రమాణాలకు, సామాజిక పరిణామాలకు, దృక్పథాలకు, లక్ష్యాలకు ఉద్యమాలకు మధ్య గల అంతస్సంబంధాలు
17. జ్ఞానానికి, జ్ఞానక్రమాలకు, జీవితానికి గల అంతస్సంబంధాలు

Personality development: BS Ramulu on invitable relations

జీవితంలో అనేక థలు కొనసాగుతాయి. బాల్యంలోని తొలి పది సంవత్సరాలు మిగతా జీవితంలోని వ్యక్తిత్వాన్ని ఆలోచనలను నిర్దేశిస్తాయని కొందరు చెప్తుంటారు. పేదరికంలో పుట్టి, పెరిగినవారు, ఆ తర్వాత కష్టపడి పైకి వచ్చినపుడు బాల్యంలోని పేదరికం వేసిన ప్రభావాలు, తద్వారా కలిగిన భావాలు, అనుభవాలు, గుణపాఠాలు. అనేకం మార్చుకోవాల్సి ఉంటుంది. గుమస్తాగా ఉద్యోగంలోకి ఎక్కినవాళ్ళు కష్టపడి పరీక్షలు నెగ్గి, అనుభవాలు సంపాదించి, ప్రమోషన్లు కొట్టి, మేనేజర్లుగా, తాహసిల్‌దార్లుగా, జిల్లా అధికారులుగా, జోనల్‌ ఆఫీసర్లుగా ఎదుగుతుంటారు. ఆ ఎదిగిన క్రమానికి, హోదాకు, జీవితానికి అనువుగా నడక, నడత, ప్రవర్తన, మాటతీరు, హుందా తనం మార్చుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు గుమస్తా ఉద్యోగంలో పై అధికారికి అడిగింది రాసిపెట్టడం, చేసిపెట్టడం జరుగుతుంది. నిర్ణయాలు తీసుకోరు. కానీ మేనేజర్‌గా, ఆఫీసర్‌గా, ఎం.డి.గా, సి.ఈ.ఓ.గా, అధికారిగా నిర్ణయాలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. గుమస్తా చెప్పిన పని చేస్తుం టారు. సి.ఈ.ఓ., అధికారి పనులు చెప్పడం, పనులు చేయించడం ఎవరితో ఏ పని సాధ్యమో, ఎలా తన సిబ్బందిని అభివృద్ధి పర్చాలో నేర్చుకోవాల్సి ఉంటుంది. ఎదగాల్సి ఉంటుంది. దీన్నే ప్యారడైమ్‌ షిప్ట్‌ అని, గుణాత్మక మార్పు అని అంటుంటాము.

పెళ్ళి కాకముందు అందరూ పిల్లలే. పెళ్ళి అయ్యాక తమ సంతానంతో తల్లిదండ్రులుగా మారతారు. తల్లిదండ్రులుగా వారు పిల్లలకు నాయకులుగా మారతారు. పెళ్ళి కాకముందు తల్లిచాటు, తండ్రిచాటు పిల్లలుగా ఎదిగిన వారు తామే తల్లిదండ్రులుగా ఎదగడం అనేది జీవితంలో, వ్యక్తిత్వంలో, స్వభావంలో ఒక గుణాత్మకమైన మార్పు, ప్యారడైమ్‌ షిఫ్ట్‌.

జీవితం, వ్యక్తిత్వం ఇలా ఒక థనుండి మరొక థకు వ్యక్తిత్వం పరి ణామం చెందుతుంది. బాల్యంలోని తొలి ఐదేళ్ళు ఒక థ. ఆరు నుండి పదేళ్ళ వయస్సు వరకు మరొక థ. పదకొండు నుండి పదహారేళ్ళ వరకు ఒక థ. పదహారేళ్ళకు పదవ తరగతి అయిపోతుంది. ఇంటర్‌లో చేరతారు. చదువుకోని వారి జీవితంలో కూడా పదహారో యేట నుండి... బాలిక రజస్వల కావడంనుండి... వయస్సును అనుసరించి శరీరంలో మార్పులు రావడం నుండి... వ్యక్తిత్వంలో ఒక మలుపు ప్రారంభ మవుతుంది. టీనేజ్‌ థ అని దీన్నే అంటారు. పదిహేడవ యేట నుండి ఇరవైవొకటో యేట వరకు టీనేజ్‌ థనుండి యవ్వనం థకు వ్యక్తిత్వం మలుపు తిరుగుతుంది.
ఇరవైఎనిమిదేళ్ళవరకు శరీరంలో ఎముకల పెరుగుదల, కండరాలు, కండలు పెరుగుదల సుమారుగా పూర్తవుతుంది. ఇరవై మూడో యేట నుండి శరీరంలో వచ్చే మార్పులు మరోరకమైనవి. అవి ఆహారపు అలవాట్లు, పని పరిస్థితులు, నిద్ర వగైరాలతో మార్పులు వస్తుంటాయి. ఇరవైఆరో యేడు నుండి ముప్పై ఆరో యేడు వరకు నిండు యవ్వన వ్యక్తిత్వ వికాసం, జీవన వికాసం సాగుతుంది. ముప్పై ఏడో యేట నుండి నలభై ఐదు యేడు వరకు ఒక సమగ్ర సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం.

ఇక ఆ తర్వాత నలభై ఆరో యేట నుండి యాభయవ యేడు వరకు మరొక థ. ఇలా ప్రతి ఐదు యేళ్ళకు అటు ఇటుగా వ్యక్తిత్వ వికాసంలో జీవితంలో, శరీరంలో మలుపులు, మార్పులు చోటు చేసుకుంటాయి. మహిళ లకు మోనోపాజ్‌ థ వస్తుంది. అది వ్యక్తిత్వంలో, స్వభావంలో, ఆరోగ్యంలో అనేక మార్పులకు దారి తీస్తుంది. గర్భసంచి తీసివేసిన తర్వాత కూడా అనేక మార్పులు జరుగుతాయి.
కొందరు ఏదో ఒక థలో ఆలోచనలో, వ్యక్తిత్వ వికాసంలో, జీవితంలో, అభివృద్ధిలో ఆగిపోతుంటారు. అందిన అవకాశాలు, ఆసక్తి, అభిరుచి, సాహసం, లక్ష్యాలు, ప్రోత్సాహం, సహకారం అనుసరించి వ్యక్తిత్వాలు వికసిస్తుంటాయి... వికసించిన వ్యక్తిత్వాలు కుదించుకు పోతుంటాయి. ఆగిపోవడం అనివార్యమై కూడా ఆగిపోతుంటారు.

ఉదాహరణకు కొందరు పదవ తరగతితో ఆగిపోతారు. ఒకటవ తరగతిలో వందమంది చేరితే పదవ తరగతికి పదమూడు మంది మాత్రమే మిగులు తున్నారు. ఏటా పద్నాలుగు లక్షలమంది పదవ తరగతి పరీక్షలు రాస్తున్నారు. అందులో రెండు వంతులు ఇంటర్‌కు చేరుతున్నారు. ఇలా ఏటా కోటి ఇరవై లక్షలమంది ఐదేళ్ళ వయసులో బడికి వెళ్ళాల్సి ఉండగా కొందరు వెళ్ళలేకపోతున్నారు. కోటి ఇరవై లక్షలకు బదులుగా పద్నాలుగు లక్షలమందే పదవ తరగతికి చేరుతున్నారు. పీజీకి వచ్చేసరికి లక్షల సంఖ్య వేలల్లోకి కుదించుకుపోతున్నది.

ఇలా ఆధునిక విద్య ద్వారా అందుకొనే అభివృద్ధి, వ్యక్తిత్వ వికాసం పది శాతం ప్రజలకైనా సాధ్యం కావడంలేదు. అందరికీ ఉన్నత విద్య, ఉచిత విద్య, హాస్టల్‌ వసతి కల్పించినపుడు అందరు ఆధునిక విద్యను అందుకొని ఎదగడం సాధ్యం. ఇలా మెజారిటీ ప్రజలు ఆధునిక విద్య ద్వారా కాకుండా ఆయా వృత్తులు, ఉపాధి పనులు చేసుకుంటూ ఇరుగుపొరుగు, సమాజంతో గల సంబంధాలలో భాగంగా విని, చూసి, అనుభవంతో వ్యక్తిత్వాలు, జీవితాలు అభివృద్ధి పరుచుకుంటున్నారు.

ఆధునిక విద్య, ఆధునిక అభివృద్ధి, సైన్స్‌ టెక్నాలజీ ఫలాలు అందుకొని ఎదుగుతున్న వ్యక్తిత్వ వికాసానికి, వ్యక్తులకు, బృందాలకు అది అందుకోని మిగతా ప్రజలు అనుభవంతో అనేక విధాలుగా డ్రాప్‌ అవుట్స్‌ అవుతూ, ఆగిపోతూ, తద్వారా ఇన్ఫిరియారిటీకి గురవుతూ... దాన్నుండి బయట పడే ప్రయత్నం చేస్తూ... సమాజంలో తనదైన గుర్తింపు కోరుకుంటూ ముందుకు సాగే క్రమంలో వ్యక్తిత్వ వికాసాలు, జీవితాలు కొనసాగుతున్నాయి. ఈ రెండు రకాల వ్యక్తిత్వ వికాస క్రమాలు భిన్నమైనవి. పరస్పర పూరకమైనవి. ఒకటి పరోక్ష అనుభవాలను శాస్త్రీయంగా విద్యావిధానం ద్వారా, శిక్షణల ద్వారా క్రోడీకరించి అందించడం, అందుకోవడం, అందుకొనే అవకాశాలతో ఎదగడం. మరొకటి ప్రత్యక్ష అనుభవాలను, జీవితంతో నేర్చుకుంటూ ముందుకు సాగడం. ప్రయోగాలు, ప్రత్యక్ష అనుభవాలే తిరిగి జ్ఞానంగా, శాస్త్రంగా మార్పు లకు దారి తీస్తాయి.
అరవై శాతం జనాభాకు ఉన్నత విద్య గానీ, పదవ తరగతి వరకైనా విద్య గానీ అందడం లేదు. అనగా అరవై శాతం బాలబాలికలు బాల కార్మికు లుగా జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. నాలుగింట ఒక వంతు మాత్రమే ఒక స్థాయి విద్యావంతులుగా ఎదుగుతున్నారు. మూడింట ఒక వంతు మాత్రమే ఆధునిక అభివృద్ధిని అందుకుంటున్నారు. ఎదుగుతున్నారు. అనగా ఆధునిక విద్య ద్వారానే ఎక్కువమంది జీవన ప్రమాణాలను, వ్యక్తిత్వాలను అభివృద్ధి పరుచుకోగలుగుతున్నారు. మిగతా మెజారిటీ ప్రజలది అనుభవ సారమే వ్యక్తిత్వం. ఆధునిక విద్య అందుబాటులోకి వచ్చి వందేళ్ళు కూడా కాలేదు. స్వాతంత్య్రానంతరమే అందరికీ విద్య లక్ష్యం ముందుకు వచ్చింది. అంతకుముందు శతాబ్దాలుగా అనుభవాన్ని బట్టి సమాజంలోని కుల, వర్గ, మత అంతస్థులను బట్టి వ్యక్తిత్వం, జీవన ప్రమాణాలు కొనసాగాయి.

ఆధునిక వ్యక్తిత్వ వికాసం ఈ సమాజాన్ని అసమానతల నుండి, వివక్షతల నుండి అసమాన అభివృద్ధి నుండి స్వేచ్ఛా సమానత్వం, సౌభ్రాతృత్వం, సమాన అవకాశాలు, అవకాశాలు అందుకోవడానికి మౌలిక సదుపాయాల కల్పన, శిక్షణ, అత్యున్నత విద్య అందించడం లక్ష్యంగా, పునాదిగా సాగాల్సిన అవసరం ఉంది. కేవలం వ్యక్తి వికాసం ఒక వ్యక్తికో, కుటుంబానికో పరిమిత మవుతుంది. అది చాలాసార్లు ఇతరుల అవకాశాలను తీసుకొని తాను ఎదగ డానికి కూడా మలుపు తిరుగుతుంది.

ఉదాహరణకు అందరూ సమాన అవకాశాలను అన్ని స్థాయిల్లో అందుకోవడానికి మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా హాస్టళ్లు, ఉచిత ఉన్నత విద్య, రిజర్వేషన్లు కల్పిస్తే వాటిని వ్యతిరేకి స్తుంటారు. వీటిని వ్యతిరేకించడం వ్యక్తిగత అభివృద్ధి, స్వార్ధం తప్ప, సామాజిక న్యాయం, సామాజిక దృక్పథం కొరవడిన వ్యక్తిత్వ వికాసం అవుతుంది. ఇది ఈ సమాజాన్ని ఇలాగే అసమానతలతో కొనసాగే వ్యక్తిత్వాల జిరాక్సులను తయారు చేస్తూ ఉంటుంది. ఇలాంటి వ్యక్తిత్వ వికాసం వల్ల సమాజానికి ఒరిగేది తక్కువ. సమాజం నుండి పొందేది ఎక్కువ.

సమాజాన్ని పట్టించుకొంటూ, తనకు తాను ఎదుగుతూ అభివృద్ధిని, నూతన విలువలను, నూతన సంస్కృతిని, నూతన మానవ సంబంధాలను, నూతన జీవన విధానాలను, నూతన స్త్రీ పురుష సంబంధాలను, ప్రేమలను, స్నేహాలను, పునర్‌ నిర్వచించు కొని, పునర్నిర్మించుకొని ముందుకు సాగడమే సామాజిక వ్యక్తిత్వం. నిజానికి వ్యక్తిత్వం అంటేనే సామాజిక వ్యక్తిత్వం. సమా జంలో భాగంగా ఉన్నపుడే దాన్ని వ్యక్తిత్వం అని పిలుస్తాము. కుటుంబం లోను, తానొక్కడే ఎదగాలనే స్వార్ధం కూడా చూడవచ్చు. ఇలాంటి వ్యక్తిత్వాలు స్వార్ధానికి ప్రతిబింబాలు.

పైన పేర్కొన్న పలు అంశాల్లో దేనికది ప్రత్యేకంగా పరిశీలించి నపుడే వ్యక్తిత్వ వికాసం ఎక్కడ సొట్ట పోయిందో, ఎక్కడ చక్కగా ఉందో, ఎక్కడ స్వార్ధం ఏలుతుందో తెలుస్తుంది. తనను తాను సవరించుకోవడానికి ఇతరులు సవరించడానికి, స్వీయ సమీక్ష చేసుకోవడానికి, అద్దంలో, తనను తాను చూసుకున్నట్లుగా చూసుకోవడానికి పై అంశాల వారీగా పరిశీలించు కుంటూ, తనను తాను మలుచుకుంటూ వ్యక్తిత్వ వికాసానికి కృషి చేయడం అవసరం.

- కాసుల ప్రతాపరెడ్డి

English summary
An emeinent writer BS Ramulu discussed about relations to be developed for invitable change in life tp move forward.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X