వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇంట గెలవడం - ఒక లోలోపలి మాట (ఫోటోలు)

By Pratap
|
Google Oneindia TeluguNews

జయశంకర్ సార్ జయంతి సందర్భంగా క్షేత్రస్థాయి పరిశీలనకోసం వరంగల్ జిల్లాలోని వారి స్వగ్రామమైన అక్కంపేట గ్రామానికి వెళ్లినప్పుడు రెండు రకాల అనుభవాలు ఎదురయ్యాయి. అవి నిజంగా యావత్ తెలంగాణ ఆలోచించవలసిన విషయాలే. అవి కేవలం జయశంకర్ సార్‌కు సంబంధించే కాదు, ఉద్యమాల్లో నిజాయితీగా, సంపూర్ణంగా నిమగ్నమైన వ్యక్తులకు సంబంధించి ఎప్పుడైనా చర్చకు వచ్చేవే. అయితే, తెలంగాణ పునర్నిర్మాణ సమయంలో మాత్రం అక్కంపేట గ్రామస్థుల మనోభావాలు, వారి అభిప్రాయాల గురించి కొంచెం లోతుగా ఆలోచించవలసిందే. మరి ఆ అభిప్రాయం ఏమిటీ అంటే జయశంకర్ సార్ ఊరికి చేసిందేమిటీ? అన్నది. స్కూల్‌కు ఒక ఎకరం స్థలం డొనేట్ చేయడం తప్ప ఆయన మా ఊరికి ఏం చేసిండయ్యా? అనడం.

ఒకరని కాదు, ఎక్కువ మంది అభిప్రాయం ఇది. ఊర్లో అన్ని కులాల వాళ్లున్నరు. బంధువుల కుటుంబాలూ ఉన్నయి. ఆరువేల పైగా జనాభా ఉంది. అయితే, ఇది ఆయన 81 వ జయంతి సందర్భం. సంబుర సమయం. స్ఫూర్తివంతమైన రోజు. అయినా వాడవాడలా తిరిగి చూస్తుంటే, మనసు విప్పి మాట్లాడుతుంటే, యువతరం పక్కన పెడితే తొలి తరం, అంతకు ముందరి తరం అంటే- జయశంకర్ సార్ తరం, వారి తండ్రి తరం -వాళ్లంతా ఒకింత కినుక వహించే ఉన్నరు. తెలంగాణ విజయ దరహాసం కన్నా వాళ్ల స్వీయ జీవిత అనుభవం నుంచి వారు అనేక ప్రశ్నలు పెట్టిండ్రు. ఒక రకంగా వీటిని ప్రశ్నలు, అభిప్రాయాలు అనేకంటే లౌడ్ థింకింగ్-లోలోపల మాట్లాడుకోవడం అనుకోవాలి.

మరి వారి అభిప్రాయం ఏమిటంటే ఆయన మాకేమీ చేయలేదని! చిత్రమైందేమిటంటే, దీనికి భిన్నంగా యువత ఆలోచించడం.

అవును. 'సార్... మా తరానికి చేసిన మేలు మరవలేనిది. ఎవ్వరూ చేయలేని పని చేసిండు. తెలంగాణ సాధనకు కావాల్సిన సిద్ధాంతకర్తగా అపూర్వమైన కృషి చేసిండు' అని చదువుకున్న యువతరం హృదయపూర్వకంగా, ఎంతో వినమ్రంగా చెబుతుంటే, జయశంకర్ వల్ల 'మాకేమి ఫాయిదా అయింది?' అని ఊర్లోని గ్రామస్థుల సగటు అభిప్రాయం.

జయశంకర్ ఊరు

జయశంకర్ ఊరు

వరంగల్ జిల్లా అక్కంపేట గ్రామంలో పుట్టిన జయశంకర్ తెలంగాణ జాతిపితగా పేరెన్నిక గన్నారు. ఆ ఊరి ప్రజలు ఆయన గురించి ఏమనుకుంటున్నారనేది ప్రధానం. ఆ ఊరిలో ఓ వృద్ధ మహిళ ఇలా..

జయశంకర్ ఊరు

జయశంకర్ ఊరు

జయశంకర్ ఊరు అక్కంపేటలో చిన్న పిల్లలు ఇలా కనిపించారు. వారు జయశంకర్ స్ఫూర్తితో జై తెలంగాణ అంటున్నారా..

జయశంకర్ ఊరు

జయశంకర్ ఊరు

తెలంగాణ రాష్ట్ర సాధనలో జయశంకర్‌ది కీలక పాత్ర. ఆయన తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిరంతం పోరాటం చేశారు.

జయశంకర్ ఊరు

జయశంకర్ ఊరు

ప్రొఫెసర్ జయశంకర్ పూర్వీకుల ఇల్లు వరంగల్ జిల్లా అక్కంపేట గ్రామంలో ఇలా కనిపిస్తోంది. ఆయన గ్రామానికి మాత్రమే కాదు, తెలంగాణకు పేరెన్నికగన్నవారు.

జయశంకర్ ఊరు

జయశంకర్ ఊరు

అక్కంపేట గ్రామంలో జయశంకర్ విగ్రహాన్ని స్థాపించారు. యువకులు జయశంకర్ నుంచి స్ఫూర్తి పొందారు.

జయశంకర్ ఊరు

జయశంకర్ ఊరు

అక్కంపేటకు చెందిన ఉపాధ్యాయుడు కమాలుద్దీన్ జయశంకర్ సార్ గురించి నిక్కచ్చిగా తన అభిప్రాయం వెల్లడించారు.

జయశంకర్ ఊరు

జయశంకర్ ఊరు

తెలంగాణ అంతటా జయశంకర్ జయంతి జరిగింది. అలాగే జయశంకర్ గ్రామంలోనూ జరిగింది. తెలంగాణ యావత్తు ఆయనను యాది చేసుకుంది

జయశంకర్ ఊరు

జయశంకర్ ఊరు

జయశంకర్ గ్రామంలో ఆయన జ్ఞాపకాలు ఎప్పుడూ మిగిలే ఉంటాయి. జయశంకర్ బంధువులు గ్రామంలో ఇలా పనిచేస్కుంటున్నారు.

జయశంకర్ ఊరు

జయశంకర్ ఊరు

జయశంకర్ పూర్వీకులు ఇల్లు కొనుక్కున్న వ్యక్తి ఇలా కనిపించారు. అతనికి అది ఓ మధురమైన విషయం కూడా..

జయశంకర్ ఊరు

జయశంకర్ ఊరు

జయశంకర్ గ్రామం అక్కంపేట ప్రజలు. జయశంకర్ కలలు గన్న తెలంగాణ రాష్ట్ర వచ్చేసింది. వీరి బతుకులు పండుతాయా.

తెలంగాణ సాధన వల్ల ఇక మా తరం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది అని యువత విశ్వాసం, ఆనందంతో సార్ గురించి ఘనంగా యాది చేసుకుంటుంటే, తమకున్న కొద్దిపాటి పరిచయం, సాన్నిహిత్యాన్ని కలబోసుకుంటుంటే పెద్దవాళ్లు మాత్రం నిర్లిప్తంగా మాట్లాడారు.

-ఇట్లా యువత మాట్లాడింది వేరు. పెద్దవాళ్ల ఆలోచనలు వేరు. నిజానికి జమశంకర్ సార్ ఒక రకంగా భూస్వామే. ఆయన రావు అని కూడా పిలిపించుకున్నవారు. ఒక రకంగా తనది దొర వ్యవహార శైలే. తొలి తరం వారు ఇలాగే ఆయన్ని చూశారు. యువతరం మాత్రం సార్‌ని తెలంగాణలో ఒక తొలి ఉపాధ్యాయుడిగా చూశారు. సార్ వాళ్ల నాయినని విద్యాధికుడని, హోమియోపతి డాక్టరు, పండితుడు, ఒక పుస్తకం కూడా రాసిండని వాళ్లు గుర్తు చేసుకుని గౌరవిస్తున్నరు. ఇదీ ఊర్లో భిన్నాభిప్రాయాల స్థితి. ఏమైనా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తొలి ఏడు జయశంకర్‌సార్ జయంతి గొప్పగా జరిగింది. ఒక రియల్ ఎస్టేట్ సంస్థ కూడా ఆ ఊరును దత్తత తీసుకోవడానికి ముందుకు వచ్చింది. జయశంకర్ సార్ చెల్లెలి కుమారుడే ఆ సభను నిర్వహించి, గ్రామాభివృద్ధిలో కీలక పాత్ర పోషించబోతున్నడు. ఆ సభ పెద్ద ఎత్తున జరిగింది. విజయవంతం అయింది. ఆ రకంగా తక్షణం మేలు జరిగే అంశాల్లో మళ్లీ గ్రామస్థులంతా జయశంకర్ సార్ స్ఫూర్తిని కొనియాడిండ్రు. ఆనందించిండ్రు. సార్ పేరు వల్ల గ్రామానికి మేలు జరిగితే సంతోషమే అంటున్నరు. అయితే, సార్ బహుముఖ కృషిని, వారి దీర్ఘదృష్టిని ఒక విలువగా, మేలుగా అర్థమైన నాడు మాత్రమే, ఇంట గెలవడం అన్నది జయశంకర్ సార్‌కు గానీ ఇంకెవరికైనా గానీ జరుగుతుంది తప్ప కేవలం తెలంగాణ సాకారం అవడంలోనే ఎవరూ ఇంట గెలవరేమో అనిపిస్తోంది.

కాగా, జయశంకర్ సార్ వ్యక్తిత్వం గురించి చాలా విషయాలు గ్రామస్థులు చెబుతున్నరు. ఆయన హన్మకొండలో పుట్టినప్పటికీ తండ్రి తాతల గ్రామమైన అక్కంపేటకు వస్తుండేవారు. చివరి రోజుల్లో కూడా వచ్చారని చెప్పారు. అయితే, తాను చాలా పట్టుదల మనిషని, ఎవరైనా మోసగొండి అని తేలితే, అది ఎంత చిన్న విషయంలోనైనా గానీ దూరం పెట్టేవారని, మాట్లాడటానికి కూడా సయించేవారు కాదని గుర్తు చేసుకున్నరు. ఆ గుర్తు చేసుకోవడం అన్నది గ్రామంలో ఎవరి స్వీయానుభావాలతో వారు గుర్తు చేసుకోవడం జరిగి, మన సమాజం నుంచి ఒక గొప్ప స్థాయికి చేరుకున్న వ్యక్తి విషయంలో కూడా కొంత విచారం, విముఖత ఉండటం కొంత ఇబ్బంది పెట్టే అంశమే. తెలంగాణ వచ్చిన ఆనందంలో ఊరు ఇలా కూడా రియాక్ట్ అవుతుందా అంటే అవుతుంది అని తేలుతున్నది.

అయితే, సార్ డబ్బుల విషయంలో కూడా చాలా పద్దతి గల మనిషని తెలిసింది. ఎవరైనా ఒక రూపాయి తక్కువ ఇచ్చినా సార్ ఒప్పుకునేవాడు కాదట. అది రూపాయి విషయమైనా ఐదు వందల విషయమైనా, మొత్తం ఇచ్చినప్పుడే ఇవ్వు అని తీసుకోకుండా ఉండేవాడట. ఈ విషయమై గ్రామస్థులు తలా ఒక అనుభవాన్ని నెమరేసుకుంటూ చెప్పినప్పుడు ఆయన రాజీలేని తత్వం వల్లే మొత్తం తెలంగాణ పరపీడన నుంచి బయట పడటం ఒక ముఖ్యమైన అంశంగా బోధపడింది. ఆ సంగతిని ఎవరు విడమరచి చెబుతారా అనిపిస్తోంది.

నిజానికి సార్ చిన్న చిన్న విషయాల కోసం జీవితాన్ని వెచ్చించలేదు. యావత్ తెలంగాణ స్వప్నం సాకారం కావడమే జీవితంగా బతికిండు. అందుకు ఆయన పెద్ద ఉపాయమే చేసిండు. మూడంచెల వ్యూహం-భావజాల ప్రచారం, ప్రజా పోరాటం, రాజకీయ నిర్మాణం. ఈ మూడూ జరగాలని సైద్దాంతీకరించారు. అలా గనుక జరిగితే తెలంగాణ రావడం ఖాయం అన్న నిశ్చయంతో ఆది నుంచి అదే ఆచరణలో ఉండిపోయిండు. వీటన్నిటిని బట్టి చూస్తే ఆయనది ఇచ్చి పుచ్చుకోలు వ్యవహారం పట్ల కరాఖండిగా ఉండే వ్యక్తిత్వం. అది ఊర్లో కొందరికి సయించకపోయినా, తెలంగాణ రావడానికి ఆ స్వభావమే ఒక అవసరమైన భూమికగా ఉపకరించిందని అర్థమౌతుంది. ఇంకా ఆయన స్వాభావిక లక్షణాలే తెలంగాణ నేటి విజయానికి దారి తీసిందనీ అనిపించింది. గ్రామస్థులకు నచ్చజెప్పే పని అని కాదు, ఉద్యమం అనంతరం కూడా భావజాల వ్యాప్తి అవసరం అన్న సోయితో కూడా ఈ విషయాలు ముందు పెట్టవలసి వస్తున్నది.

+++

అట్లే, జయశంకర్ సార్ హన్మకొండలో జన్మించి స్వగ్రామంతో సంప్రదింపుల్లో ఉండేవాడని, నోములకు తప్పక వచ్చేవాడని కొత్తపల్లి పేరుతో ఊర్లో ఉన్న సార్ బంధువులు - మూడు కుటుంబాల వారు గుర్తు చేసుకున్నరు. వాళ్లలో కొందరు పేదరికంలో ఉన్నరు. యువతీ యువకులు చిన్న చిన్న ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నరు. సార్ బతికి ఉండివుంటే తమకు లాభం జరిగేది అన్న భావన ఉన్నా, జరిగేదా అన్న సంశయమూ వారిలో ఉన్నది. ఎందుకూ అంటే మళ్లీ ఆయన వైఖరి. వ్యక్తులకు ఉపకరించడం అన్నది తనలో లేదు. సామాజికుడిగా బతకడమే తన నైజం. అంతెందుకు? తాను గ్రామానికి వచ్చినప్పుడు ఆయన యువతతో మాట్లాడటం... తెలంగాణ ఉద్యమంలో వారు రెట్టించిన ఉత్సాహంతో, మరింత ఎక్కువ సంఖ్యలో పాల్గొనేలా ప్రోత్సహించడం కొందరు గుర్తు చేసుకున్నరు. మొత్తంగా వ్యక్తిగత విషయాల ఎంక్వయిరీ కన్నా యువతలో ఉద్యమ స్ఫూర్తిని పంచడంలో ఆయన ఎంతో శ్రద్ధతో ఉండేవారని వారు గుర్తు చేసుకున్నరు.

ఇక్కడ ఇంకో విషయం. యువతరానికి సార్ వైఖరి వ్యక్తిగత స్థాయిలో తెలియదు. సార్‌ను స్వగ్రామానికి చెందిన వాడిగా కాకుండా తెలంగాణ సిద్ధాంతకర్తగా గమనించడమే వారికి అలవడింది. ఒక రకంగా వీరు మలిదశ ఉద్యమ సాధకుడినే సార్‌లో దర్శించారు. ఆ కోణంలోనే వారు స్ఫూర్తి పొందారు. అందువల్లే సార్ అంటే వారికి గౌరవం, అభిమానం. ఆ అభిమానాన్ని వారు బాహటంగా వ్యక్తం చేయడానికి సార్ జయంతి ఉత్సవాలను వాడుకున్నరు. కొన్నిచోట్ల గ్రామీణుల ప్రశ్నలకు వీరే సమాధానం ఇస్తూ సార్‌ను ఒక జాతి చెరవిడిపించిన సాహసిగా గుర్తించాలని, వ్యక్తిగత విషయాలకన్నా సార్ సామాజిక మూర్తిమత్వమే ప్రధానంగా చూడాలని ఒప్పించడం కనిపించింది.

మరో విషయం - నాడు తొలి దశ తెలంగాణ ఉద్యమంలో, నేటి మలిదశ ఉద్యమంలో సార్ పాత్రను స్మరించుకోవడం గ్రామంలోని పెద్దవాళ్లలో కనిపించలేదు. అందుకు కారణం సార్ సమ వయస్కులు, సార్ తండ్రి, తాతల్ని ఎరిగిన వారిది భిన్నమైన దృష్టి. ఆయన ప్రిన్సిపాల్‌గా, ఫ్రొఫెసర్‌గా, రిజిస్ట్రార్‌గా గంత పొజిషన్‌లో ఉండి కూడా మాకు నౌకర్లు పెట్టియ్యలేదని వాపోవడం వారిలో కనిపిస్తుంది. కానీ, సార్ వ్యవహార శైలి గురించి మనకంటే వారికే ఎక్కువ ఎరుక. ఆ ఎరుక వల్ల వారికొక అసంతృప్తి ఉంది. మనుషులుగా గౌరవం ఇచ్చాడు గానీ, వ్యక్తులకు గిది చేయాలని ఆలోచించిన వాడు కాదని వారి విచారం. అయితే, యువతరం ఆ గ్రామీణులకు నచ్చజెప్పడమూ ఆసక్తిగా ఉంది. కమాలుద్దీన్ ఒక ప్రైవేట్ టీచర్. అతడు మనతో అంటాడు, 'అది ఐన్‌స్టీన్ కావచ్చు, అబ్దుల్ కలామ్ కావచ్చు. మేధావుల కృషిని సవ్యంగా అర్థం చేసుకునే అవకాశం గ్రామీణులకు ఉండదు' అని! అందుకే నేటి తెలంగాణ పునర్నిర్మాణ సమయంలో గ్రామీణ స్థాయిలో జయశంకర్ సార్ వంటి వాళ్ల కృషి అంత త్వరగా అర్థం కాదు. సమయం పడుతుంది అని కూడా అన్నాడతడు.

చివరగా, ఇంట గెలవడం అన్నది గ్రామీణులకు సంబంధించి ఉన్న ఊర్లో గౌరవం పొందడమైతే- జయశంకర్ సార్‌కు తెలంగాణ రాష్ట్ర సాధనే ఇంట గెలవడం. ఆంధ్రా చెర నుంచి విడిపోవడమే రచ్చ గెలవడం. కానీ, ముందే చెప్పినట్టు ఇది ఒక జయశంకర్ సార్ సమస్యే కాదు, ఇవ్వాళ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా వ్యవహరించిన చాలామంది పెద్దలకు ఇటువంటి డిమాండ్ ఒకటుంది. వీరి వల్ల తమ బంధువులకు, సన్నిహితులకు తప్పక మేలు జరుగుతుందని ఆశిస్తున్నారు. ఆ రకంగా ఒక ఒత్తిడైతే ఉంది. దీన్ని కూడా అర్థం చేసుకోవాలి. అయితే ఒక మాట. తలలో నాలుకలా ఉండటం మొదలు, నౌకర్లు పెట్టించడం, ఎన్నో విధాలా అర్సుకోవడం అన్నది గ్రామీణ స్థాయి నుంచి కీలకంగా ఎదిగి వచ్చిన ఏ మనిషిపై అయినా పడే ఒక సామాజిక భారం. దీన్ని అర్థం చేసుకోవలసిన తరుణం ఇవ్వాళ మునుపటికన్నా ఎక్కువ ఉన్నది.

నిజానికి తెలంగాణ దశాబ్దాలుగా నీళ్లు, నిధులు, నియామకాల్లో అన్యాయానికి గురైంది. ఆ అన్యాయమే అక్రోశంగా ఇలా అక్కంపేట గ్రామంలోనూ వ్యక్తమైనప్పుడు మనం కొంచెం విచారిస్తం. కానీ, బంగారు తెలంగాణ పునర్నిర్మాణానికి ఇటువంటి వాస్తవిక ధోరణి నుంచి సమీక్షించుకోవడం ఒక అవసరం. జయశంకర్ సార్ ఏం చేసిండన్నది ్రగ్రామీణ ప్రపంచానికి తక్షణం చాటి చెప్పవలసిన చారిత్రక అవసరం. పాఠ్యాంశం అన్నది చాలా చిన్న విషయం అని గ్రహించాలి. బడి పిల్లలకు కాదు, సమాజానికే ఈ విషయంలో ప్రచారం అవసరం. లేనట్టయితే, పెద్ద పెద్ద చదువులు చదువుకుని, అంతకంటే పెద్ద పెద్ద కొలువులు చేసిన సార్ వంటి వాళ్లను తమ గ్రామం అర్థం చేసుకోవాలంటే, ఆ మనిషి వల్ల ఒక జాతి లేదా రాజ్యం లాభపడిందన్న సంగతిని విడమరచి గనుక చెప్పకపోతే, పరి పరి విధాలా వారి గురించి సరళంగా రచనలు చేసి అందించకపోతే నిజంగానే ఒక రాష్ట్రంగా ఇంట గెలిచి కూడా గ్రామస్థాయిలో తాత్కాలికంగానైనా ఓడిపోతం. అక్కంపేట అనుభవం పాత్రికేయులకే కాదు, అందరికీ ఈ సవాల్ విసురుతోంది. ఆలోచించగలరు.

ఫొటోలు, వ్యాసం: కందుకూరి రమేష్ బాబు

English summary
Journalist and Photographer Kandukuri Ramesh babu visited Jayashankar's vollage Akkampeta in Warangal district and interviewed the villagers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X