వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘కేజ్రివాల్-సునీత: ఇదీ ఢిల్లీ సిఎం ప్రేమ కథ’

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రివాల్ రెండోసారి ఢిల్లీకి ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత మొదట తన భార్య సునీతకు కృతజ్ఞతలు తెలిపారు. ఎందుకంటే ఆమె సహకారం లేనిదే తాను ఇంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకునేవాడ్ని కాదని కేజ్రివాల్ స్వయంగా ప్రజలకు తెలిపారు. ‘ఈమె నా భార్య సునీత. ఆమె లేకుండా నేను ఈ విజయాన్ని సాధించగలిగేవాన్ని కాదు' అని కేజ్రివాల్ పేర్కొన్నారు. దీన్ని బట్టి చూస్తే కేజ్రివాల్ జీవితంలో ఆమెకున్న ప్రాధాన్యత ఏమిటో తెలుస్తోంది.

చాలా మందికి తెలియని విషయమేమిటంటే కేజివాల్-సునీతలది ప్రేమ వివాహం. సునీత, కేజ్రీవాల్‌ ఇద్దరూ వారి వారి పనుల పట్ల నిర్ధిష్టమైన అభిప్రాయాలున్న వ్యక్తులు. ఈ ఇద్దరి ప్రేమప్రయాణం ఇరవైయ్యేళ్ల క్రితం ముస్సోరిలో మొదలైంది. కేజ్రీవాల్‌, సునీత ‘ఇండియన్‌ రెవెన్యూ సర్వీసు'లో బ్యాచ్‌మేట్‌లు. ప్రారంభంలో ఎప్పుడో కాని మాట్లాడుకునేవారు కారు ఈ ఇద్దరూ. సునీత ఎక్కువగా మాట్లాడే వారు కాదు. కేజ్రీవాల్‌కేమో మాట్లాడే అవకాశమొస్తే చాలు తన అభిప్రాయాలను నిర్భయంగా చెప్పేవారు.

సునీతతో సహా మిగతా బ్యాచ్‌మేట్లు అందరూ అతని మాటలు వింటూ కూర్చునేవారు. అంతలా మాట్లాడే ఆయనకు సునీతలోని నిశ్శబ్దం నచ్చింది. ఆమె ముఖంలో కనిపించే అమాయకపు చిరునవ్వు ఎంతో ఆకర్షించింది. తన జీవితంలో ఆమె ప్రత్యేకం అనుకున్నారు కేజ్రివాల్. కానీ వెంటనే ‘నువ్వంటే నాకిష్టం' అని చెప్పలేకపోయారాయన. ఆమె సమాధానం ఎలా ఉంటుందోననే భయం ఆయన్ని ఆపేసింది.

What Every Indian Man Should Learn from Arvind KejriwalWhat Every Indian Man Should Learn from Arvind Kejriwal

పనిపట్ల కేజ్రీవాల్‌ నిజాయితీ, వ్యవస్థలో మార్పు తీసుకురావాలనే అతడి ఆలోచనలు సునీత మనసును గెలుచుకున్నాయి. కానీ అంతర్ముఖురాలైన ఆమె మనసులోని మాటను బయటపెట్టలేదు. ఆ తరువాత కొన్నాళ్లకు ముస్సోరి నుంచి నాగపూర్‌లో ఉన్న ‘నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ డైరెక్ట్‌ టాక్సె్‌స'కి బదిలీ అయ్యారు వీళ్లు. అక్కడే వీళ్ల శిక్షణ పూర్తయ్యేది. అప్పటికి వాళ్లిద్దరూ మంచిస్నేహితులయ్యారు. ఆమె పట్ల ఉన్న ప్రేమను ఎప్పుడెప్పుడు వ్యక్తం చేయాలా అనే ఆతృత కేజ్రీవాల్‌ను నిలవనీయలేదు.

దీంతో ఒకరోజు ధైర్యం కూడగట్టుకుని ఆమె దగ్గరకు వెళ్లి ఎటువంటి ఉపోద్ఘాతం లేకుండా ‘‘నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా?'' అని అడిగాడు. అకస్మాత్తుగా అలా అడిగేసరికి సునీత కాస్త కంగారు పడ్డారు. ‘అవును' అని చెప్పేందుకు కొన్ని క్షణాల సమయం పట్టింది కాని ఆ విషయం చెప్పగానే ఆమె మనసులోని భారం దిగిపోయినట్టయ్యింది. ఇంకేం వీళ్లు వారి తల్లిదండ్రులను ఒప్పించే పని మొదలుపెట్టారు.

ఎక్కువగా ప్రేమ కథల్లో తల్లిదండ్రులు ప్రేమకి వ్యతిరేకంగా ఉంటారు. కానీ కేజ్రీవాల్‌, సునీతల విషయంలో అలా జరగలేదు. స్వతంత్ర భావాలున్న కేజ్రీవాల్‌ నిర్ణయాలను ఆయన తల్లిదండ్రులు గౌరవిస్తారు. అందుకే ఆయన ప్రేమ విషయంలో ఎటువంటి సమస్యా ఎదురవలేదు. తనకు జీవిత భాగస్వామి దొరికిందని నేరుగా తల్లిదండ్రులకు చెప్పారాయన. సునీత కూడా తన తల్లిదండ్రులకు కేజ్రీవాల్‌ గురించి చెప్పింది. ఇద్దరూ ఐఆర్‌ఎస్‌లే కావడంతో అటువైపునుంచీ ఎటువంటి అభ్యంతరం రాలేదు.

ఇంకేంముంది వారిద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. శిక్షణ పూర్తయిన వెంటనే ఇద్దరూ ఢిల్లీలో ఒక చిన్న అపార్టుమెంటు తీసుకుని కాపురం మొదలుపెట్టారు. పెళ్లి తర్వాత ప్రేమ పాతబడుతుంది అంటారు. కానీ వీరి విషయంలో అలా జరగలేదు. పెళ్లి తర్వాతే ప్రేమ కొత్త చిగుర్లు తొడిగింది. 1996లో సునీత మొదటి బిడ్డ హర్షితకు జన్మనిచ్చారు. ఆ తరువాత వారికి 2001లో పుల్‌కిత్‌ జన్మించాడు.

కాగా, అరవింద్ కేజ్రివాల్ ప్రభుత్వ ఉద్యోగం చేరారు. కానీ తన చుట్టూ ఉన్న అవినీతి పరిస్థితులు ఆయన్ని ఉద్యోగంలో కొనసాగనీయలేదు. దీతో 2006లో న్యూఢిల్లీలో ‘ఇన్‌కంటాక్స్‌ జాయింట్‌ కమిషనర్‌'గా ఉన్న ఆయన రాజీనామా చేశారు. అది విన్న సునీత మొదట కంగారు పడ్డారు. కానీ తన భర్తకి మద్దతుగా నిలిచారు. అతను సంతోషంగా ఉంటే చాలనుకున్నారు. ఆ తరువాత కొన్నాళ్లకి జనలోక్‌పాల్‌ బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందకపోవడంతో కూకటివేళ్లతో సహా లంచగొండితనాన్ని పెకిలించాలంటే రాజకీయాలను మించిన మార్గం లేదనుకున్నారు కేజ్రీవాల్‌. అప్పుడు కూడా సునీత అతనికి మద్దతుగా నిలిచారు.

కేజ్రీవాల్‌ రాజకీయాల్లో బిజీ అయిపోవడంతో ఇంటి బాధ్యతలన్నీ సునీతే చూసుకోవాల్సి వచ్చేది. బాధ్యతలే కాదు ఇంటికి ఆర్థిక పెద్ద కూడా ఆమే అయ్యారు. ఆఫీసు పనిని, ఇంటి పనిని చాలా బాగా సర్దుబాటు చేసేవారామె. ఆఫీసు, ఇంటి పనులు చేసుకుపోయే అలవాటున్న సునీత మీడియాలో ప్రధాన మంత్రి ఫోటో పక్కన తన భర్త ఫోటో వస్తే ఎలా ఫీలయ్యేవారు? కేజ్రీవాల్‌ రాజకీయాల్లోకి రావడాన్ని అందరూ తప్పుపట్టినప్పుడు ఆమె ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఇవే ప్రశ్నలు ఆమెను అడిగితే ఓ చిరునవ్వు నవ్వి ‘నేను అటువంటి వాటి గురించి అంతగా పట్టించుకోను' అని చెప్పారు.

‘బయటి విషయాల ప్రభావం ఆయన మీద, పిల్లల మీద లేకుండా ఉండాలనుకుంటాను. ఆయన ఇప్పుడు చేస్తున్న పనిని ఉద్యోగంలాగానే చూస్తాను తప్ప మరోలా కాదు. ఆయన ముఖ్యమంత్రి అయినా నా ఉద్యోగాన్ని మాత్రం వదలను' అని సునీత చెప్పారు. కాగా, బుధవారం నాడు సునీత పుట్టినరోజు కాగా ఒక రోజు ముందుగా అంటే మంగళవారం(ఢిల్లీ ఎన్నికల ఫలితాలు విడుదలైన ఫిబ్రవరి 10) నాడే వేడుకలు మొదలయ్యాయి సునీత ఇంట్లో.

English summary
On February 10, when Kejriwal and AAP's landslide victory in Delhi elections was announced, his first pictures were that of him hugging his wife. In fact, the first picture that he tweeted post elections was one with this wife, where he thanked her for having stood by him all these years. "Thank u Sunita for always being there ", he tweeted.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X