వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కిరణ్, పెద్దిరెడ్డి వైరమేనాటిదో!

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్ రెడ్డిపై విరుచుకు పడుతున్న మాజీ పార్లమెంటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వర్గం నేత, కాంగ్రెస్ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మధ్య వైరం జిల్లాలో ముప్పయ్యేళ్ల నుండి కొనసాగుతోంది. కిరణ్‌కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రిగా నియమించడం వల్లనే ఆయనపై ఉన్న వ్యక్తిగత వైరంతోనే పెద్దిరెడ్డి జగన్ వర్గంలోకి వెళ్లడానికి ఒక కారణంగా తెలుస్తోంది. వారిద్దరి మధ్య ఉన్న వ్యక్తిగత వైరం కారణంగా కిరణ్ ముఖ్యమంత్రి అయ్యాక పెద్దిరెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్నారు. తాను పార్టీలో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రిని వ్యతిరేకిస్తానని బాహాటంగా ప్రకటించారు. ముఖ్యమంత్రి జిల్లా అయిన చిత్తూరులో పెద్దిరెడ్డితో పాటు గల్లా అరుణకుమారితో కూడా విభేదాలు కిరణ్‌కు ఉన్నప్పటికీ ఆమెను తిరిగి మంత్రి పదవిలో కూర్చుండబెట్టి తన దారిలోకి తెచ్చుకున్నాడు. అయితే పెద్దిరెడ్డిని మాత్రం దూరంగా ఉంచడానికి కారణం సంవత్సరాలుగా కొనసాగుతున్న వైరమే.

కిరణ్‌కుమార్ రెడ్డిది రాజకీయ నేపథ్య కుటుంబమే. తండ్రి అమరనాథ్ రెడ్డి చిత్తూరు జిల్లాలో 1967నుండి 1988 వరకు ఎమ్మెల్యేగా చేశారు. అప్పటి నుండి ఒకే పార్టీలో ఉన్న పెద్దిరెడ్డికి అమరాథ్ రెడ్డికి మధ్య విబేదాలు పొడసూపాయి. దివంగత ప్రధాని ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీని చీల్చినప్పుడు అమరనాథ్ రెడ్డి ఇందిర పార్టీలోకి వెళ్లారు. ఆ సమయంలో పెద్దిరెడ్డికి నాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న చంద్రబాబుకు కూడా పడేది కాదు. పెద్దిరెడ్డి రైతు కుటుంబంనుండి వచ్చినవాడు. విద్యార్థి దశలోనే చంద్రబాబును ఎదుర్కొనేవారు. పోటాపోటీగా విద్యార్థి నాయకుడిగా పోరాటం చేసేవారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా జలగం వంటి వారితో ర్యాలీని కూడా నిర్వహించారు.

తాను విభేదించే అమరనాథ్ రెడ్డి ఇందిర పార్టీలోకి వెళ్లినప్పటికీ పెద్దిరెడ్డి కాంగ్రెస్‌ను వీడి ఎనభయ్యో దశకంలో జనతా పార్టీనుండి పోటీ చేశారు. ఎందుకంటే అమరనాథ్ రెడ్డితో పాటు తాను విద్యార్థి దశనుండే విభేదించే చంద్రబాబు కాంగ్రెస్‌లో ఉండటమే అందుకు కారణం. అయితే జనతా పార్టీనుండి పోటీ చేసిన పెద్దిరెడ్డి ఓడిపోయారు. అనంతరం చంద్రబాబు టిడిపిలోకి వెళ్లడం, జనతాలో రాజకీయ జీవితం ప్రశ్నార్థకంగా మారడంతో తిరిగి కాంగ్రెస్‌లోకి పెద్దిరెడ్డి వచ్చారు. అలాంటి సమయంలోనే అమరనాథ్ రెడ్డి మరణించడంతో అనుకోని అవకాశంగా కిరణ్‌కుమార్ రెడ్డి 1989లో రాజకీయాల్లోకి వచ్చారు. 89లో వాయల్పాడునుండి ఎమ్మెల్యేగా గెలిచారు. పెద్దిరెడ్డికి అమరనాథ్ రెడ్డితో ఉన్న విభేదాల నేపథ్యంలో క్రమంగా పెద్దిరెడ్డి, కిరణ్‌కుమార్ రెడ్డికి దూరం పెరిగింది.

అప్పటినుండి జిల్లాలో వారిద్దరి వర్గం మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వరకు విభేదాలు పెరిగాయి. 2004 వరకు కిరణ్ పివి వర్గంవైపు ఉండేవారు. అయితే పెద్దిరెడ్డి దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి సత్సంబంధాలు కొనసాగించడం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో తన రాజకీయ భవిష్యత్తు దృష్ట్యా కిరణ్ సైతం వైఎస్ వైపు మళ్లారు. 2004నుండి ఇద్దరూ వైఎస్ వర్గంలో ఉన్నప్పటికీ వారి వ్యక్తిగత విభేదాలు మాత్రం రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. 2009లో నియోజకవర్గ పునర్విభజన కారణంగా వాయల్పాడు నియోజకవర్గం రద్దు కావడంతో ముఖ్యమంత్రి కిరణ్ పీలేరునుండి పోటీ చేసి గెలిచారు. అయితే తనను పెద్దిరెడ్డి ఓడించేందుకు కుట్ర పన్నారని నాటి ముఖ్యమంత్రి వైఎస్‌కు కిరణ్ 2009 ఎన్నికల తర్వాత ఫిర్యాదు కూడా చేశారు. అయితే వైఎస్ వర్గంలో పెద్దిరెడ్డి మంత్రి పదవులు అనుభవించినా, కిరణ్ స్పీకరుగా ఉన్నా జిల్లాలో మాత్రం వారి వారి వర్గాన్ని పెంచి పోషిస్తున్నారు.

వైఎస్ మృతి తదనంతర పరిణామాల నేపథ్యంలో కిరణ్‌కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఒకరకంగా పెద్దిరెడ్డికి మింగుడు పడని విషయం. ఎందుకంటే తన బద్ద విరోధి ముఖ్యమంత్రి అయ్యాడంటే జిల్లాలో రాజకీయంగా తనకు చెక్ చెప్పేందుకు ప్రయత్నాలు చేస్తాడనే భావన కూడా ఆయనకు ఉండి ఉంటుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌లో ఉంటూ ముఖ్యమంత్రి కిరణ్‌తో కలిసి పని చేయడం కంటే విభేదించి జిల్లాలో తన క్యాడర్‌ను కాపాడుకునే ప్రయత్నంలో పెద్దిరెడ్డి పడ్డారనేది పలువురు ఉవాచ.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X