నాదెండ్ల భాస్కర రావు హల్‌చల్ ఆంతర్యం...

నాదెండ్ల భాస్కర రావు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరు. నిజానికి, ఎన్టీ రామారావు చేత పార్టీని పెట్టించింది ఆయనే. తెలుగుదేశం పార్టీలో ఆయనది రెండో స్థానం. ఆ స్థితిలో ఆయన ఎన్టీ రామారావును గద్దె దించి తాను ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆయన ముఖ్యమంత్రి పీఠం నుంచి దిగిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఓ పార్టీని స్థాపించారు గానీ దాన్ని నిలబెట్టలేకపోయారు. దాంతో ఆయన తిరిగి కాంగ్రెసులోకి వచ్చారు. మళ్లీ ఆయన పార్లమెంటు సెంట్రల్ హాల్లో కనిపించడం వెనక ఆంతర్యమేమిటనేది ఎవరికీ అంతు పట్టడం లేదు.
ఇదిలావుంటే, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ఎందుకు వెనకేసుకు వస్తున్నారని రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి ఒకరిని తెలంగాణకు చెందిన ఓ పార్లమెంటు సభ్యుడు ప్రశ్నించారు. పార్లమెంట్ సెంట్రల్ హాలులో ఎంపీల మధ్య చర్చల సందర్భంగా ఇది చోటుచేసుకుంది. తమ నియోజక వర్గంలో మరో నేతను ప్రోత్సహిస్తున్నారని, తనను కలుపుకొని పోకుండా ముఖ్యమంత్రి సమస్యలు సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు.
కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డికి, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి మధ్య జరుగుతన్న రాజకీయ సమరంలో తెలంగాణ పార్లమెంటు సభ్యులు జైపాల్ రెడ్డికి మద్దతుగా నిలిచారు. కిరణ్ కుమార్ రెడ్డిపై వారు తీవ్రంగా ధ్వజమెత్తుతున్నారు. తెలంగాణకు కిరణ్ కుమార్ రెడ్డి అన్యాయం చేస్తున్నారని వారు విమర్శిస్తున్నారు. ఇది ఎక్కడికి దారి తీస్తుందనేది ఎవరికీ అంతు పట్టడం లేదు.