
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు 'గ్యారంటీ' అప్పులభారం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నేపథ్యంలో సమైక్యాంధ్రప్రదేశ్ అప్పులను ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు పంచారు. ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చిన అప్పులను ఇరు రాష్ట్రాలకు పంపిణీ చేశారు. రెండు రాష్ట్రాలకు అప్పులు భారం కానున్నాయి. వివిధ ప్రభుత్వ సంస్థలకు ఉన్న అప్పులను రెండు రాష్ట్రాలకు పంపకాలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రధానంగా వివిధ సంస్థలు చేసిన అప్పుల్లో ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చిన అప్పులను ఇరు రాష్ట్రాలకు పంపకాలు చేశారు. తెలంగాణకు అధికంగా 17,056కోట్లు అప్పులుగా తేలగా, కొత్త ఆంధ్రప్రదేశ్‌కు 13,849 కోట్లు రుణ భారంగా మిగిలింది. వీటిని రెండు రాష్ట్రాలకు కేటాయిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.

ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి ట్రాన్స్‌కోకు 2,727 కోట్లు, డిస్కామ్స్‌కు 3,960 కోట్లు, జెన్‌కోకు 2,255 కోట్లు, ఎపి పవర్ కార్పోరేషన్‌కు 2,384 కోట్లు రుణాలు ఉన్నాయి. మిగిలిన సంస్థల్లో కూడా వందల కోట్లలోనే రుణాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి సింగరేణి కాలరీస్‌కు 199 కోట్లు, ట్రాన్స్‌కోకి 2,913 కోట్లు, డిస్కామ్స్‌కు 5,594 కోట్లు, జెన్‌కోకు 1,570 కోట్లు, ఎపి పవర్ కార్పోరేషన్‌కు 3,509 కోట్లు ప్రధాన రుణాలుగా ఉన్నాయి.
మిగిలిన శాఖల్లో కూడా పెద్దగానే రుణాలు ఉన్నాయి. వీటి భారాన్ని ఇక రెండు రాష్ట్రాలు విడివిడిగా భరించాల్సి ఉంటుంది. అలాగే రానున్న రోజుల్లో ఆయా రాష్ట్రాల్లోని సంస్థల రుణాలకు అక్కడి ప్రభుత్వాలు గ్యారంటీని కొనసాగించాల్సి ఉంటుందని చెబుతున్నారు.