• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఐఐటి తెలుగు విద్యార్ధి ఆత్మహత్య

By Staff
|

నెల్లూరు: తమ ప్రతిభా పాటవాలతో బంగారు భవిష్యత్తును సాకారం చేసుకోవాల్సిన యువతీయువకులు... లేతవయసులోనే కన్నుమూస్తున్నారు. పుస్తకాల్లోని జ్ఞానాన్ని ఔపోసన పడుతున్న ప్రతిభావంతులు... అసూయా ద్వేషాలకు బలవుతున్నారు... లేదా చిన్న ఓటమిని కూడా తట్టుకోలేకపోతున్నారు.

ఐఐటీ ఎంట్రన్స్‌లో మిగిలిన రాష్ట్రాల విద్యార్థుల కంటే... తెలుగువారే ఎక్కువగా ఎంపికవుతుండడం విదితమే. అందుకు గర్విస్తున్న తెలుగువారికి అంతలోనే... ఆ సంతోషం ఆవిరవుతోంది. తాజా గా నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం కోవెలపాలెంకు చెందిన ఓ విద్యార్ధి కాన్పూర్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. సుమంత్‌ మరణాన్ని పోలీసులు ఆత్మహత్యగా పేర్కొంటున్నా... తల్లిదండ్రులు మాత్రం తమ బిడ్డకు ఆ ఖర్మ పట్టలేదంటున్నారు.

కోవెలపాలెంకు చెందిన భాస్కరయ్య కుమారుడైన జి.సుమంత్‌ (21) కాన్పూరు ఐఐటీలో ఎమ్‌.టెక్‌ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్నాడు. శనివారం ఉదయం కాన్పూర్‌ ఐఐటీ కళాశాల నుంచి సుమంత్‌ తల్లిదండ్రులకు ఫోన్‌ వచ్చింది. సుమంత్‌ తాను ఉంటున్న హాస్టల్‌ గదిలో ఉరి వేసుకొని మృతి చెందినట్లు ఐఐటీ అధికారులు వారికి తెలిపారు. దీంతో వారు అవాక్కయ్యారు. తమ కుమారుడికి ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదని, ఎవరో అతనిని హత్య చేసి ఉంటారని సుమంత్‌ తల్లిదండ్రులు అనుమానిస్తున్నారు. విషయం తెలిసిన బంధువులు కాన్పూర్‌ బయలుదేరి వెళ్లారు.

కొద్దిరోజుల్లో ఎం.టెక్‌ పూర్తి చేసుకోనున్న సుమంత్‌... ఈ ఏడాది జరిగిన క్యాంపస్‌ ఇంటర్వ్యూలలో ఉద్యోగం సంపాదించలేకపోయాడని ఐఐటి అధికారులు విలేఖరులకు తెలిపారు. ఆ కారణంగా మానసికంగా కుంగిపోయి ఆత్మహత్య చేసుకున్నాడని ఐఐటీ-కే డైరక్టర్‌ సంజయ్‌ ధాండే అభిప్రాయపడ్డారు. పోలీసులు కూడా ఆత్మహత్యకు క్యాంపస్‌ ఇంటర్వ్యూలో ఉద్యోగరం రాకపోవడమే కారణమై ఉంటుందని భావిస్తున్నారు. సుమంత్‌ గదిలో సూసైడ్‌ నోట్‌ ఏమీ లేదని చెప్పారు.

పండుగకు వస్తానని..కాన్పూర్‌లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు వెళ్ళిన సుమంత్‌ రెండు రోజుల క్రిందట తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి సంక్రాంతి పండుగకు ఊరికి వస్తానని చెప్పాడు. అలా చెప్పిన వాడు శాశ్వతంగా దూరమయ్యాడు. జరిగిన ఘోరానికి... తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. పండుగకు బిడ్డ ఇంటికి వస్తాడని ఆశిస్తున్న వారికి కడుపుకోత మిగిలింది. సుమంత్‌ మృతితో కోవెలపాలెంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

జనవరి1న సుమంత్‌ తన గ్రామంలోని స్నేహితులకు, బంధువులకు ఫోన్లు చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపాడు. అందరితో కలిసి మెలిసి ఉంటూ ఎప్పుడూ చిరునవ్వుతో కనిపించే సుమంత్‌ ఇక లేడన్న విషయాన్ని ఆ గ్రామస్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. మృతదేహం సోమవారం కోవెలపాలెం చేరే అవకాశాలున్నాయని తెలిసింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X