విజయవాడ: దర్శక నిర్మాత రామ్ గోపాల్ వర్మపై విజయవాడకు చెందిన సాయికృష్ణ అనేది న్యాయవాది కోర్టుకెక్కారు. వర్మ బెజవాడ రౌడీలు సినిమా టైటిల్‌ను సవాల్ చేస్తూ ఆయన శుక్రవారం పిటిషన్ దాఖలు చేశారు. విజయవాడ ప్రతిష్టను దెబ్బ తీసే విధంగా సినిమా టైటిల్ ఉందని ఆరోపించారు. బెజవాడ రౌడీలు సినిమా టైటిల్‌పై మొదటి నుంచీ వివాదం చెలరేగుతూనే ఉన్నది. టైటిల్ మార్చాలని విజయవాడలో ఆందోళనలు కూడా జరిగాయి. రామ్ గోపాల్ వర్మకు హెచ్చరికలు కూడా వెళ్లాయి. అయితే ఆయన టైటిల్ మార్చడానికి ఇష్టపడకపోగా బెదిరింపులకు లొంగలేదు.
కాగా, బెజవాడ రౌడీలు రెండో షెడ్యూల్ షూటింగ్ కోసం పోలీసులు అనుమతి ఇచ్చారు. ఈ నెల 10వ తేదీ నుంచి షెడ్యూల్ ప్రారంభం కానుంది. తాము స్క్రిప్టును పరిశీలించామని, రెచ్చగొట్టే సంఘటనల చిత్రీకరణ ఏదీ లేదని విజయవాడ పోలీసు కమిషనర్ అమిత్ గార్గ్ చెప్పారు. ఓ పాట చిత్రీకరణకు తాము అనుమతి ఇచ్చినట్లు గార్గ్ తెలిపారు. ఇదిలావుంటే, బెజవాడ రౌడీలు సినిమా యూనిట్ కృష్ణానదిలో ప్రత్యేక పూజలు నిర్వహించింది. కృష్ణమ్మకు, దుర్గా దేవికి ఉన్న సంబంధాన్ని దృష్టిలో ఉంచుకుని సినిమా షూటింగ్‌కు ఆటంకం కలగకూడదని పూజలు నిర్వహించినట్లు చెబుతున్నారు.