హైదరాబాద్: ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ ఎట్టకేలకు తన తప్పులు ఒప్పుకున్నారు. బుధవారం సిఐడి పోలీసుల ముందు తన నేరాల చిట్టాను విప్పాడు. తనకు మద్దెలచెర్వు సూరితో రాంగోపాల్ వర్మ తీసిన రక్తచరిత్ర సినిమా నుండి పరిచయం అయిందని సి.కళ్యాణ్ ఒప్పుకున్నారు. అయితే సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భానుకిరణ్‌తో 2001 నుండి సంబంధాలు ఉన్నాయని చెప్పారు. నాటి నుండి ప్రతి ల్యాండ్ డీలింగులో సెటిల్మెంట్ చేసేవారమని చెప్పారు. తమకు అప్పులిచ్చిన వారికి ఎగ్గొట్టే వారిమని చెప్పారు. తాము ఎగ్గొట్టిన వారు ఎవరైనా తమను డబ్బులు అడిగితే భానుతో కలిసి బెదిరించే వారమని చెప్పాడు. భానుతో కలిసి శింగనమల రమేష్, తాను బెదిరింపులకు పాల్పడే వారమని చెప్పారు.
కాగా గత కొన్నాళ్లుగా సి.కళ్యాణ్ తనకు భానుకు ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల కళ్యాణ్ సిఐడి పోలీసుల ముందు తప్పు ఒప్పుకున్నట్లు బయటకు వచ్చినప్పటికీ ఆ తర్వాత నాంపల్లి పోలీసు స్టేషన్‌కు విచారణకు వచ్చిన సమయంలో తాను ఎలాంటి తప్పులు చేయలేదని తాను తప్పు ఒప్పుకున్నట్లు వచ్చిన వార్తలలో నిజం లేదని చెప్పారు.