చంద్రబాబు, లోకేష్ కు అంబటి రాంబాబు శుభాకాంక్షలు..! రీజన్ ఇదే..!
ఏపీలో ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో అధికార కూటమిలో భాగస్వాములైన టీడీపీ, జనసేన, బీజేపీతో విపక్ష వైఎస్సార్సీపీ హోరాహోరీగా పోరాడుతోంది. ఇలాంటి సమయంలో సెటైర్లకు పెట్టింది పేరైన వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) ఇవాళ ఓ ట్వీట్ చేశారు. ఇందులో ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు ఆయన తనయుడు, మంత్రి నారా లోకేష్ కు శుభాకాంక్షలు తెలిపారు. అయితే దీని వెనుక ఓ కారణం ఉంది.
రాష్ట్రంలో కిలో బియ్యం 100 రూపాయలకు చేరువవుతున్న సందర్భంగా చంద్రబాబు నాయుడు గారెకి, లోకేష్ గారికి శుభాకాంక్షలు ! అంటూ అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. రాష్ట్రంలో గత కొన్ని నెలలుగా బియ్యం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. బియ్యం ఒక్కటే కాదు నిత్యావసరాల ధరలు కూడా మండిపోతున్నాయి. అయినా వీటిని నియంత్రించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదు. దీంతో సామాన్యులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా బియ్యం ధరలు కిలో 100 రూపాయలకు చేరువలో ఉన్నాయి. దీనిపై ఇప్పటికే విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగిన చర్యలు తీసుకోవడం లేదు.

ఓవైపు ఎల్ నినో ప్రభావం పేరు చెప్పి వ్యాపారాలు విచ్చలవిడిగా రేట్లు పెంచేసి దోచుకుంటున్నారు. ఈ ఏడాది ఎల్ నినో తో ఇప్పటికిప్పుడు బియ్యం రేట్లు పెరగవని తెలిసి కూడా ప్రభుత్వం వీరిపై చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో గతంతో పోలిస్తే బియ్యం రేట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇందులో అన్ని రకాల బియ్యం ఉన్నాయి. ఈ నేపథ్యంలో అంబటి రాంబాబు ప్రభుత్వ పెద్దలైన చంద్రబాబు, నారా లోకేష్ ను ఉద్దేశించి ఈ ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న వేళ పెరుగుతున్న బియ్యం రేట్లను ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై వైఎస్సార్సీపీ ఇప్పటికే చేస్తున్న విమర్శలకు కొనసాగింపుగానే అంబటి రాంబాబు ఈ ట్వీట్ చేసినట్లు అర్దమవుతోంది.














Click it and Unblock the Notifications
