AP Rain Alert: ఏపీకి భారీ వర్ష సూచన- ఈ జిల్లాల్లో నాలుగు రోజుల పాటు ..!
ఎల్ నినో ప్రభావంతో నైరుతి రుతుపవనాల కాలం అంతా కరిగిపోవడంతో వర్షాలు లేక ఇబ్బందులు పడుతున్న ప్రజలు, రైతులకు వాతావరణ విభాగం ఇవాళ గుడ్ న్యూస్ చెప్పింది. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో రానున్న నాలుగు రోజులు చెదురుమదురుగా భారీ వర్షాలు (AP Rain Alert) కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. రేపు శుక్రవారం మేఘావృతమైన వాతావరణంతో పాటు పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.
రేపు విజయనగరం, మన్యం, అల్లూరి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం తెలిపింది. అలాగే శ్రీకాకుళం, పోలవరం, విశాఖ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, శ్రీసత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే శనివారం అల్లూరి, కృష్ణా, బాపట్ల, నెల్లూరు, కడప, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు ఉంటాయని, మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎస్డీఎంఏ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.

ఇవాళ కూడా రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు కురిశాయి. ఇవాళ సాయంత్రం 5 గంటల నాటికి తిరుపతి జిల్లా అలివేలు మంగాపురంలో 87.5 మిమీ, నెల్లూరు జిల్లా దగదర్తిలో 57.2 మిమీ, కావలిలో 53.3 మిమీ, చిత్తూరు అర్బన్ లో 51.5 మిమీ, తిరుపతి జిల్లా ఓబులవారిపల్లెలో 50.4 మిమీ, పెన్నేపల్లిలో 45.7 మిమీ, రేణిగుంటలో 41.2 మిమీ, పుత్తూరులో 40.5 మిమీ, నాయుడుపేటలో 38.4మిమీ చొప్పున వర్షపాతం నమోదైంది. ఈ వర్షాలు నాలుగు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేస్తోంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. చెట్ల క్రింద, భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడవద్దని హెచ్చరిస్తోంది.












Click it and Unblock the Notifications
