ఏపీలో స్థానిక ఎన్నికలపై SEC కీలక నిర్ణయం- రంగంలోకి 28 మంది ఐఏఎస్ లు..!
ఏపీలో త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా (AP SEC) ఇవాళ సాధారణ పరిశీలకులకు నియమించారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు జిల్లాకు ఒక అధికారి చొప్పున 28 మంది మంది ఐఏఎస్ అధికారులను సాధారణ పరిశీలకులుగా నియమిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే వారితో భేటీ అయిన ఎస్ఈసీ.. ఎన్నికల నిర్వహణకు సంబంధించి పలు సూచనలు చేశారు.
ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచే రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పునేఠా తెలిపారు. సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో అనుసరించే విధానాలను స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పాటించాలని, రాజకీయ ప్రతినిధులు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించకుండా పరిశీలకులు నిరంతరం పర్యవేక్షించాలని పరిశీలకులకు సూచించారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించే ఘటనలపై అప్రమత్తంగా ఉంటూ, నిబంధనల అమలుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

అలాగే ఎన్నికల నిర్వహణను మరింత సులభతరం చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం పోల్ మేనేజ్మెంట్ యాప్ను రూపొందించిందని ఎస్ఈసీ తెలిపారు. ఈ యాప్ ద్వారా ఓటర్ల నిర్వహణ, పోలింగ్ కేంద్రాల వివరాలు, ఎన్నికల నిర్వహణ విధానాలు వంటి సమాచారాన్ని అందుబాటులో ఉంచామన్నారు. ఎన్నికల నిర్వహణలో సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలని పరిశీలకులకు సూచించారు. ఎన్నికల సమయంలో శాంతిభద్రతల పరిరక్షణకు జిల్లా పోలీసు యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నుంచి ఓటు హక్కును వినియోగించుకునే సామాన్య పౌరుల వరకు అందరికీ భద్రత కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి ఓటరు ఎలాంటి ఒత్తిళ్లు, ప్రలోభాలకు గురికాకుండా స్వేచ్ఛగా తన ఓటు హక్కును వినియోగించుకునే వాతావరణాన్ని కల్పించాలని వారికి సూచించారు. ఈ లక్ష్య సాధనలో జిల్లా స్థాయి నుంచి జోనల్ స్థాయి వరకు ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులకు తగిన మార్గదర్శకత్వం అందించడం, ఎన్నికల ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించడం సాధారణ పరిశీలకుల బాధ్యత అని అనిల్ చంద్ర పునేఠా స్పష్టం చేశారు.














Click it and Unblock the Notifications
