పోలీసులు, ఎన్నికల సంఘంపై చండ్ర నిప్పులు .. అర్ధరాత్రి ప్రజాస్వామ్యం ఖూనీ అయిందన్న చంద్రబాబు
పంచాయతీ ఎన్నికలలో అధికార పార్టీ నాయకులు , వారికి వత్తాసు పలుకుతున్న కొందరు అధికారులు, పోలీసులు కలిసి అర్ధరాత్రి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు . పంచాయతీ ఎన్నికలలో ఉన్మాదులు, రౌడీలు. సంఘ విద్రోహ శక్తులు స్వైరవిహారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎన్నికలలో అక్రమాలపై కొరడా ఝుళిపించవలసిన రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ టిడిపి ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని పేర్కొంటూ చంద్రబాబు ధ్వజమెత్తారు.

అర్ధరాత్రి విద్యుత్ సరఫరా నిలిపివేసి, ఫలితాలను తారుమారు చేశారని ఆరోపణ
కొన్నిచోట్ల కావాలని ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఆలస్యం చేశారని, అర్ధరాత్రి అయ్యే సరికి విద్యుత్ సరఫరా నిలిపివేసి, ఫలితాలను తారుమారు చేసి వైసీపీ మద్దతుదారులు గెలిచినట్టు ప్రకటించుకున్నారు అని చంద్రబాబు ఆరోపించారు. అర్ధరాత్రి సమయంలో ఓట్ల లెక్కింపు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ? మరుసటి రోజు ఓట్ల లెక్కింపు జరిగేలా ఎన్నికల సంఘం ఎందుకు చర్యలు తీసుకోలేదు ? అని ప్రశ్నించిన చంద్రబాబు, మెజారిటీ 10లోపు వచ్చిన చోట మళ్లీ లెక్కించాలనే ఎన్నికల సంఘం నిబంధనను ఎందుకు పాటించలేదని ప్రశ్నించారు.

స్వయంగా డీజీపీనే వైసీపీ కోసం రంగంలోకి
ఓట్ల లెక్కింపు ప్రక్రియను సీసీటీవీ వీడియో కెమెరాలో రికార్డు చేయాలన్న ఆదేశాలను ఎందుకు పాటించలేదు? అని ప్రశ్నించారు . చంద్రబాబు టిడిపి మద్దతుదారులు గెలిచినప్పటికీ పోలీసులు వారిని బెదిరించి భయపెట్టి ఓడిపోయినట్టు అంగీకరించమని ఒత్తిడి తీసుకువచ్చారు అని ఆరోపించారు . స్వయంగా డిజిపినే డీఎస్పీల తో మాట్లాడి వైసీపీ మద్దతుదారులు గెలిచినట్లుగా ప్రకటించమని చెప్పారని చంద్రబాబు ఆరోపించారు. అసలు పోలింగ్ కేంద్రాలలో పోలీసులకు పనేంటి అని చంద్రబాబు మండిపడ్డారు.

ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు కంఠశోషే
మూడో విడత పంచాయతీ ఎన్నికలలో పొత్తుతో పోటీ చేసిన వాటితో కలిపి ఒక 1093 చోట్ల టిడిపి మద్దతుదారులు గెలుపొందారు అని వెల్లడించిన చంద్రబాబు మొదటి విడతలో 38.74 శాతం రెండో విడతలో 39.52 శాతం మూడో విడతలో 41. 41 శాతం పంచాయతీలను టిడిపి గెలుచుకుంది అని చంద్రబాబు పేర్కొన్నారు.
ఎన్నికల సంఘానికి ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని, సాక్ష్యాధారాలతో ఫిర్యాదు చేసిన కంఠశోష గానే మిగులుతుందని చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు.

ఎన్నికల సంఘం నిర్లక్ష్యం .. పోలీసుల అత్యుత్సాహంపై చంద్రబాబు ధ్వజం
పోలింగ్ కేంద్రాల్లో ఇతరులు రాకూడదని, ఓట్ల లెక్కింపు సందర్భంగా ట్రెండ్ ప్రకటించకూడదని ఆదేశాలు ఉన్నప్పటికీ ఆ నిబంధనలు ఏవీ అమలు కావడం లేదని చంద్రబాబు ఆరోపించారు. పంచాయతీ ఎన్నికల్లో టిడిపి మద్దతుదారులను వైసీపీ నేతలు బెదిరింపులకు పాల్పడి ఇబ్బందులు పెడుతున్నా ఎన్నికల సంఘం చూస్తూ ఊరుకుంటుందని అసహనం వ్యక్తం చేసిన చంద్రబాబు అర్ధరాత్రి ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ నిలిపివేసి మరీ ఫలితాలను తారుమారు చేశారని విమర్శలు గుప్పించారు.