ఉగాధి నుంచి కొత్త జిల్లాల పాలన: ప్రస్తుత కలెక్టర్లు, ఎస్పీలే కొత్త జిల్లాలకు ! : మరి జిల్లా పరిషత్‌ల విభజనలో
ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లో పాలనకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఉగాది నుంచి పాలన ప్రారంభించాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత అధికార యంత్రాంగం సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. ఎలాంటి ఆయోమయానికి తావు ఉండకూదన్నారు. కొత్త జిల్లాల్లో పాలన ఏర్పాట్లను వేగంగా... సమర్థవంతంగా మొదలుపెట్టాలని జగన్ ఆదేశించారు.

ప్రస్తుత కలెక్టర్లు, ఎస్పీలే కొత్త జిల్లాలకు ..
కొత్త జిల్లాల ఏర్పాటు, అధికారుల విధులు తదితర అంశాలపై సంబంధిత మంత్రులు, అదికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఉగాది నుంచే కొత్త జిల్లాల్లో కలెక్టర్లు, ఎస్పీలు విధులు నిర్వహించాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడున్న జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలనే కొత్త జిల్లాలకు పంపాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశించారు. వీరికున్న అనుభవం కొత్త జిల్లాలకు ఉపయోగపడుతుందన్నారు. పరిపాలన సాఫీగా సాగడానికి ఎంతో దోహదం చేస్తుందని అభిప్రాయపడ్డారు.

ఉద్యోగుల విభజన, మౌలిక సదుపాయాలు..
జిల్లాల్లో ఉద్యోగుల విభజన, మౌలిక సదుపాయాల ఏర్పాటు, అవసరమైన భవనాల సిద్ధం చేయాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశించారు. కొత్త భవనాల నిర్మాణంపై ప్రణాళికలు ఖరారు చేయాలని సూచించారు. ఎక్కడైనా అభ్యంతరాలు ఉన్నప్పుడు వాటిపై నిశిత పరిశీలన చేయాలన్నారు. నిర్ణయం తీసుకునే ముందు వారితో మాట్లాడాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు కొత్త జిల్లాల్లో మౌలికసదుపాయాలు, పాలన సాఫీగా సాగేందుకు వీలుగా సన్నాహకాలను పరిశీలించాలని సీఎం జగన్ ఆదేశించారు.

జిల్లా పరిషత్‌ల విభజనలో.
..
ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల ఏర్పాటుపై ఆయా ప్రాంతాల నుంచి వస్తున్న అభ్యంతరాలు, ప్రజల నుంచి, రాజకీయ నేతల నుంచి వచ్చిన సలహాలు, సూచనలపై కూడా ఈ సమావేశంలో చర్చించారు. కొత్త జిల్లాల మ్యాపులు, జిల్లా కేంద్రాల ఏర్పాటు నిర్ణయం వెనుక తీసుకున్న ప్రాధాన్యతను అంశాల వారిగా అధికారులు సీఎం జగన్ కు వివరించారు. అటు జిల్లా పరిషత్ ల విభజనలో కూడా అనుసరించాల్సిన విధానాలను చట్టపరంగా, న్యాయపరంగా పరిశీలించి ప్రతిపాదనలు సిద్ధం చేస్తామని ముఖ్యమంత్రికి అధికారులు తెలిపారు.

కొత్త జిల్లాల ఏర్పాటుపై నిరసనలు, ఆందోళనలు
ఏపీలో ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను 26 జిల్లాలుగా ఏర్పాటు చేస్తూ జనవరి 25న ప్రభుత్వం నోటిఫికేసన్ జారీ చేసింది. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే కొత్త జిల్లాల ఏర్పాటుపై పలు చోట్ల నిరసనలు, ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. రాజంపేట జిల్లాలకు రాయచోటిని జిల్లా కేంద్రంగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనిపై అన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. రాజంపేటను జిల్లా కేంద్రంగా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.

హిందూపురం విషయంలో..
.
అటు పుట్టపర్తిని జిల్లా కేంద్రంగా ప్రకటించడంతో హిందూపురంలో ఆందోళనలు, నిరసనలు చోటుచేసుకున్నాయి. హిందూపురంను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని పెద్ద ఎత్తును రాజకీయ పార్టీలు ఉద్యమిస్తున్నాయి. స్వయంగా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ రంగంలోకి దిగి నిరసన కూడా తెలిపారు. హిందూపురం జిల్లా కేంద్రం ఏర్పాటు చేసేవరకు పోరాటం కొనసాగతుందని హెచ్చరించారు. అటు రెవెన్యూ డివిజన్‌ల మార్పుపై కూడా జిల్లాల్లో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నారు.. మరి వీటన్నింటిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోనుందో వేచి చూడాలి..