చంద్రబాబు చెంతకు గద్దె పంచాయితీ : అధికారులకు సీఎం వార్నింగ్

Subscribe to Oneindia Telugu

విజయవాడ : పేరుకే అధికార పార్టీ ఎమ్మెల్యే అయినా.. అధికారులు మాత్రం తమ మాటను లెక్క చేయట్లేదన్న అసంతృప్తిలో ఉన్నారట విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. స్వయంగా కల్పించుకుని మరీ.. అధికారుల వెంటబడ్డ ఆయన మాటను మాత్రం అధికారులు పెడ చెవినే పెడుతున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి.

మొన్నటికి మొన్న రేషన్ షాపుల కేటాయింపులో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కొన్ని పేర్లను సిఫారసు చేయగా, కేటాయింపుల విషయంలో అధికారులు అసలు ఆ పేర్లనే పరిగణలోకి తీసుకోలేదన్న ఆరోపణలున్నాయి. దీంతో అధికారుల తీరుపై అసహనంతో ఉన్న గద్దె రామ్మోహన్, ఇన్‌ఛార్జ్‌ మంత్రి పత్తిపాటి పుల్లారావుకు ఫిర్యాదు చేశారు. అక్కడితో వివాదం సీఎం చంద్రబాబు దృష్టి దాకా వెళ్లడంతో, అధికారుల తీరుపై మండిపడ్డ చంద్రబాబు కేటాయింపులపై 'స్టే' ఇవ్వాల్సిందిగా ఆదేశించారు.

ఇక తాజా వ్యవహారం ఇళ్ల కూల్చివేతకు సంబంధించినది. కృష్ణా పుష్కారాల సుందరీకరణ పనులకు అడ్డు వస్తున్నాయన్న కారణంగా విజయవాడ మునిసిపల్ అధికారులు స్థానిక ఇళ్లను కూల్చివేయడానికి సిద్దమయ్యారు. స్థానిక ఎమ్యెల్యే గద్దె రామ్మోహన్ కు ఎలాంటి సమాచారం అందించకుండా.. కనీసం ముందస్తు నోటీసులు కూడా ఇవ్వకుండా తెల్లవారు జామునే ఇళ్ల కూల్చివేతకు రంగంలోకి దిగారు అధికారులు.

Gadde Rammohan complaints on vijayawada municipal official

పరిస్థితిపై తీవ్ర ఆందోళన చెందిన స్థానికులు ఎమ్మెల్యే గద్దెకు సమాచారం అందించారు. దీంతో నేరుగా కల్పించుకున్న గద్దె రామ్మోహన్ అక్కడకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అధికారుల ఆదేశం మేరకే కూల్చివేతకు వచ్చామని మునిసిపల్ సిబ్బంది చెప్పడంతో బెజవాడ మునిపిసల్ కార్పొరేషన్ కమిషనర్ వీరపాండ్యన్ కు ఫోన్ చేశారు గద్దె.

అయితే ఇందులో తన ప్రమేయం ఏమి లేదని కమిషనర్ చేతులెత్తేయడంతో, వెంటనే మరో సంబంధిత అధికారికి ఫోన్ చేశారు గద్దె. అయినా లాభం లేకపోయే సరికి, చివరికి సీఎంవో అధికారికే ఫోన్ చేసి విషయంపై గట్టిగా నిలదీశారు. సమాచారం ఇవ్వకుండా, ప్రత్యామ్నాయ ఏర్పాట్లేవి లేకుండా ఇళ్ల కూల్చివేతకు పాల్పడడం ఏంటని గద్దె సదరు అధికారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.

కాగా, సదరు అధికారి ఉన్నతాధికారుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లడంతో.. కూల్చివేతల పర్వానికి బ్రేక్ పడింది. ఈ మొత్తం వ్యవహారంలో అధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న గద్దె విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. ఎన్టీఆర్ హయాంలో పట్టాలు ఇచ్చిన ఇళ్లనే అధికారులు కూల్చివేస్తే.. జనంలో ప్రభుత్వంపై తప్పుడు అభిప్రాయం ఏర్పడే అవకాశముందని గద్దె చంద్రబాబుతో వివరించినట్టు సమాచారం.

గద్దె ఫిర్యాదుతో అధికారులను నిలదీసిన సీఎం చంద్రబాబు, స్థానిక ఎమ్మెల్యేకు సమాచారమివ్వకుండా కూల్చివేతకు ఎలా వెళుతారని అధికారులను ప్రశ్నించారట. మరోసారి ఇలాంటి ఫిర్యాదులు రావద్దంటూ అధికారులకు చంద్రబాబు గట్టి వార్నింగే ఇచ్చారన్న చర్చ జరుగుతోంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Vijayawada MLA Gadde Rammohan complainted to CM Chandrababu naidu on vijayawada municipal official. After his complaint chandrababu warned officials

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X