రాజకీయాల్లోకి మంచు లక్ష్మి!?: టికెట్ కోసం జగన్‌తో మోహన్ బాబు మంతనాలు..

Subscribe to Oneindia Telugu

విజయవాడ: సినిమాల్లో ఓ మోస్తరు పేరు సంపాదించగానే చాలామందికి రాజకీయాల వైపు గాలి మళ్లుతుంది. కాస్త పలుకుబడి కలిగి ఉన్న బ్యాక్ గ్రౌండ్ ఉన్నవారైతే పొలిటికల్ ఎంట్రీ అంత కష్టమేమి కాకపోవచ్చు. ఎటొచ్చి జనంలోకి వారు ఎంతగా చొచ్చుకుపోగలరు? రాజకీయాల్లో ఎంతవరకు రాణించగలరన్నదే ప్రశ్న.

ఇదే తరహాలో తాజాగా ప్రముఖ నటి మంచు లక్ష్మి చూపు ప్రస్తుతం రాజకీయాలపై పడినట్లు తెలుస్తోంది. ఈ మేరకు మంచు లక్ష్మి తండ్రి, ప్రముఖ నటుడు మోహన్ బాబు ఆమెకు ఎమ్మెల్యే టికెట్ ఇప్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నారన్న వార్తలు షికారు చేస్తున్నాయి. వైసీపీ తరుపున మంచు లక్ష్మిని రాజకీయాల్లోకి దించాలని యోచిస్తున్న మోహన్ బాబు.. దీనికి సంబంధించి జగన్‌తో సంప్రదింపులు జరిపినట్లు చెబుతున్నారు.

జగన్‌తో మంతనాలు:

జగన్‌తో మంతనాలు:

వైసీపీ తరుపున తన కుమార్తెకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని మోహన్ బాబు జగన్ ను కోరినట్లు తెలుస్తోంది. మోహన్ బాబు పెద్ద కుమారుడు విష్ణు భార్య, జగన్ కు చాలా దగ్గరి బంధువు కావడంతో.. అదే చనువుతో ఎమ్మెల్యే టికెట్ రాయబారం నడుపుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై జగన్ మాత్రం మోహన్ బాబుకు ఎటువంటి హామి ఇవ్వలేదట. ఆలోచించుకుని చెబుతానని, తనకు కాస్త సమయం కావాలని జగన్ అభిప్రాయపడినట్లు సమాచారం.

టికెట్ ఎక్కడినుంచి?

టికెట్ ఎక్కడినుంచి?

ఇదిలా ఉంటే, ఒకవేళ మంచులక్ష్మి గనుక వైసీపీ తరుపున పోటీ చేస్తే.. ఎక్కడి నుంచి పోటీకి దిగుతుందన్నది ఆసక్తికరం. అయితే ఈ విషయంలోను ఫుల్ క్లారిటీతో ఉన్నారట మోహన్ బాబు. లక్ష్మికి చిత్తూరు జిల్లా చంద్రగిరి నుంచి లేదా శ్రీకాకుళహస్తి నుంచి టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరారట.

ఆ స్థానాల్లో కష్టమే!:

ఆ స్థానాల్లో కష్టమే!:

కాగా, మోహన్ బాబు కోరిన ఈ రెండు స్థానాల్లోను జగన్ సన్నిహితులే ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి.. ఒకవేళ మంచు లక్ష్మికి టికెట్ కేటాయించినా ఆ స్థానాల్లో టికెట్ ఇవ్వడం కష్టమనే చెప్పాలి. అందుకే జగన్ ఏ మాట చెప్పకుండా సమయం కావాలని చెప్పి తప్పించుకున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు.

వాళ్లను కాదని టికెట్ ఇవ్వడమా?

వాళ్లను కాదని టికెట్ ఇవ్వడమా?

ప్రస్తుతం చంద్రగిరి నియోజకవర్గంలో వైసీపీ తరుపున చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జగన్ కు సన్నిహితుడైన ఆయన పార్టీలోను కీలక నేతగాను ఉన్నారు. ఇక శ్రీకాళహస్తి నుంచి వైసీపీ తరుపున పోటీ చేసి ఓడిపోయిన బియ్యపు మధుసూదన్ రెడ్డి కూడా జగన్ కు సన్నిహితుడే. కాబట్టి అనుభవంతో పాటు తొలి నుంచి పార్టీని నమ్ముకుని ఉన్నవారిని కాదని మంచులక్ష్మికి టికెట్ ఇవ్వడం అనుమానమే!.

మోహన్ బాబు కూడా ప్రయత్నిస్తున్నారా?:

మోహన్ బాబు కూడా ప్రయత్నిస్తున్నారా?:

ఒకప్పుడు రాజ్యసభ సభ్యుడిగా పదవిని చేపట్టిన మోహన్ బాబు.. చాలాకాలంగా రాజకీయాల్లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే గత సంక్రాంతి నాడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడితో ఆయన భేటీ అవడం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది.

టీడీపీ నుంచి ఆయన పోటీ చేయడానికి మోహన్ బాబు సిద్దమవుతున్నారన్న ఊహాగానాలు వినిపించాయి. తిరుపతి, చిత్తూరు రిజర్వ్ స్థానాలు కాబట్టి రాజంపేట నుంచి ఆయన బరిలో నిలుస్తారన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే ఆ తర్వాత దాని ఊసే లేకపోగా.. మళ్లీ ఇన్నాళ్లకు ఆయన రాజకీయ ప్రయత్నాలు మొదలుపెట్టినట్లుగా చెప్పుకుంటున్నారు.

మోహన్ బాబు చేరిక వైసీపీ లాభిస్తుందా?

మోహన్ బాబు చేరిక వైసీపీ లాభిస్తుందా?

భవిష్యత్తులో మోహన్ బాబు జగన్ తో చేతులు కలిపినా.. వైసీపీకి అది ఎంతమేర లాభిస్తుందన్నది అంచనా వేయడం కష్టమే. వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ సైతం బరిలో ఉండటం.. పవన్- మోహన్ బాబుకు ప్రత్యర్థులన్న ముద్ర ఉండటం వైసీపీపై ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది.

ఒకవేళ వైసీపీలో మోహన్ బాబు చేరిక గనుక ఖాయమైతే.. ఆయన రాజ్యసభ సీటు కోరే అవకాశముందని పరిశీలకులు చెబుతున్నారు. కుమార్తె మంచు లక్ష్మికి ఎమ్మెల్యే టికెట్ కోరుతుండటంతో.. తాను ప్రత్యక్ష రాజకీయాల కన్నా పరోక్ష రాజకీయాల్లో ఉండటానికే మోహన్ బాబు మొగ్గుచూపే అవకాశం ఉంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Tollywood actor Mohanbabu approached YSRCP President Jagan for seeking MLA ticket for his daughter Manchu Lakshmi
Please Wait while comments are loading...