వంగవీటి రాధా టిడిపి లోకి వెళతారా?...అయితే...వైసీపీకి విజ‌యవాడ‌లో దెబ్బేనా?

Posted By: Suvarnaraju
Subscribe to Oneindia Telugu

విజయవాడ: ప్రస్తుతం ఎపిలో పరిణామాలను బట్టి చూస్తే వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో కుల రాజ‌కీయాలు చరిత్రలో ఎన్నడూ లేనంతగా కీల‌క పాత్ర పోషించడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కాపు సామాజిక వ‌ర్గం ఓట్ల కోసం అధికార టీడీపీ, ప్రతి ప‌క్ష వైసీపీ పడరాని పాట్లు పడుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్ లో అధికారం చేపట్టాలంటే కాపు సామాజిక‌వ‌ర్గం ఓట్లు కీలకమనే విషయం రాజకీయాల గురించి ఏమాత్రం అవగాహన ఉన్నవారైనా వెంటనే అర్థం చేసుకోగలుగుతారు. అందుకే కాపు వర్గాలను ప్ర‌స‌న్నం చేసుకునేందుకు ప్రధాన పార్టీలన్నీ విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. కార‌ణాలేమైనా కావచ్చు...కానీ...మొత్తానికి కాపుల‌కు రిజ‌ర్వేష‌న్ కల్పిస్తూ ఏపీ సీఎం చంద్ర‌బాబు ఒకరకంగా సాహ‌సోపేతమనదగ్గ నిర్ణ‌య‌మే తీసుకున్నారు. రాజకీయాల్లో అత్యంత అనుభవజ్ఞుడైన చంద్రబాబు ఓటు బ్యాంకు రాజకీయాలను అంచనా వేయడంలో కూడా సిద్దహస్తుడు. కాబట్టే అనేక కోణాల్లో ఆలోచించిన ఆయన విజ‌య‌వాడ‌లో కాపు సామాజిక‌వ‌ర్గానికి కీల‌కంగా ఉన్న మ‌రో ముఖ్య నాయ‌కుడు, వైసీపీ నేత వంగ‌వీటి రాధను సైకిలెక్కించేందుకు పావులు క‌దుపుతున్నారని, ఆ దిశలో సానుకూల స్పందన రాబట్టుకోగలరని అంటున్నారు.

వంగవీటి రాధా...పార్టీ మారతారా?...

వంగవీటి రాధా...పార్టీ మారతారా?...

విజయవాడ కాపు నేత...ప్రముఖ దివంగత కాపు నాయకుడు వంగవీటి రంగా కుమారుడు వంగవీటి రాధా టిడిపిలో చేరతారా?...అంటే చేరొచ్చనే సమాధానం వస్తోంది. వైసీపీలో ఆయ‌న‌కు స‌రైన ప్రాధాన్యం ద‌క్క‌క‌పోవ‌డం, పార్టీలోని నేత‌ల మ‌ధ్య విభేదాల నేప‌థ్యంలో... వంగవీటి రాధా పార్టీ మారడంపై ఆయ‌న తీవ్రంగా స‌మాలోచ‌న‌లు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది.

టిడిపిలోకి...రాధాను రప్పించుకోవాలనే...

టిడిపిలోకి...రాధాను రప్పించుకోవాలనే...

గతంలో అయితే వంగవీటి రాధాను టిడిపిలోకి తెచ్చుకోవాలననే విషయంపై ఆ పార్టీ అంతగా దృష్టి సారించినట్లు కనపడదు. అయితే ఇటీవల రాష్ట్రంలో చోటుచేసుకున్న కొన్ని పరిణామాల నేపథ్యంలో వంగవీటి రాధా తమ పార్టీలోకి వస్తే మంచిదనే ఆలోచన చంద్రబాబు చేసినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో...కుల సమీకరణాలు జోరందుకుంటున్న తరుణంలో...వంగవీటి రంగా హత్యోదంతం విషయంలో తమ పార్టీపై కొందరు వేలెత్తిచూపుతున్న నేపథ్యంలో...మళ్లీ వంగవీటి రంగా నామస్మరణ క్రమంగా జోరందుకుంటున్న సమయంలో...వీటన్నింటిని బట్టి వంగవీటి రాధాను సైకిలెక్కించాలని చంద్రబాబు ఆలోచించడమే కాదు ఇప్పటికే ఆ బాధ్యతను కొందరు పార్టీ ముఖ్యులకు అప్పగించేశారట.

 అదే జరిగితే...వైసిపికి దెబ్బేనా?

అదే జరిగితే...వైసిపికి దెబ్బేనా?

వంగవీటి రాధా వైసీపీని వీడి టిడిపిలోకి వెళితే కోస్తా ప్రాంతంలో ఎంత దెబ్బో ఖచ్చితంగా చెప్పలేకపోయినా పెద్ద దెబ్బే తగలొచ్చని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా కాపు సామాజికవ‌ర్గానికి చెందిన వంగ‌వీటి రాధ కొద్ది కాలం నుంచి పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉండ‌టంపై ర‌క‌ర‌కాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఏపీలో కాపుల‌కు ప్ర‌త్యేక ప్ర‌తిప‌త్తి కావాల‌ని ఉద్య‌మించిన వారిలో వంగవీటి రంగా పేరు ముందు వరుస‌లో ఉంటుంది. ఇప్ప‌టికీ కాపుల్లో ఆయ‌నపై ప్ర‌త్యేక అభిమానం ఉంది. ప్ర‌స్తుతం ఏపీ రాజ‌కీయాల‌కు కీల‌కంగా మారిన విజ‌య‌వాడ‌లో ఆయ‌న పేరు చిర‌స్థాయిగా నిలిచిపోయింది. ఆయ‌న మ‌ర‌ణించి దాదాపు మూడు ద‌శాబ్దాలైనా కాపు సామాజిక వ‌ర్గంలో ఆయ‌న ఇంకా గుర్తుండిపోయారు. ఆయన కుమారుడిగా వంగవీటి రాధా మీద ఆ సెంటిమెంట్ ఉంటుంది.

 వీటన్నింటిని బట్టి...రాధా చేరిక

వీటన్నింటిని బట్టి...రాధా చేరిక

రంగా వార‌సుడిగానే వంగ‌వీటి రాధా కూడా రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ నుంచి, అంత‌కుముందు పీఆర్పీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే 2004లో మాత్రం ఎమ్మెల్యేగా గెలిచారు. ప్ర‌స్తుతం ఆయ‌న వైసీపీలో ఉన్నప్పటికి క్రియాశీలకంగా లేరనే చెప్పుకోవచ్చు. వైసిపి న‌గ‌ర పార్టీ బాధ్య‌త‌ల నుంచి ఆయ‌న్ని త‌ప్పించిన త‌రువాత మ‌రింత ఆవేదన చెందారని అంటున్నారు. పైగా వైసీపీలో ఈ మ‌ధ్య కాలంలో కొంత‌మంది నేత‌లు చేర‌డం, వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆ పార్టీ త‌ర‌ఫున రాధ‌కు ఎక్క‌డ అవ‌కాశం ఇస్తారో స్ప‌ష్ట‌త ఇవ్వ‌క‌పోవ‌డం రాధలో తీవ్ర అసంతృప్తికి కారణమైందట. ఫైన చెప్పినట్లు వివిధ పరిణామాల కారణంగా రాధా అసంతృప్తిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు టీడీపీ ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు తెలుస్తోంది. టీడీపీ కాపు సామాజికవర్గానికి ఎంత ప్రాధాన్యత ఇస్తుందనే అంశాల్లో ఈ విషయాన్ని కూడా చేర్చాలనేది చంద్ర‌బాబు ఆలోచనట. అయితే అతి త్వరలోనే ఈ విషయమై సంచలనం చోటుచేసుకోనుందంటున్నారు స్థానిక రాజకీయ పరిశీలకులు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Is Chandrababu Naidu made a master plan?... Knowing that YCP is not focusing on Vangaveeti Ranga and Radha also. For that he gave the work to higher officials to impress Radha. He made analysis of Radha joining tdp, and taking feedback from his people. If this workout it becomes sensation in Coastal Andhra kapu politics.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి