జగన్ మొత్తం ఆస్తులజప్తు ఎప్పుడు: సిబిఐకి యనమల

తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి అధికారాన్ని అడ్డు పెట్టుకొని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమంగా రూ.43 వేల కోట్లు సంపాదించినట్టు అఫిడవిట్‌లో సిబిఐ పేర్కొందన్నారు. జగన్ అక్రమ సంపాదనలో ఎన్‌పోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి) ఇప్పటి వరకు రూ.11 వందల కోట్లు మాత్రమే జప్తు చేసిందని, మిగిలిన వాటిని ఎప్పుడు జప్తు చేస్తారన్నారు.
లక్ష కోట్ల రూపాయల ఆస్తులను జగన్ కూడబెట్టినట్టు 2009లో టిడిపి సాక్ష్యాధారాలతో సహా దర్యాప్తు సంస్థలకు అందజేసిందని ఆయన పేర్కొన్నారు. తాము సాక్ష్యాధారాలు అందజేసిన వాటిలో రూ.43 వేల కోట్లను మాత్రమే సిబిఐ గుర్తించిందని, మిగిలిన రూ. 57 వేల కోట్లు ఏమయ్యాయని యనమల ప్రశ్నించారు.
ఏడాదికి రూ. 300 కోట్ల చొప్పున జప్తు చేస్తే ఇంత పెద్ద మొత్తాన్ని జప్తు చేయడానికి ఎన్నేళ్ళు పడుతుందన్నారు. వైయస్ హయాంలో 2.70 లక్షల ఎకరాల భూములను అక్రమంగా కేటాయించగా, ఇప్పటి వరకు 1,699 ఎకరాలను మాత్రమే జప్తు చేశారని, మిగిలిన 2,68,301 ఎకరాలను ఎప్పుడు జప్తు చేస్తారన్నారు.
శాసనసభ టికెట్‌కు రూ.10 కోట్లు, లోక్‌సభ టికెట్‌కు రూ.100 కోట్ల చొప్పున ఇప్పటికే వసూలు చేసిన డబ్బును జగన్ వ్యాపార సంస్థలకు, పవర్ ప్లాంట్లకు మళ్లించినట్లు తెలుస్తోందని, ఈ వసూళ్లపై కూడా తక్షణమే విచారణ ప్రారంభించాలని యనమల డిమాండ్ చేశారు. ఎన్నికల పేరుతో వసూలు చేసిన డబ్బును కూడా సిబిఐ, ఈడి జప్తు చేయాలని కోరారు.












Click it and Unblock the Notifications