Tamilnadu News: ఉపాధ్యాయుల వేధింపులతో విద్యార్థిని ఆత్మహత్య.. సేలం జిల్లాలో చెలరేగిన హింస..
తమిళనాడులోని కల్లకురిచి జిల్లాలో 17 ఏళ్ల పాఠశాల విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన కేసులో ఇద్దరు ఉపాధ్యాయులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థిన ఆత్మహత్యపై భారీ స్థాయిలో నిరసనలు వెల్లువెత్తాయి. నిరసనకారులు పాఠశాల బస్సులను తగలబెట్టారు, ఆస్తిని ధ్వంసం చేశారు. ఈ కేసు సీరియస్ గా తీసుకున్న పోలీసులు పాఠశాల ప్రిన్సిపాల్, సెక్రటరీని పోలీసులు అరెస్టు చేశారు.

హింసత్మకంగా మారిన నిరసనలు..
తమిళనాడు సేలం జిల్లాలోని కళ్లకురిచ్చిలో 12వ తరగతి చదువుతున్న విద్యార్థిని ఉపాధ్యాయుల వేధింపులతో ఆదివారం ఆత్మహత్య చేసుకుంది. విద్యార్థిని హాస్టల్ భవనంపై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది. ఆమె మరణానికి ఉపాధ్యాయులే కారణమంటూ జిల్లాలో నిరసనలు చెలరేగాయి. అవి కాస్త హింసత్మకంగా మారాయి.

నిరసనకారుల అరెస్ట్..
సేలం పోలీసులు పాఠశాల, ఇతర ప్రాంతాల చుట్టూ భారీ భద్రతను మోహరించారు. పలు ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించాల్సి వచ్చింది. హింసాత్మక ఘటనలకు పాల్పడి, పార్టీ ఐటీ విభాగంలో పనిచేస్తున్న ఇద్దరు అన్నాడీఎంకే కార్యకర్తలను, 100 మంది నిరసనకారులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. హింసను ప్రేరేపించింది ఎవరో తేల్చాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. విచారణ సమయంలో బాలిక తండ్రిని అనుమతించాలని కోర్టు స్పష్టం చేసింది.

సీబీ-సీఐడీ దర్యాప్తు..
మద్రాసు హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని కూడా ఏర్పాటు చేసింది. సీబీ-సీఐడీ పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈమేరకు పాఠశాల కరస్పాండెంట్ రవికుమార్ (44), అతని భార్య, పాఠశాల కార్యదర్శి శాంతి రవికుమార్ (44), ప్రిన్సిపాల్ శివశంకరన్ (57), కెమిస్ట్రీ టీచర్ హరిప్రియ (40), మ్యాథ్స్ టీచర్, హాస్టల్ వార్డెన్ కిరుతిక (28)లను తమ కస్టడీలోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications