ఉగ్రదాడి ఖండించిన కేసీఆర్.. పుట్టినరోజు వేడుకలకు దూరం
హైదరాబాద్ : కశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడిని సీఎం కేసీఆర్ ఖండించారు. ప్రాణాలు కోల్పోయిన జవాన్ల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఉగ్రవాదులు దాడి చేశారనే విషయం తెలియగానే తీవ్ర మనస్థాపానికి గురైనట్లు తెలిపారు. ఇంకా చాలామందికి తీవ్ర గాయాలయ్యాయనే సమాచారం రావడంతో కలత చెందినట్లు చెప్పారు.

ఉగ్రదాడిలో జవాన్లు మృతిచెందడంతో దేశవ్యాప్తంగా విషాదం నెలకొందని వ్యాఖ్యానించారు కేసీఆర్. ఆ క్రమంలో ఈనెల 17న తన పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండబోతున్నారు. ఆ మేరకు ప్రకటన కూడా చేశారు. పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఎవరూ కూడా తన పుట్టినరోజు వేడుకలు నిర్వహించరాదని కోరారు.
కాశ్మీర్ లో జరిగిన దాడి నేపథ్యంలో దేశ ప్రజలంతా విషాదంలో మునిగిపోయారని, తాను కూడా తీవ్రంగా మనస్తాపానికి గురయ్యానని, ఈ పరిస్థితుల్లో ఈ నెల 17న తన పుట్టిన రోజు సందర్భంగా ఎలాంటి వేడుకలు జరపవద్దని పార్టీ నాయకులను, కార్యకర్తలను, అభిమానులను సీఎం అభ్యర్థించారు.
— Telangana CMO (@TelanganaCMO) February 15, 2019
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించాలని ఇప్పటికే పార్టీ క్యాడర్ సన్నద్ధమైంది. పలుచోట్ల ఫ్లెక్సీలు కూడా ప్రింట్ వేయించారు. ఇంకా రెండు రోజులే సమయం ఉండటంతో దాదాపు అన్నీ ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. అయితే కశ్మీర్ లో ఉగ్రదాడి జరిగిన కారణంగా 40కి పైగా జవాన్లు మృత్యువాత పడటంతో.. పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండాలని కేసీఆర్ నిర్ణయించారు. ఆ మేరకు క్యాడర్ కూడా ఎలాంటి వేడుకలు జరపొద్దని సూచించారు. అధినేత ఆదేశాలతో పార్టీ కార్యకర్తలు కేసీఆర్ బర్త్ డే సెలబ్రేషన్స్ కు దూరంగా ఉండబోతున్నారు.












Click it and Unblock the Notifications