• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ముగిసిన క్యాబినెట్: పది జిల్లాల తెలంగాణకే ఆమోదం

By Pratap
|

Telangana - India
న్యూఢిల్లీ: పది జిల్లాల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకే మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాయల తెలంగాణ ప్రతిపాదనను మంత్రివర్గం ఉపసంహరించుకుంది. దీనిపై విస్తృతంగా చర్చించిన తర్వాత కూడా పది జిల్లాల తెలంగాణకే మొగ్గు చూపింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ముసాయిదా బిల్లును కేంద్ర మంత్రి వర్గం ఆమోదించింది. దీనిపై కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే మంత్రి వర్గ సమావేశం అనంతరం సవివరమైన ప్రకటన చేశారు. రేపు గానీ ఎల్లుండి గానీ ముసాయిదా బిల్లును రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పంపించనున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రపతి శానససభకు ఎంత సమయం ఇస్తారనేది తెలియదని, తాము మాత్రం శీతాకాలం సమావేశాల్లో బిల్లును ప్రతిపాదించాలని అనుకుంటున్నామని షిండే చెప్పారు.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిని పదేళ్ల పాటు ఉమ్మది రాజధానిగా చేయనున్నట్లు ఆయన తెలిపారు. జల వనరుల నిర్వహణలో కేంద్రం పాలు పంచుకుంటుందని ఆయన చెప్పారు. నీటి కేటాయింపుల బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని ఆయన అన్నారు. జీవోఎం సిఫార్సులను తాము ఆమోదించామని చెప్పారు. తెలంగాణ గవర్నర్‌కే హైదరాబాద్ పాలనా బాధ్యతలను అప్పగించనున్నట్లు చెప్పారు. సీమాంధ్రుల భద్రత బాధ్యతను గవర్నర్ చూస్తారని ఆయన చెప్పారు. కేంద్రం ఇద్దరు సలహాదారులను నియమిస్తుందని షిండే అన్నారు. ఆర్టికల్ 371డి రెండు రాష్ట్రాల్లో అమలులో ఉంటుందని ఆయన చెప్పారు.

పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటిస్తామని ఆయన చెప్పారు. రెండు రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం సహకరిస్తుందని ఆయన చెప్పారు. సీమాంధ్ర కొత్త రాజధాని ఏర్పాటుకు కేంద్రం సహకరిస్తుందని ఆయన చెప్పారు. భాగస్వాములు, పార్టీలతో చర్చించిన తర్వాతనే రాష్ట్ర విభజనపై నిర్ణయం తీసుకున్నామని ఆయన చెప్పారు. కొత్త రాజధాని ఏర్పాటుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. 45 రోజుల్లో నిపుణుల కమిటీ కొత్త రాజధానిని గుర్తిస్తుందని ఆయన చెప్పారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని షిండే తెలిపారు.

బంద్‌కు జగన్ పిలుపు

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ముసాయిదా బిల్లుకు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలపడాన్ని నిరసిస్తూ రేపు శుక్రవారం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ సీమాంధ్ర బంద్‌కు పిలుపునిచ్చారు. బంద్‌లో అన్ని వర్గాల ప్రజలు పాల్గొనాలని ఆయన కోరారు. తెలుగు ప్రజల అభిప్రాయాన్ని కేంద్రం పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. రాష్ట్రంలోని 75 శాతం ప్రజలు సమైక్యాంధ్రనే కోరుకుంటున్నారని ఆయన చెప్పారు. సమైక్యం కోసం ప్రజలు నాలుగు నెలలుగా ఉద్యమం చేస్తున్నారని ఆయన గుర్తు చేశారు. ఓట్లు, సీట్ల కోసం కాంగ్రెసు దిగజారిందని ఆయన వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రి వర్గ నిర్ణయం వినాశం దిశగా మరో అడుగు అని జగన్ అన్నారు. బంద్ నేపథ్యంలో రేపు వైయస్ విజయమ్మ గండికోట వద్ద తలపెట్టిన ధర్నాను రద్దు చేశారు.

హైదరాబాద్‌పై కెసిఆర్ అసంతృప్తి

హైదరాబాద్‌పై ఆంక్షలు పెట్టాలని కేంద్ర మంత్రి వర్గం నిర్ణయించడం పట్ల తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు అసంతృప్తి వ్యక్తం చేశారు. హైదరాబాద్ శాంతిభద్రతలను గవర్నర్ చేతిలో పెట్టాలని నిర్ణయించడాన్ని ఆయన వ్యతిరేకించారు. సాంకేతిక విద్యలో ప్రస్తుత అడ్మిషన్ల విధానాన్నే కొనసాగించాలని నిర్ణయించడం పట్ల కూడా ఆయన ఆసంతృప్తి వ్యక్తం చేశారు. రేపు పోలిట్‌బ్యూరో సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకుంటామని ఆయన చెప్పారు. ఇది సంబరాలు చేసుకునే సమయం కాదని ఆయన అన్నారు.

చారిత్రక విజయం: జైపాల్ రెడ్డి

పది జిల్లాల తెలంగాణ ఏర్పాటుకు కేంద్ర మంత్రి వర్గం నిర్ణయించడం చారిత్రక విజయమని కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి అన్నారు. తెలంగాణ విషయంలో తెలంగాణవాళ్లంతా సోనియా గాంధీకి రుణపడి ఉన్నారని ఆయన అన్నారు. కేంద్ర మంత్రి వర్గ నిర్ణయం తర్వాత తెలంగాణ నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన అమరులకు ఆయన జోహార్లు అర్పించారు. పార్లమెంటు శీతాకాలం సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు ఆమోదం పొందుతుందనే విశ్వాసం ఉందని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలు, ఆంధ్రప్రజలు వేర్వేరు కారని, అందరూ తెలుగువారేనని ఆయన అన్నారు.

జానారెడ్డి కృతజ్ఝతలు

పది జిల్లాల తెలంగాణ ఏర్పాటుకు కేంద్ర మంత్రి వర్గం నిర్ణయం తీసుకున్నందుకు తెలంగాణకు చెందిన మంత్రులు, నాయకులు, శాసనసభ్యులు కృతజ్ఢతలు తెలిపారు. కాంగ్రెసు విశ్వసనీయతను దెబ్బ తీసేందుకు కొందరు ప్రయత్నించారని వారందరి తరఫున కె. జానారెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ జెఎసి నేతలు కూడా అపోహ పడ్డారని ఆయన అన్నారు. తెలంగాణ కాంగ్రెసు నేతలు ఎన్నో ఒత్తిళ్లను ఎదుర్కున్నారని ఆయన చెప్పారు. తెలంగాణ కావాలంటూనే కాంగ్రెసును విమర్శించి రాజకీయ ప్రయోజనం పొందడానికి ప్రయత్నించారని జానా రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెసుకు అండగా నిలవాలని ఆయన కోరారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెసుకు మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. తెలంగాణ ప్రక్రియ వేగవంతంగా జరుగుతుందని ఆయన అన్నారు.

తెలంగాణ అమరవీరులకు అంకితం

తమ పార్టీ జాతీయ నేతలు పార్లమెంటులో పోరాటం చేయడం వల్లనే కేంద్రం తెలంగాణపై నిర్ణయం తీసుకునే అనివార్యతలో పడిందని బిజెపి రాష్ట్రాధ్యకుడు జి. కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమంలో బిజెపి కీలక పాత్ర పోషించిందని ఆయన అన్నారు. తెలంగాణ అమరవీరులకు ఈ తెలంగాణను అంకితం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణ కోసం పోరాటం చేసిన అన్ని వర్గాలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. తమ పార్టీ జాతీయ నేత సుష్మా స్వరాజ్‌కు ఆయన అభినందనలు తెలిపారు. తమ జాతీయ పార్టీ నేతలు రాజ్‌నాథ్ సింగ్, అద్వానీలకు ఆయన అభినందలు తెలిపారు. పది జిల్లాల తెలంగాణకు మాత్రమే మద్దతు ఇస్తామని సుష్మా స్వరాజ్ గట్టిగా చెప్పారని ఆయన గుర్తు చేశారు. ప్రత్యామ్నాయాలు కాంగ్రెసు పార్టీ రూపొందించినా బిజెపి వైఖరికి మాత్రమే కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపిందని, తెలంగాణలో బిజెపి పోషించిన కీలకమైన పాత్రను ప్రజలు అర్థం చేసుకోవాలని ఆయన అన్నారు.

English summary
Cabinet has decided to carve 10 district Telangana state. In a marathon cabinet meeting held under the chairmanship of PM Manmohan singh agreed for the Andhra Pradesh reorganisation bill - 2013
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more