వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Dopamine Fasting: ఏమిటీ ఉపవాసం, టెక్ నిపుణులు ఎందుకు దీన్ని అనుసరిస్తున్నారు?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
డోపమైన్ ఫాస్టింగ్

సాధారణంగా ఉపవాసం చేసేటప్పుడు ఆహారం లేదా పానీయాలను పూర్తిగా తీసుకోవడం మానేస్తారు. లేదా స్వల్ప పరిమాణంలో తీసుకుంటారు.

అయితే, ఇలాంటి ఉపవాసాల్లో చాలా రకాలు ఉన్నాయి. మీకు తెలుసా? సంతోషాన్ని ఎక్కువగా ఇచ్చే పదార్థాలకు దూరంగా ఉండటమూ దీనిలో ఒకటి. ఎందుకంటే ఈ పదార్థాలు ఒక్కోసారి మనకు చేటుచేసే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు మనం వాటికి బానిసలుగా కూడా మారిపోతాం.

ఏళ్ల నుంచి ఇలానే ''డోపమైన్ ఫాస్ట్’’ పేరుతో ఒక ట్రెండ్ టెక్ పరిశ్రమలో కనిపిస్తోంది.

డోపమైన్ అనేది ఒక న్యూరోట్రాన్స్‌మిటర్. ఇది మన మెదడులో సంతోష స్థాయిలను పెంచడంలో తోడ్పడుతుంది. కదలికలు, స్మృతులు, కొత్త విషయాలు నేర్చుకోవడంతోనూ దీనికి సంబంధం ఉంటుంది.

కాబట్టి డోపమైన్ ఫాస్టింగ్ వల్ల ఆధునిక ప్రపంచంలో చుట్టూ కనిపించే ప్రలోభాల నుంచి మనం తప్పించుకోవచ్చు. ముఖ్యంగా టెక్ ఉత్పత్తులతో విపరీతంగా అనుసంధానం కావడాన్ని దీనితో తగ్గించుకోవచ్చు.

ఈ ఫాస్టింగ్ సాయంతో మెదడును వేగంగా రీచార్జ్ చేసుకోవచ్చు. కొద్ది సమయంలోనే మళ్లీ మనం ఉత్సాహంగా పనిచేసుకోవచ్చు.

డోపమైన్ ఫాస్టింగ్

సిలికాన్ వ్యాలి ట్రెండ్

''డోపమైన్ ఫాస్టింగ్ అంటే.. ఎలాంటి ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను ఉపయోగించకపోవడం కాదు. అలానే ఎలాంటి ఆహారాన్ని తీసుకోకపోవడం కూడా కాదు. ఇంకా ఎవరితోనూ మాట్లాడకపోవడం అసలు కాదు’’అని అమెరికా పారిశ్రామికవేత్త జేమ్స్ సింకా బీబీసీతో చెప్పారు.

''డోపమైన్ ఫాస్టింగ్ అంటే మెదడులో డోపమైన్‌ విడుదలయ్యేందుకు కారణమయ్యే పనులకు దూరంగా ఉండటం’’అని ఆయన వివరించారు.

''డోపమైన్ నేషన్’’ పేరుతో సైకియార్టిస్టు అన్నా లెంబెక్ ఒక పుస్తకం రాశారు. గత ఐదేళ్లలో సిలికాన్ వ్యాలిలో డోపమైన్ ఫాస్టింగ్‌ను అనుసరిస్తున్న టెక్ నిపుణుల సంఖ్య క్రమంగా పెరుగుతోందని ఆమె చెప్పారు.

నిజానికి డోపమైన్ ఫాస్టింగ్ అంటే, మనం ఎలాంటి ఉపవాసం చేయాల్సిన పనిలేదు. మెదడులోని డోపమైన్ విడుదలకు కారణమయ్యే లేదా మెదడును ఉత్తేజితం చేసే పనులకు దూరంగా ఉంటే చాలు.

''మన చుట్టూ ఉండే ప్రపంచంలో అన్నీ కావాల్సిన దానికంటే ఎక్కువే కనిపిస్తాయి. దీని వల్ల మనపై విపరీతమైన ఒత్తిడి పడుతుంటోంది’’అని అన్నా వివరించారు.

''ఇది నిజంగా ఒక పరస్పర విరుద్ధమైన భావన లాంటిది. మనకు కావాల్సినవన్నీ దొరికితే మన జీవితం గొప్పగా ఉంటుందని మనం అనుకుంటాం. కానీ, అలా ఎప్పటికీ జరగదు’’అని ఆమె చెప్పారు.

''మనం ఇప్పుడు ఒక టిప్పింగ్ పాయింట్‌కు చేరుకున్నాం. మనకు దగ్గర ఉండే వస్తువులు పెరిగేకొద్దీ.. మన సంతోషం కూడా తగ్గుతుంది’’అని ఆమె అన్నారు.

డోపమైన్ ఫాస్టింగ్

మెదడులో ఎలా?

డోపమైన్ అనే రసాయనం మన మెదడులో ఉత్పత్తి అవుతుంటుంది. సంతోషం, స్ఫూర్తి, సంతృప్తి లాంటి భావనల్లో ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది.

మన మెదడులో ''రివార్డ్ పాత్‌వే’’గా పిలిచే ప్రాంతంలో డోపమైన్ మరింత ఎక్కువగా విడుదలైనప్పుడు, మన అనుభూతి మరింత సంతోషకరంగా మారుతుంది.

న్యూరోసైన్స్‌లో గత 75ఏళ్లలో వెలుగులోకి వచ్చిన అద్భుతమైన విషయం ఏమిటంటే.. మెదడులో సంతోషానికి కారణమయ్యే భాగాలే నొప్పి, బాధల్లోనూ ప్రధాన పాత్ర పోషిస్తాయని శాస్త్రవేత్తలు కనిపెట్టారు.

మనం చాక్లెట్ తినప్పుడు మన మెదడులో డోపమైన్ విడుదల అవుతుంది. అయితే, ఈ పెరిగిన స్థాయిలకు మెదడు త్వరగానే అలవాటు పడిపోతుంది. అయితే, ఈ స్థాయిలు తగ్గినట్లు అనిపించినప్పుడు నెగిటివ్ ప్రభావం కలిగినట్లు అనిపిస్తుంది.

''ఇది ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాంటిది. ఇది ఎప్పుడూ పైకి, కిందకు వెళ్తుంది’’అని అన్నా చెప్పారు.

డోపమైన్ ఫాస్టింగ్

''ఒకరోజు ఫాస్టింగ్ చేస్తే’’

''మన మెదడును వీలైనంత ఎక్కువ ఉత్తేజితం చేసేలా సోషల్ మీడియా క్రియేటర్లు పనిచేస్తుంటారు. ఫలితంగా మనలో మరింత ఎక్కువ డోపమైన్ విడుదల అవుతుంది’’అని జేమ్స్ సింకా అన్నారు.

''ఇక ఆహారం విషయానికి వస్తే.. మార్కెట్‌లో కనిపించే ప్రాసెస్డ్ ఫుడ్స్ కూడా ఇలానే డోపమైన్‌ను పెంచుతాయి. ఇదివరకు ఇంత ప్రాసెస్డ్ ఫుడ్ మార్కెట్‌లో ఉండేది కాదు’’అని ఆయన వివరించారు.

''మరోవైపు పోర్న్ అన్నింటికంటే ఎక్కువగా మన మెదడును ఉత్తేజితం చేస్తుంది. డేటా స్పీడ్ పెరగడంతో ఈ కంటెంట్ ఎక్కువగా మనకు అందుబాటులో ఉంటోంది’’అని ఆయన అన్నారు.

మరోవైపు గంజాయి లాంటి మత్తుమందులు కూడా డోపమైన్ స్థాయిలను ప్రభావితం చేయగలవు. ''100 ఏళ్ల మునుపటితో పోల్చినప్పుడు ఇది పది కంటే ఎక్కువ రెట్లు ఎక్కువగా ఇప్పుడు ప్రభావం చూపిస్తోంది’’అని జేమ్స్ చెప్పారు.

అయితే, డోపమైన్ ఫాస్ట్‌తో మంచి ఫలితాలు ఉంటాయని ఆయన వివరించారు. ''డోపమైన్ ఫాస్ట్ చేసేటప్పుడు.. సాధారణంగా ఒక రోజు మొత్తం ఫాస్టింగ్‌లోనే ఉంటాను. ఉదయం లేచిన వెంటనే, ధ్యానం చేస్తాను. ఆ తర్వాత నీరు తాగుతాను. కాసేపు హాయిగా నడకకు వెళ్తాను. ఆ తర్వాత సాధారణంగా పనిచేసుకుంటాను’’అని ఆయన చెప్పారు.

అయితే, ఈ ఫాస్టింగ్ కొత్త విధానమేమీ కాదు. బౌద్ధ సన్యాసులు ఏళ్లుగా దీన్ని అనుసరిస్తున్నారు. ఆధునిక ప్రపంచంలో దీనితో చాలా మేలు జరుగుతుందని టెక్ నిపుణులు కూడా భావిస్తున్నారు. ''మన మెదడును ఉత్తేజితం చేసే అంశాలు నేడు చాలా ఎక్కువగా ఉన్నాయి. వాటి నుంచి మనం దూరంగా, జాగ్రత్తగా ఉండాలి’’అని జేమ్స్ అన్నారు.

''కేవలం మన సొంత ఆలోచనలతో ఒంటరిగా గడపడంతో బయోకెమికల్, సైకిలాజికల్‌గానూ ప్రయోజనాలు ఉంటాయి’’అని ఆయన చెప్పారు.

డోపమైన్ ఫాస్టింగ్

మరింత సంతోషంగా..

మొదట్లో మన మెదడులో ముప్పులు, భయానికి అనుగుణంగా డోపమైన్ ఉత్పత్తి అయ్యేది. ఆదిమానవులు తమకు సంతోషాన్ని ఇచ్చే పనులు మాత్రమే చేసేవారు. ''నీరు, ఆహారం లేకపోతే మనం చనిపోతామని అప్పటి మనుషులకు తెలుసు. అందుకే ఆహారం, నీరును వెతుక్కుంటూ వారు వెళ్లేవారు. ఇవి కనిపించినప్పుడు వారిలో డోపమైన్ స్థాయిలు పెరిగేవి’’అని అన్నా చెప్పారు.

''కానీ, ఇప్పుడు మనం జీవిస్తున్న ప్రపంచం చాలా క్లిష్టమైనది. ఇక్కడ కొకైన్, సెక్స్, వీడియో గేమ్స్ ఇలా చాలా అందుబాటులో ఉన్నాయి. మనకు ఏం కావాలన్నా ఫోన్‌తో చిటికెలో ఆర్డరు చేసుకోవచ్చు’’అని ఆమె వివరించారు.

''అంటే ఇప్పుడు మనం సంతోషాన్ని ఇచ్చే అంశాల వెంట పడుతున్నాం. అయితే, ఇలా సంతోషాన్ని వెతుక్కుంటూ వెళ్లేటప్పుడు, మన సంతృప్తి లభించే స్థాయిలు కూడా పెరుగుతాయి. అప్పుడు మనల్ని మరింత సంతోషంగా ప్రేరేపించే వాటిని వెతుక్కోవాల్సి ఉంటుంది’’అని ఆమె అన్నారు.

''మన మెదడులోని సర్క్యూట్‌లు, రివార్డ్ విధానాలు మారడం చాలా కష్టం. ఎందుకంటే పరిణామ క్రమంలో భాగంగా ఇవి ఇలా మారుతూ వచ్చాయి’’అని ఆమె వివరించారు.

అయితే, ఈ లక్షణాలు బల్లులు, కొన్ని ఇతర జీవుల్లోనూ ఇలానే ఉన్నాయని ఆమె చెప్పారు.

కానీ, ఆ పరిస్థితిని మనం కొంతవరకు మార్చుకునే అవకాశం మన చేతిలోనే ఉంటుందని ఆమె అన్నారు.

ఏమిటీ ప్రయోజనం?

డోపమైన్ ఫాస్టింగ్‌తో మెదడులోని రివార్డ్ పాత్‌వేలు మారుతాయని సైకియార్టిస్టు అన్నా చెప్పారు.

అయితే, మళ్లీ మనం సాధారణ ప్రపంచంలోకి వచ్చినప్పుడు ఏం చేస్తున్నామనేదే అసలు ప్రశ్న అని ఆమె వ్యాఖ్యానించారు.

''ఇక్కడ సంతోషాన్నిచ్చే అన్ని పనులనూ ఆపేయాలని మేం చెప్పడం లేదు. కానీ, మనకు సమస్యలు తెచ్చిపెట్టే కొన్ని ముప్పులు, పదార్థాలను మనం ముందుగానే గుర్తించాలి. వాటిపై మనం దృష్టి కేంద్రీకరించాలి. ఏవి మనకు నష్టాన్ని చేస్తాయో అనేది వ్యక్తిని బట్టీ మారుతుంటాయి’’అని ఆమె చెప్పారు.

ఈ విధానాన్ని 30 రోజులు వరుసగా పాటించాలని ఆమె సూచిస్తున్నారు.

''ఎందుకంటే మెడులోని నాడులు కొత్త పరిస్థితులకు అలవాటు పడటానికి కనీసం 30 రోజులు పడుతుంది’’అని ఆమె అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Dopamine Fasting: What Is Fasting, Why Are Tech Experts Following It?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X