వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తొలిరోజు అనిశ్చితి: ఒకవైపు సంబురాలు.. మరోవైపు నిరసనలు..

చారిత్రాత్మక వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) అమల్లోకి వచ్చి ఒకరోజు గడిచింది. ఒకవైపు సంబురాలు.. మరోవైపు నిరసనల మధ్య దేశవ్యాప్తంగా అనిశ్చితి, ఆందోళన కొనసాగుతున్నది.

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/ హైదరాబాద్‌: చారిత్రాత్మక వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) అమల్లోకి వచ్చి ఒకరోజు గడిచింది. ఒకవైపు సంబురాలు.. మరోవైపు నిరసనల మధ్య దేశవ్యాప్తంగా అనిశ్చితి, ఆందోళన కొనసాగుతున్నది. ఇటు వ్యాపారులు.. అటు వినియోగదారుల్లో సందిగ్ధత నెలకొన్నది. సగటు భారతీయుడికి జీఎస్టీ మేలుచేస్తుందని కేంద్రంలోని మోదీ సర్కార్ ఢంకా బజాయించి చెప్తున్నది. ఇన్‌స్పెక్టర్‌రాజ్‌కు చరమగీతం పాడినట్లేనని వాదిస్తున్నది.

భారత చార్టర్డ్ అక్కౌంటెంట్ల సంస్థ (ఐసీఏఐ) వ్యవస్థాపక దినోత్సవ వేడుకలో పాల్గొన్న ప్రధాని నరేంద్రమోదీ పన్ను ఎగవేతకు పాల్పడే కంపెనీలపై కొరడా ఝళిపిస్తామని హెచ్చరించారు. గుజరాత్ సహా పలు రాష్ర్టాల్లో వస్త్ర వ్యాపారులు నిరసన బాటలోనే సాగారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో జీఎస్టీ కింద 18 శాతం పన్ను మాత్రమే విధించాలని ప్రతిపాదిస్తే.. మోదీ సర్కార్ నాలుగు స్లాబ్‌ల విధానాన్ని అమల్లోకి తెచ్చిందని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా మండిపడ్డారు.

ఇటు సంబురాలు.. అటు నిరసనలు

ఒకవైపు సంబురాలు జరుగుతుండగా మరోవైపు నిరసన ప్రదర్శనలు సాగుతున్నాయి. జీఎస్టీ ప్రారంభంతో సామాన్యుడికి మేలు జరుగుతుందని ప్రభుత్వం చెప్తున్నది. జీఎస్టీ అమలుపై వినియోగదారులు ఫిర్యాదుచేయడం లేదని, కేవలం కొందరు వ్యాపారులు గగ్గోలు పెడుతున్నారని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ వ్యాఖ్యానించారు. గోవాలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా మాట్లాడుతూ ఇన్‌స్పెక్టర్ రాజ్‌కు భరత వాక్యం పలికినట్లేనన్నారు. జీఎస్టీ వల్ల సామాన్యులకు, వ్యాపారులకు, పారిశ్రామిక రంగానికి లబ్ధి చేకూరుతుందని ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ట్వీట్ చేశారు. జీఎస్టీ అమలుతో దేశమంతా నూతన పన్ను వ్యవస్థలోకి పరివర్తన చెందటం మంచిదే అయినా, ప్రారంభం పేరిట అర్ధరాత్రి హంగామా అనవసరమని కేరళ సీఎం పినరయి విజయన్ ఫేస్‌బుక్‌లో వ్యాఖ్యానించారు.

GST implementation: First Day confusion in telangana

వ్యాపార వర్గాల్లో ఆందోళన.. గందరగోళం

వ్యాపార వర్గాల్లోనూ కొంత గందరగోళం, ఆందోళన కొనసాగుతున్నది. పన్నులు తగ్గినందు, ఆ మేరకు ధరలు తగ్గుతాయని ప్రజలు ఎదురుచూశారు. కొనుగోళ్లపై ఆచితూచి స్పందించారు. దీంతో శనివారం మార్కెట్లలో సందడి తగ్గింది. సెల్‌ఫోన్లపై పన్ను పెరగడంతో వాటి కొనుగోళ్లపై తీవ్ర ప్రభావం పడింది. బంగారం దుకాణాల్లో మాత్రం సాధారణ పరిస్థితి కొనసాగింది. ఉదయం నుంచే హోటళ్లలో జీఎస్టీ మేరకు పన్నులు వసూలు చేశారు. భారీ మాల్స్‌లో శనివారమూ డిస్కౌంట్‌ అమ్మకాలు కొనసాగాయి. వారం నుంచి భారీగా డిస్కౌంట్‌ అమ్మకాలతో పాత స్టాకును విక్రయించుకోవడానికి ప్రయత్నించాయి. జీఎస్టీ మేరకు పన్ను రేటును మార్పిడి కోసం పెద్ద సూపర్‌మార్కెట్లు సాధారణ విక్రయాలను నిలిపివేశాయి.

నేటి నుంచి జీఎస్టీ మేరకు విక్రయాలు

ఆదివారం నుంచి జీఎస్టీ మేరకు అమ్మకాలు కొనసాగిస్తామని ఓ సంస్థ మేనేజర్‌ తెలిపారు. జీఎస్టీలోకి మారుతున్న నేపథ్యంలో శనివారం విక్రయాలు నిలిపివేశామని బోర్డులు పెట్టారు. ఎటువంటి పన్ను లేని పాలు, పండ్లు, కూరగాయలు, గుడ్లు మాత్రం విక్రయించారు. పాత స్టాక్‌ నమోదు చేయడం కీలకమైన అంశం కావడంతో వ్యాపారులు దీనికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇప్పటి వరకూ వాణిజ్యపన్నుల శాఖలో నమోదు చేసుకోని వాళ్లు కూడా నమోదు చేయించుకోవాల్సిన అంశాలపై దృష్టి సారించారు.

నిరసనలు ఇలా

దుస్తులపై 5 శాతం జీఎస్టీని వ్యతిరేకిస్తూ గుజరాత్‌లోని వస్త్ర వ్యాపారులు దుకాణాలు మూసేశారు. జమ్ముకశ్మీర్‌లోనూ దుకాణాలు మూతబడ్డాయి. జీఎస్టీతో 370 అధికరణం కింద తమ రాష్ర్టానికి గల ప్రత్యేక హోదాకు ముప్పు వాటిల్లుతుందని కశ్మీర్‌లోని వివిధ పార్టీల నేతలు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే శనివారం రిటైల్ సూపర్ మార్కెట్లు జీఎస్టీకి అనుగుణంగా తమ బిల్లుల్లో మార్పులు చేశాయి. కానీ హోటళ్లు, కాఫీ షాప్‌లు తొలిరోజు చేతిరాత బిల్లులతోనే సరిపెట్టాయి. కొన్ని నగరాల్లో సినిమా టికెట్ల ధరలు తగ్గిపోగా, కొన్ని థియేటర్లు మాత్రం నష్టాన్ని పూడ్చుకొనేందుకు కనిష్ఠ రేట్లను పెంచాయి. మధ్యప్రదేశ్‌లో శనివారం హోల్‌సేల్ మార్కెట్లు ఏవీ తెరుచుకోలేదు. వేర్వేరు సరుకులపై జీఎస్టీ ఎలా విధించాలో తెలియని గందరగోళం వ్యాపారుల్లో నెలకొందని చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు రమేశ్ ఖండేల్వాల్ చెప్పారు. వారం దాకా ఈ గందరగోళం కొనసాగవచ్చన్నారు.

పన్నులేని మిఠాయికి జీఎస్టీ పోటు

కోల్‌కతాలో వ్యాపారులు జీఎస్టీని వ్యతిరేకిస్తూ సమ్మెకు దిగారు. ఇంతకాలం ఎటువంటి పన్నులేని బెంగాలీ మిఠాయిలు ఇప్పుడు జీఎస్టీ పరిధిలోకి రావడంపై నగరవాసులు కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. చౌకగా లభించే సందేశ్ మిఠాయిపై 5 శాతం, డబ్బాలో పెట్టే మిఠాయిలపై 18 శాతం, చాకొలేట్ స్వీట్లపై 28 శాతం పన్ను పడుతున్నది. జీఎస్టీతో మిఠాయిలు చేదెక్కుతాయని వివేక్ అనే వ్యాపారి ఆవేదన వ్యక్తం చేశారు.

చెన్నైలో రెండు నెలల దాకా పాత రేట్లే!

చెన్నైలో సినిమా టికెట్లపై జీఎస్టీతోపాటు ప్రత్యేకంగా రాష్ట్ర పన్ను కూడా విధించనున్నారు. ఈ రెండు పన్నులు చెల్లించడం తమవల్ల కాదని థియేటర్ యాజమాన్యాలు సోమవారం నుంచి నిరవధిక సమ్మెకు పిలుపు ఇచ్చాయి. దుకాణాల్లో ప్రస్తుతం ఉన్న నిల్వలన్నీ అమ్ముడుపోయే వరకూ ధరలను సవరించరాదని రిటైలర్లు నిర్ణయించారు. దీంతో చెన్నై వాసులు మరో రెండు నెలల పాటు పాత ధరలకే సరుకులు కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ రోజుల్లో లూజుగా గోధుమ పిండి కొనేవారు ఎక్కడున్నారని, ప్యాకింగ్ లేకుండా అమ్మితే ఎవరూ కొనరని బెంగళూరుకు చెందిన ఓ వ్యాపారి చెప్పారు. ప్యాకింగ్ చేసిన వస్తువులపై పన్ను విధించి ప్రభుత్వం తమను మోసం చేసిందని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. జీఎస్టీతో ద్రవ్యోల్బణం పైకి ఎగబాకుతుందని, దీంతో ఆహార పదార్థాల ధరలు కూడా పెరుగుతాయని బెంగళూరులోని ఏపీఎంసీ యార్డ్‌కు చెందిన రమేశ్ అనే వ్యాపారి అన్నారు.

చిన్న షాపుల్లో యథాతథం

చిన్న చిన్న కిరాణా షాపులు, వీధుల్లో జరిగే విక్రయాలు మాత్రం యథాతథంగా సాగాయి. హైదరాబాద్‌లో అతిపెద్ద వస్త్ర దుకాణాలు, షాపింగ్‌ మాల్స్‌లో విక్రయాలపై తీవ్ర ప్రభావం పడింది. ఎలక్ట్రానిక్‌ వస్తువులు కొనుగోలు చేయడానికి ప్రజలు నిరాసక్తి ప్రదర్శించా. పూర్తి స్థాయిలో సాధారణ పరిస్థితి నెలకొనడానికి వారం పడుతుందని వ్యాపార వర్గాలు చెప్తున్నాయి. హోటళ్లు మినహా మిగతాచోట్ల విక్రయాలు శుక్రవారం రేట్లతోనే జరిగాయి. జీఎస్టీ నేపథ్యంలో వ్యాపార, వర్తక సంఘాలు ప్రత్యేకంగా సమావేశాలు జరుపుకున్నాయి.

కొత్తగా 45 వేల రిటర్న్స్‌ దాఖలు

తెలంగాణలో ప్రస్తుతం వ్యాట్‌ పరిధిలో 2లక్షల వ్యాపార సంస్థలు ఉండగా జీఎస్టీ నేపథ్యంలో ఇవి మరో 45 వేల దాకా పెరుగుతాయని అధికారుల అంచనా. సేవా పన్ను కూడా రాష్ట్రం పరిధిలోకి రావడంతో మరో 25వేల సంస్థలు పెరుగుతాయని, ఇవి గాక వస్త్రవ్యాపారులు 20 వేలమంది పెరుగుతారని.. దీంతో రిటర్న్‌లు దాఖలు చేయాల్సిన సంస్థలు 2.45 లక్షల వరకూ చేరతాయని అంటున్నారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచి తెలంగాణలోని 16 వాణిజ్య పన్నులశాఖ చెక్‌పోస్టులను ఉపసంహరించారు. దీంతో ఎలాంటి తనిఖీలు లేకుండానే వాహనాలు సరిహద్దులు దాటాయి. వాణిజ్య పన్నులశాఖ కార్యాలయాల్లో సందడి నెలకొన్నది. హైదరాబాద్‌లోని పన్నులశాఖ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేకంగా ముగ్గులు వేసి జీఎస్టీని స్వాగతిస్తున్నట్లు రాశారు.

రాష్ట్ర వాణిజ్యశాఖ ఉద్యోగులకు ఇలా సోమేశ్‌కుమార్ అభినందనలు

తెలంగాణలో జీఎస్టీ అమలుకు కృషి చేసిన రాష్ట్ర పన్నులశాఖ అధికారులు, ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ప్రత్యేక అభినందనలు తెలిపారు. వ్యాపార వర్గాలకు పూర్తిగా అవగాహన కలిగించి జీఎస్టీ అమలుకు పూర్తి స్థాయిలో సంసిద్ధమయ్యారని ప్రశంసించారు.

English summary
First Day confusion for implementation of GST while customers are responded cautiously in the market. Business people had focus on GST's registration and retailers are sales only milk, fruits and vegetable.Shoping malls are busy with offerings.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X